Salman Khan : ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల అమ్మాయి పన్వెల్‌లోని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఫామ్‌హౌస్ దగ్గర రచ్చ రచ్చ చేసింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీసుకు ఎందుకు అరెస్ట్ చేశారంటే?
సల్మాన్ ఫామ్ హౌజ్ దగ్గర అమ్మాయి అరెస్ట్
పన్వెల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్ చాలా ఫేమస్. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఫామ్‌హౌస్ కొన్ని కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగర్ అక్కడ రెక్కీ నిర్వహించి సల్మాన్ పై దాడికి ప్లాన్ వేసినట్లు షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫామ్‌హౌస్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ బయట 24 ఏళ్ల యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు? సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉందా ? అని సల్మాన్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.
ఆ అమ్మాయి ఎవరు?
ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల అమ్మాయి సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్‌హౌస్ బయట అరెస్ట్ అయ్యిందంటే వార్త సంచలనంగా మారింది. ఆ యువతి చెప్పిన దాని ప్రకారం ఆమె సల్మాన్‌కు వీరాభిమాని. తాను సల్మాన్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అందుకే ఫామ్‌హౌస్‌కి చేరుకుని అతన్ని కలవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో ఆమె పెద్దగా అరవడంతో పాటు గొడవ గొడవ చేసి కాసేపు టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అయితే చుట్టుపక్కల వారు ఆమె చేసిన గందరగోళాన్ని ఫోన్లో రికార్డ్ చేసి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సల్మాన్ ఫామ్‌హౌస్‌లో ఉన్నాడా?
ఈ సంఘటన జరిగినప్పుడు సల్మాన్ పన్వెల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో లేరు. కానీ ఆ యువతి మాత్రం సల్మాన్‌ను వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తపరుస్తూ భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. ఎట్టకేలకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని న్యూ పన్వేల్‌లోని ఓ ఎన్జీవోకు కౌన్సెలింగ్ కోసం పంపారు.
ఆ అమ్మాయి కండిషన్ ఎలా ఉంది?
ఎన్జీవో వ్యవస్థాపకులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక మెంటల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సల్మాన్ ఖాన్ ఆన్-స్క్రీన్ ఇమేజ్‌తో ఆమె గాఢంగా ప్రేమలో పడింది. మానసిక చికిత్స కోసం ఆమెను కలంబోలిలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఆమె కుటుంబీకులను సంప్రదించి ఘటనపై సమాచారం అందించారు. చికిత్స అనంతరం ఆమెను ఇంటికి పంపించనున్నారు.
సల్మాన్ ఇంటిపై దాడి కేసులో మరో వ్యక్తి అరెస్ట్
ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌పై ఏప్రిల్ నెలలో ఇద్దరు యువకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. దాడి అనంతరం పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంత జరిగినా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌పై మరో కొత్త కుట్ర పన్నింది. అయితే ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సల్మాన్ ఖాన్‌పై కొత్త కుట్రకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లోని మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో నవీ ముంబై పోలీసులు పన్వేల్‌కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు.