Chandrabose: ఆలయాల నుండి ఆస్కార్ వరకు

అది వరంగల్ జిల్లా చల్లగరిగె అనే చిన్న గ్రామం. ఆ ఊర్లో ఒక గ్రంథాలయం , ఒక శివాలయం వాటికి కొంచెం చేరువలో ఒక ఇల్లు,
ఆ ఇంట్లో కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ అనే అబ్బాయికి తెల్లవారుజామున శివాలయంలో వినిపించే పాటలు కంఠస్థం, హృదయస్తం అయిపోయాయి. పొద్దున్న పాటలు, సాయంత్రం గ్రంథాలయంలోని పుస్తకాలు, వీటి మధ్య పెరిగాడు ఆ అబ్బాయి.
సినిమా మీద మక్కువతో సినిమాల్లో పాటలు పాడాలని ఎన్నో పాట్లు పడ్డాడు, ఫలితం లేదు. పుస్తకాలు చదివిన అనుభవం, సాహిత్యం మీద ఉన్న ప్రేమతో పాటలు రాయడం మొదలు పెట్టాడు.

షాజహాన్ ప్రేమకు చిహ్నమైన “తాజ్ మహాల్” అనే సినిమా సుభాష్ చంద్రబోస్ ను చంద్రబోస్ చేసింది. “మంచు కొండల్లోన చంద్రమా
చందనాలు చల్లిపో” అనే పాటే ఇక వరుస అవకాశాలు ఇచ్చుకుంటూ పోయింది. అంచలంచెలుగా ఎదిగేలా చేసింది. వరుస అవకాశాలను అందుకున్న చంద్రబోస్ కేవలం పాటలే రాయలేదు, పాఠాలు రాసారు.
ఆయన పాటలు చాలామందికి ఓదార్పు అయ్యాయి. చాలా మందిని మేల్కొల్పాయి. భరోసా అయ్యాయి, బ్రతుకుకు బాటలు వేసాయి.
అలిసిపోయి ఆగిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు లాక్కెళ్ళాయి.

క్లిష్టమైన ట్యూన్ లో కూడా “ప్రతిరోజూ విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చుద్దామంటే కాలం ఆగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతె తీరదు” అని ధైర్యం ఇవ్వడం ఆయన కలానికే చెల్లింది. “అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు
సందేహాలే సందేశాలు, చీట్కరాలే సత్కారాలు, అనుకోవాలీ… అడుగేయాలీ..” అని ఓదార్పు ఇచ్చి స్ఫూర్తిని రగిలించడం అతని శైలి. కూసింత బాధ వస్తే కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతున్న మనకు చంద్రబోస్ సడన్ గా వచ్చి “కన్నుల నీటిని కళల సాగుకై వాడుకో, కాల్చె నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచు అంటారు. పండితులకు మాత్రమే అర్ధమయ్యేలా కాకుండా పామరులు సైతం అర్ధం చేసుకునేలా అలవోకగా ఒక పాటను రాయడంలో చంద్రబోస్ మేటి.

- Advertisement -

చంద్రబోస్ కేవలం జీవితం మలుపు తిప్పే పాటలను రాసారు అనుకుంటే పొరపాటే. మనిషికి వలపు పుట్టే పాటలను కూడా రాసారు.
“ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం” అంటూ చిలిపి భావాలను సైతం పలికించింది ఆయన కలం.
“కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే
తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే
రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే
మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే”
అంటూ ముక్తపదగ్రస్తంలో శృంగారాన్ని అందంగా చెప్పడం ఆయన ప్రతిభకు మరో నిదర్శనం.

ఒక మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో తో కూడా
“పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్న,
కలిసిఉంటూ ఏకత్వం భోదిస్తున్న,
ఎందుకు మాకి హింసావాదం
ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పారా మాకు సోదర భావం
మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా” అని చెప్పించగలగడం చంద్రబోస్ తెలివికి నిదర్శనం.

ఆస్కార్ అంటే ఎక్కడో ఉంటుంది, అది మన ఊహకు కూడా అందదు. అనుకునే తరుణంలో నాటు నాటు పాటతో, రాజమౌళి , కీరవాణి లా సహాయంతో తెలుగు సినిమా ఫేట్ ను మార్చి మనకు ఆస్కార్ ను తీసుకొచ్చిన ఘనుడు చంద్రబోస్. ఆలయాల నుండి ఆస్కార్ వరకు మొదలైన ఆయన ప్రయాణం ఒక అద్భుతం.

ముందుకు పరుగెత్తుకెళ్లిపోవటమే మోక్షం అనుకునే ప్రపంచంలో ఆగి వెనక్కి తిరిగిచూడ్డం అనే అలవాటే పోయింది.
కానీ….. వేళ్ళని పట్టించుకోని చెట్లు –
మూలాల్ని మర్చిపోయిన మనుషులు ఉండరు
ఒకవేళ ఉన్నా ఆనందంగా ఉండలేరు.
ఈ మాటలను బలంగా నమ్ముతూ ఆస్కార్ వరకు సాగిన తన ప్రయాణంలో కీలకపాత్రను వహించిన అందరివద్దకు ఆస్కార్ అవార్డు ను తీసుకుని వెళ్ళిన చంద్రబోస్ వ్యక్తిత్వం చాలామందికి ఆదర్శం.

నేడు చంద్రబోస్ పుట్టినరోజు సందర్భంగా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Filmify.in తరుపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు.

#HappyBirthdayChandrabose

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు