Bigg Boss : హౌస్ లోనే విన్నర్స్.. బయట లూజర్స్

హాలీవుడ్ కల్చర్.. ఒకే హౌస్ లో అమ్మాయిలను, అబ్బాయిలను వంద రోజులు ఉంచడం.. సమాజానికి ఏ మాత్రం ఉపయోగం లేని షో.. ఇలాంటి విమర్శలు కోకొల్లలు. దేనిపై అనుకుంటున్నారా.. అదేనండి ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ గురించే. హాలీవుడ్, బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలో ఈ రియాలిటీ షో ఎలా ఉన్నా, టాలీవుడ్ లో మాత్రం ప్రతి సీజన్ ప్రారంభంలో ఇలాంటి విమర్శలే వస్తాయి. ఎన్ని విమర్శలు వస్తున్నా, సాధారణ స్థాయి ప్రేక్షకుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ రియాలిటీ షోపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి సారి భారీ అంచనాలు ఉంటున్నాయి.

ఇంత భారీ హైప్ ఉన్న బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎంతో కష్టపడి, ప్రేక్షకులను మెప్పించి విజయం సాధించిన వారికి పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మొదటి సీజన్ నుంచి ఇటీవల వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ వరకు విన్నర్స్ బయటకు వచ్చిన తర్వాత లూజర్స్ గా మిగిలిపోతున్నారు. విన్నర్ గా నిలుస్తే, క్రేజీ పెరుగుతుంది.. అవకాశాలు వస్తాయి.. హీరో, హీరోయిన్ కావచ్చు.. అని అనుకుంటున్నారు. కానీ, ఈ రియాలిటీ షో నుంచి బయటకు వచ్చి రియల్ గా చూస్తే అలాంటి సూచనలు కనిపించడం లేదు.

2017 లో వచ్చిన మొదటి సీజన్ లో చాలా పోటీని ఎదుర్కొని, శివ బాలాజీ విన్నర్ గా నిలిచాడు. దీని తర్వాత చెప్పుకొదగ్గ పాత్ర రాలేదు అని చెప్పొచ్చు. రెండో సీజన్ లో కౌశల్ గెలిచాడు. విలన్, హీరో పాత్రలు వస్తున్నాయని స్వయంగా చెప్పాడు. కానీ అలాంటి పరిస్థితులు లేవు. మూడో సీజన్ కు రాహుల్ సిప్లిగంజ్ విజేత. కానీ, రాహుల్ జీవితంలో బిగ్ బాస్ ముందు, తర్వాత ఏమైనా మారిందా.. అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పొచ్చు.

- Advertisement -

నాలుగో సీజన్ లో అభిజిత్ విన్నర్. హీరోగా ఒక అవకాశం వచ్చింది. కానీ అది ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇదే సీజన్ లో ఉన్న సోహెల్ ఇప్పటి వరకు మూడు సినిమాలను ప్రకటించి ఫుల్ జోష్ లో ఉన్నాడు. అలాగే అఖిల్.. అప్పుడప్పుడు బుల్లితెరపై కనిపిస్తున్నాడు. ఇక ఐదో సీజన్ లో వీజే సన్ని విజేతగా నిలిచాడు. హీరోగా ఒక సినిమా ఛాన్స్ వచ్చిందని కూడా ప్రకటించాడు. ఇదే సీజన్ లో రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆహాలో ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరు తో వచ్చిన ఓటీటీలో షోలో బిందు మాధవి గెలిచింది. తనకు బయట హీరోయిన్ గా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ, అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.

మొత్తంగా బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే.. ప్రైజ్ మనీ. కాస్త పేరు మినహా అవకాశాల పరంగా పెద్దగా ఒరిగేదేమీ లేదు అని స్పష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ నెల 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం కాబోతుంది. మరీ ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లకు అయినా, సినిమా అవకాశాలు వస్తాయా ? లేకా ఎప్పటి లాగే ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తూ కాలాయాపన చేయాల్సి వస్తుందా ? అనేది చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు