Love Today : యూత్ కు కనెక్ట్ అయ్యేలా..

ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన తమిళ చిత్రం “లవ్ టుడే”. ఇందులో ఇవానా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు.  ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 

తెలుగులో కూడా  ‘లవ్ టుడే’ టైటిల్ తో విడుదల చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నవంబర్ 15న విడుదల కావాల్సి ఉండగా.. సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఈ ఈవెంట్ ని వాయిదా వేశారు. తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ని ఒకసారి పరిశీలించినట్టయితే.. “నీ గురించి నాకు మొత్తం తెలుసురా… నాకు నీ గురించి మొత్తం తెలిసు బేబి.” అనే డైలాగ్ తో ప్రారంభమవుతుంది. హీరో, హీరోయిన్ ప్రేమ పెళ్లికి హీరోయిన్ తండ్రి సత్యరాజ్ ఒక కండిషన్ పెడుతాడు. తమ ఆచారం ప్రకారం.. ఇద్దరు ఫోన్లు మార్చుకోవాలని చెబుతాడు. “ఒకే ఒక రోజు నీ ఫోన్ తను, తన ఫోన్ నువ్వు మార్చుకుంటారు. రేపు మీరిద్దరూ ఓకే అనుకుంటే నాకు డబుల్ ఓకే” అంటూ సత్యరాజ్ చెప్పే డైలాగ్ ఉంటుంది. అక్కడి నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని అర్థమవుతోంది. ఇద్దరు ఫోన్లు మార్చుకున్న తర్వాత వారి గురించి ఏం తెలుసుకున్నారు ? ఒకరి సీక్రెట్స్ ఒకరికి తెలియడంతో ఈ జంట పెళ్లి వరకు వెళ్లిందా ? అసలు సత్యరాజ్ ఈ కండిషన్ ఎందుకు పెట్టాడు ? అనేవి సినిమాలో తెలుస్తుంది. 

- Advertisement -

లవర్స్ ఫోన్లు మార్చుకుంటే ఏం జరుగుతుంది ? అనే చిన్న కాన్సెప్ట్ తో ఈ స్టోరీని దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. యూత్ ను కనెక్ట్ చేసే స్టోరీ కాబట్టి తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో దిల్ రాజు విడుదల చేయనున్నారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 18న విడుదల కావాల్సింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం..  హీరో, హీరోయిన్ తెలుగులో పెద్దగా పరిచయం లేకపోవడంతో ఈ సినిమాని వాయిదా వేశారు. ఈ నవంబర్ లోనే థియేటర్ లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులో ఆకట్టుకుంటుందో లేదో అనేది తెలియాలంటే విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు