MM Keeravani : పవిత్ర ఆస్కార్‌పై ప్రాంతపు ముద్ర… నీచ రాజకీయమా వర్ధిల్లు

MM Keeravani : రాజకీయం… ఏం చేయగలదు.
ప్రాణ స్నేహితులను వీడతీయగలదు.
సొంత తమ్ముల మధ్య తగాదాలు పెట్టగలదు.
ప్రేగు తెంచి, నవ మాసాలు మోసిన అమ్మనే అత్యంత క్రూరంగా చంపగలదు.
ఇక ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాం… ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రజల్లో విషం నింపగలదు.

ఇంత చేసిన రాజకీయం… సంగీతంపై పడలేదా. పడింది.. ఇప్పుడు సంగీతంపై రాజకీయం… నీచ రాజకీయం చేస్తుంది. అలాంటి ఇలాంటి సంగీతంపై కాదు… ఏళ్లుగా తెలుగు చిత్ర సీమకు ఓ కలలా ఉన్న ఆస్కార్‌ను తీసుకొచ్చి ఒడిలో చేర్చి తెలుగు సినిమా పరిశ్రమ, తెలుగు రాష్రాలు అంటే ప్రపంచ వేదికపై తల ఎత్తుకునేలా చేసిన సంగీతం పై రాజకీయం పడి దాడి చేస్తుంది. ఇప్పుడు ఈ రాజకీయం – సంగీతం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉన్న జయ జయహే తెలంగాణ పాటలో మార్పులు చేయ్యాలని అనుకున్నాడు. ఈ పాట రాసిన అందే శ్రీ తో చర్చలు జరిపి, తెలుగు చిత్ర సీమ ఒడిలో అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ చేర్చిన ఎంఎం కీరవాణి సాయంతో ఈ మార్పులు చేయబోతున్నాడు. ఇక్కడ మొదలైంది అంతా…

- Advertisement -

నీచ రాజకీయమా వర్ధిల్లాలి

తెలుగు చిత్ర సీమ అమ్ముల పొదిలో ఆస్కార్ అవార్డును తీసుకొచ్చిన కీరవాణి కంటే గొప్ప వాళ్లు ఉన్నారా…? అందుకే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతం కోసం ఆయన సాయం కోరింది. కానీ, దీనిపై రాజకీయం మొదలైంది. తెలంగాణ ప్రాంతం… ఆంధ్ర ప్రాంతం అంటూ కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేసి, తెలుగు సంగీతంపై, ఆస్కార్ అవార్డ్ పై ప్రాంతపు రంగును అద్దుతున్నారు. తెలంగాణ పాట కోసం ఆంధ్రోడు సంగీతం ఇవ్వడం ఏంటి అంటూ చర్చలు చేసి, ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతున్నారు.

ఆస్కార్ తెచ్చినప్పుడు తెలుగోడు… ఇప్పుడు ఆంధ్రోడు…

ఇప్పుడు ప్రజల్లో విషాన్ని నింపుతున్న వాళ్లు రెండేళ్ల క్రితం ఇదే కీరవాణి కోసం ఏం అన్నారో మర్చిపోయి ఉంటారు.
తెలుగు చిత్ర సీమకు కీరవాణి ఆస్కార్ తీసుకొచ్చాడు.
ఇది తెలుగు నేలకు గొప్పతనం.
తెలుగు నేల తల ఎత్తుకునే రోజు.
ప్రపంచ వేదికలపై తెలుగుతానాన్ని చూపించారు.
తెలుగు రాజసాన్ని చూపించారు…
ఇంకా ఎన్నో ఎన్నో మాటలు చెప్పి… ఇదే కీరవాణిని తమ వ్యక్తి అంటూ చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడు ప్రాంతపు పేరు జోడించి విమర్శలు చేస్తున్నారు. అప్పుడు ఈ కీరవాణిది ఆంధ్ర ప్రాంతం అని గుర్తు రాలేదా అంటూ నెటిజన్లు, సంగీత అభిమానులు అంటున్నారు.

controversy over the Oscar award winner
ఆస్కార్‌తో కీరవాని, చంద్రబోస్

అప్పుడు సత్కరాలు.. ఇప్పుడు చిత్కారాలు..

కీరవాణి, సుభాష్ చంద్ర బోస్… ఆస్కార్ అవార్డులు అందుకుని వచ్చిన తర్వాత 2023 ఏప్రిల్ 09న అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో BRS పార్టీ శిల్పకళా వేదికపై ఘనంగా సత్కరాలు చేశారు. అప్పటి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ రావు సన్మానించారు. ఇప్పుడు అదే పార్టీ కి చెందిన కీలక నేతలు, కీరవాణిపై ఆంధ్రోడు అంటూ చిత్కారాలు పెడుతున్నారు.

controversy over the Oscar award winner
ఆస్కార్ అవార్డ్ తర్వాత కీరవాణిని సన్మానిస్తున్న అప్పటి ప్రభుత్వ పెద్దలు

కళారంగం ఎప్పుడు ప్రాంతలకు, భాషకు అతీతం…

సినిమాకి, సంగీతానికి, సాహిత్యానికి భాషతో గాని ప్రాంతంతో గాని సంబంధం ఉండదు. ఒకవేళ అదే ఉంటే తెలంగాణ దర్శకులు కూడా నేడు మంచి గుర్తింపును సాధించుకుంటున్నారంటే కేవలం తెలంగాణ ప్రేక్షకులు మాత్రమే సినిమాలు చూడటం వలన కాదు. సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, నాగ అశ్విన్ , వేణు ఊడుగుల వంటి తెలంగాణ దర్శకులు కూడా నేడు అన్ని ప్రాంతాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక క్రిస్టియన్ చర్చికి మాత్రమే వెళ్తాడు, ఒక ముస్లిం మసీదుకు మాత్రమే వెళ్తాడు, ఒక హిందూ గుడికి మాత్రమే వెళ్తాడు.

కానీ వీళ్ళందరూ కూడా వెళ్లే ఏకైక ప్లేస్ సినిమా. అటువంటి సినిమా అటువంటి సాహిత్యం, అటువంటి సంగీతం భాషకి ప్రాంతానికి ఇప్పటికే కాదు ఎప్పటికీ అతీతం. చాలామంది తమిళ్ హీరోస్ కు కూడా ఇక్కడ బ్రహ్మరథం పడుతుంటారు. వాళ్ల సినిమాలు రీ రిలీజ్ అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ ఆకాశాన్ని అంటుతాయి. అలాంటిది ఇన్నేళ్లు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి తప్ప, ఇలా ఆంధ్ర తెలంగాణ అంటూ మాట్లాడితే వచ్చేదేమీ లేదు. అలా మాట్లాడిన వారి మీద ఉన్న గౌరవం తగ్గడం తప్ప.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు