RRR : మ‌రో అరుదైన ఘ‌న‌త

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఏ సినిమా తెర‌కెక్కించిన అది సంచ‌ల‌న‌మ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా క‌లెక్ష‌న్ల ప‌రంగా ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం విధిత‌మే. జ‌క్క‌న్న చిత్రానికి ఏకంగా ప్ర‌పంచ‌మే ఫిదా అవ్వ‌డం విశేషం. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న‌కు విదేశీయల నుంచి కూడా మ‌న్న‌న‌లు అందుకోవ‌డం విశేషం. అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తూ దూసుకెళ్తోంది. ఈ చిత్రం జ‌పాన్‌లో స‌త్తా చాటుతుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి అరుదైన గౌర‌వం ద‌క్కింది.

ప్ర‌తీ సంవ‌త్స‌రం అమెరికాలో హాలీవుడ్ చిత్రాల‌కు ఇచ్చే శాట‌ర్న్ అవార్డు ఈ సంవ‌త్స‌రం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వ‌రించింది. ఉత్త‌మ అంత‌ర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డును ద‌క్కించుకుంది. జ‌క్క‌న్న జ్యూరీకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపించారు. “బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరిలో మా సినిమా ఈ అవార్డు ద‌క్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా టీమ్ త‌రుపు నుంచి జ్యూరీ స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు. బాహుబ‌లి 2 త‌రువాత నాకు వ‌చ్చిన రెండో శాట‌ర్న్ అవార్డు ఇది. ఈ అవార్డుల ప్రదానోత్స‌వంలో పాల్గొనాల‌ని అనుకున్నాను. కానీ జ‌పాన్‌లో ప్ర‌మోష‌న్లు చేస్తున్నందుకు రాలేక‌పోయాను. విజేత‌లంద‌రికీ నా అభినంద‌నలు” అంటూ చెప్పుకొచ్చారు.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూ.400 కోట్ల బ‌డ్జెట్‌తో డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ అద్భుతంగా న‌టించారు. బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్, శ్రియ‌, స‌ముద్ర ఖ‌ని కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు