Kangana Ranaut : బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలెంటెడ్ హీరోయిన్లలో ఈమె ఒకరు. నటనకు ప్రాధాన్యమిచ్చే రోల్స్ చేసే హీరోయిన్లలో ఈమె ముందుంటుంది. అలాగే బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా ఈమెకి పేరు కూడా ఉంది. బాలీవుడ్ లో పలు విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అవి న్యాయపరమైనవే అయినా, పలువురు దర్శకనిర్మాతలు, హీరోలపై కామెంట్స్ చేయడం వల్ల ఇండస్ట్రీ లో టాక్ అఫ్ ది టౌన్ గా అప్పుడప్పుడూ విమర్శల పాలు అవుతుంటుంది. అదే ఇప్పుడు ఆమెకు నష్టం తెచ్చిపెడుతుంది అనిపిస్తుంది. ఇక కంగనా రనౌత్ “మండి” నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారంలో తిరుగుతున్నారు. ఎంపీ గా గెలిచి పార్లమెంట్ లో మొట్ట మొదటి సారి కాలు మోపాలని తన వంతు ప్రయత్నాలన్నీ చేస్తుంది. కానీ ఆమెకి మద్దతుగా మాత్రం బాలీవుడ్ పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు నిలబడిన వైనం కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరూ మద్దతు ప్రకటించలేదు.
బాలీవుడ్ సపోర్ట్ కరువు?
అయితే కంగనా రనౌత్ పోటీ చేస్తోంది.. అన్న సందర్భంగా కూడా తన తోటి హీరోయిన్లు గాని, టెక్నిషియన్లు గాని, ఎవరూ విషెస్ కూడా చేయలేదు. మరి లోలోపల కంగనా కి ఫోన్లు చేసి మద్దతిస్తున్నారా? లేదా? అన్నది కూడా తెలియదు. ఇదే ఎన్నికల్లో బాలీవుడ్ నుండి ప్రముఖ నటీనటులు హేమా మాలిని, అరుణ్ గోవిల్, గోవిందా, రవి కిషన్ లాంటి వారు కూడా బిజెపి నుండి, అలాగే సురేష్ గోపి లాంటి వారు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్లకి మాత్రం కొందరు వెనుక నుంచి మద్దతు తెలుపుతున్నట్లు ప్రచారంలోకి వస్తోంది. కానీ కంగన విషయంలో మాత్రం ఇండస్ట్రీ మౌనం వహిస్తుందనే అంశం చర్చకొస్తుంది. అయితే అందుకు కారణంగా కంగన మూక్కు సూటి తత్వమనే కొందరు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా కంగనకి పేరుంది. కాస్టింగ్ కౌచ్ పై నిర్మొహమాటంగా మాట్లాడిన నటి, కొంత మంది దర్శక నిర్మాతలపై కూడా కంగన గతంలో ఆరోపణలు చేసింది. దర్శకులు ఆమె పట్ల నడుచుకున్న తీరుకావొచ్చు. పారితోషికం విషయంలో నిర్మాతలతో వివాదాలు కావొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే నటుడు హృతిక్ రోషన్ తో రిలేషన్ షిప్ వ్యవహారంపై కంగన చేసిన ఆరోపణలు బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే.
ఆ వివాదాలే ఇప్పుడు అడ్డు?
ఏది ఏమైనా కంగనా (Kangana Ranaut) ఆ మధ్య పలు వివాదాల్లో ఉండడం వల్ల, ఆ సమయంలో కంగన చేసిన వ్యాఖ్యలు ఇరకాటంలో పడేసాయి. ఆ కారణంగా ఇతర బ్యానర్లలో అవకాశాలు తగ్గడంతో సొంతంగా బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మించడం మొదలు పెట్టింది. ఇవన్నీ కంగనని బాలీవుడ్ లో రాజకీయంగా ఒంటిరిని చేసినట్లుగా కనిపిస్తుంది. ఈ ఒంటరి పోరాటంలో నెగ్గాలంటే కంగన ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాల్సిందే. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. జనసేన పార్టీ తరుపున బరిలోకి దిగుతోన్న పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ నుంచి పెద్ద మద్దతు లభిస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఫ్యామిలీ మొదలుకొని ఇతర స్టార్ హీరోలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు.