Puri Jagannadh: శిఖరం- పాతాళం – సహజం

నర్సీపట్నంలో ఓ పిల్లాడు.. అర్థంకాకపోయినా  తన తండ్రి బీరువాలో ఉన్న పుస్తకాలన్నీ చదివేశాడు. 6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ‘తొలి చినుకు’ అనే ఒక కథను రాసి, ఇంట్లో ఒక చోట దాచాడు. ఆ కథను చూసిన వాళ్ళ నాన్న దాని గురించి తన అభిప్రాయాన్ని దానిపైనే రాసి మళ్ళీ అదే ప్లేస్‌లో పెట్టారు. ఈ పిల్లాడికి స్కూల్‌కి వెళ్లడం, వాళ్లకు ఉన్న సినిమా థియేటర్‌లో ప్రతిరోజూ సినిమా చూడటం, వాళ్ళ నాన్న పుస్తకాలు చదవటం అలవాటుగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒకరోజు ఊళ్లో ఆ కుర్రాడు ఒక నాటకాన్ని డైరెక్ట్ చేశాడు. అది చూసిన వాళ్ళ నాన్న అతడి చేతికి కొంత డబ్బిచ్చి ‘సినిమాల్లోకి వెళ్ళరా పనికొస్తావ్’ అని చెప్పి పంపించారు.

ఆ కుర్రాడే ఇప్పుడు సంచలన దర్శకుడిగా కీర్తించబడుతున్న డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ అయ్యాడు.

పూరీ హైదరాబాద్‌కు వచ్చి మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్స్/ యాక్టింగ్ కోర్స్‌లో జాయిన్ అయ్యాడు. అలా రోజులు గడిచాయి. ఏవేవో పనులు చేస్తూ జీవితం కొనసాగిస్తున్నాడు. ఎవరికైనా కథలు చెప్పాలంటే కిలోమీటర్లు నడుస్తున్నాడు. ఎట్టకేలకు సూపర్ స్టార్ కృష్ణతో ‘తిలానా’ అనే ఒక సినిమా ఓకే అయింది. కానీ, ఆగిపోయింది. సుమన్ హీరోగా ‘పాండు’ అనే సినిమా ఓకే అయింది. కానీ, అది కూడా పట్టాలెక్కలేదు.
పవన్ కల్యాణ్‌తో సినిమా చెయ్యాలి అనుకున్నాడు. కెమెరామెన్ చోటా కే నాయుడు ద్వారా పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం ఉందని తెలుసుకొని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ‘ముందు కథ నాకు చెప్పు నాకు నచ్చితే నేను కల్యాణ్ దగ్గరికి తీసుకెళ్తా’ అని చెప్పారు చోటా.
ఆ ఒప్పందంతో చాలా ఆసక్తికరంగా చోటాకి ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ కథ చెప్పాడు. ఆ కథ నచ్చడంతో పూరీని పవన్ కల్యాణ్ దగ్గరికి పంపించాడు. పూరి మాత్రం పవన్ కల్యాణ్‌కి ‘బద్రీ’ సినిమా కథను చెప్పాడు.
ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కి రిలీజయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇండస్ట్రీకి యాటిట్యూడ్ ఏంటో అప్పుడే పరిచయమైంది.

- Advertisement -

తరువాత పూరి కెరియర్‌లో ఎన్నో హిట్ సినిమాలు.. మరెన్నో డిజాస్టర్లు
హిట్ సినిమా తీసినప్పుడు పొంగిపోలేదు.. ప్లాప్ సినిమా తీసినప్పుడు కుంగిపోలేదు. ప్రతిసారీ నిలబడ్డాడు. పడిన ప్రతిసారీ అంతకంటే వేగంగా పైకి లేచాడు. చాలా మందికి ఆదర్శం అయ్యాడు. ఇంకెంతోమందికి దిశా నిర్దేశకుడు అయ్యాడు.

వాడికి తెలుసు ఈ క్షణం శాశ్వతం కాదని,
అయినా గుర్తుచేసుకోవడానికి ఒంటిపై
“Not permanent” అని టాటూ వేసుకుని
ఒళ్లు దగ్గరపెట్టుకుని బతుకుతాడు!
ఒక successకి ముందుండే Struggling daysని అసలు కష్టాలే కాదంటాడు,
నిజమైన కష్టాలు success తర్వాత మొదలవుతాయని బోధిస్తాడు!
నష్టపోయాను అని కాకుండా
కుక్కకు అన్నం పెట్టలేకపోయానని ఏడ్చే మానవత్వం వాడిది!
నిజమైన కష్టం మనిషికి ప్రకృతి నుంచి వస్తుందని నమ్మే వ్యక్తిత్వం వాడిది!
ఎవడు ఏమనుకుంటాడోనని కాకుండా..
అనిపించింది మాట్లాడే మూర్ఖత్వం వాడిది!
వాడంతే.. అనిపించింది చెప్తాడు.. అనుకున్నది చేస్తాడు!

వాడే.. బుల్లెట్స్ లాంటి డైలాగులు పేల్చే పూరీ జ‘గన్’.

సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి శిఖరాన్ని చూశాడు. అదే శిఖరం నుంచి పాతాళంలోకి పడిపోయాడు.. మళ్ళీ సహజంగానే నిలబడి హిట్స్ కొట్టాడు. ఏది ఏమైనా తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే..

సినిమా సినిమా సినిమా అని అనునిత్యం పరితపించే పూరీ జగన్నాథ్ ఇలానే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ చాలా మంది రాబోయే దర్శకులకు దిశా నిర్దేశం అవుతారని ఆశిస్తూ Filmify.in హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు