SP Balasubrahmanyam Birth Anniversary : గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల “బాలసుబ్రహ్మణ్యం”.. స్వరార్చనకు రుణపడిన చిత్రసీమ..

SP Balasubrahmanyam Birth Anniversary : “శ్రీపతి పండితారాధ్యుల “బాలసుబ్రహ్మణ్యం”. గాన గంధర్వుడిగా, సుస్వరాల బాలుగా, నాలుగు దశాబ్దాల పాటు భారతీయ సినీ ప్రస్థానంలో తిరుగులేని మహా గాయకుడిగా వెలుగొందారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో ఏళ్ల పాటు సంగీత ప్రియులను అలరించిన ఆయన, సుమారు నలభై వేలకు పైగా పాటలను పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మరాఠీ, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్ ఇలా దేశంలోని ఎన్నో భాషల్లో ఆయన తన అద్భుతమైన గాత్రాన్ని వినిపించారు. ఎస్పీ బాలు పాట వింటే చాలు శ్రోతలు మైమరచిపోతారు. ఆయన గొంతు వింటే సంగీత ప్రియుల మదిలో తేనెరసం ద్రవిస్తున్న భావన. ఆయన పాటలు వింటే బండరాయి మనసులున్న వారు కూడా కరిగిపోతారు అనడంలో అతిశయోక్తి లేదు. నాలుగు దశాబ్దాల పాటు భారతీయ చలన చిత్ర సీమకి తన అద్భుతమైన గాత్రంతో స్వరార్చన చేసారు బాలసుబ్రహ్మణ్యం. ఆ సేవకి చిత్రసీమ ఎన్ని అవార్డులు, సత్కారాలు చేసినా రుణం తీరదు. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లను చేరుకోవడంతో పాటు అవార్డులు, రికార్డులను సొంతం చేసుకున్న ఆ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి (SP Balasubrahmanyam Birth Anniversary) (జూన్4) నేడు. ఈ సందర్బంగా ఆ మహాగాయకుడిని స్మరిస్తూ ఆయన జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన క్షణాలను గుర్తు చేసుకుందాం.

SP Balasubrahmanyam Birth Anniversary Special

నాలుగు దశాబ్దాల ప్రయాణం..

ఇక మద్రాసులో చదువుకుంటున్న రోజుల్లోనే బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారాయన. ఆరంభంలోనే ఎంతగానో ఆకట్టుకున్న ఎస్పీబీ, మంచి గుర్తింపును అందుకోగా, తెలుగు చలన చిత్ర సీమ లో ఘంటసాల తర్వాత అంతటి మధుర గాయకుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. ఇక దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గుర్తింపు పొందిన బాలు, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మంచి గుర్తింపును అందుకున్నారు. ‘మన్మధలీలై’ చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా సత్తా చాటారు. సుదీర్ఘమైన ప్రయాణంలో కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధణ్, సల్మాన్ ఖాన్, కే భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమిని గణేషన్, అర్జున్ సర్జా, రఘువరన్ వంటి నటులకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

- Advertisement -

నటుడిగానూ అద్భుత అభినయం..

ఇక 1969లో వచ్చిన ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అనే చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రమణ్యం నటుడిగా తన ప్రస్థానాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషించారు. ఈ క్రమంలోనే పలుమార్లు ఉత్తమ సహాయ నటుడిగానూ నిలిచారు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను చేశారు. చివరిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ‘దేవదాస్’ చిత్రంలో నటించారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు మంచి టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని ఎంతో మందికి మార్గనిర్ధేశం చేయాలన్న లక్ష్యంతో బుల్లితెరపై పాటల కార్యక్రమాలను సైతం ప్రారంభించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ క్రమంలోనే తన శిష్యులుగా ఎంతో మందిని తయారు చేసి సినీ పరిశ్రమకు అందించారు. ఆయన అడుగు జాడల్లో నడిచిన ఎంతో మంది ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సింగర్లుగా వెలుగొందుతున్నారు.

ఎస్పీ బాలుకు అవార్డుల పంట..

ఇక గాయకుడిగా ఎన్నో సంచలనాలు సృష్టించిన ఎస్పీ బాలు అద్భుతమైన గాన మాధుర్యానికి ఎన్నో భాషాల్లో ఎన్నో అవార్డులు వరించగా, మరెన్నో జాతీయ అవార్డులు సైతం దక్కాయి. నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా మెప్పించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇక ‘ఏక్ దూజే కే లియే’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘రుద్రవీణ’ చిత్రాలకు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డులు అందుకొన్నారు ఎస్పీ బాలు. ఇక వరల్డ్ రికార్డ్ పరంగానూ సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో రకాలుగా మెప్పించి చిరకాలం గుర్తుండిపోయేలా కీర్తి ఘడించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ క్రమంలోనే 11 భాషల్లో కలిపి 40 వేల పాటలు పాడారు. అదే సమయంలో 40 సినిమాలకు మ్యూజిక్ అందించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే ఏకంగా 29 నంది అవార్డులను దక్కించుకున్నారాయన. అయితే ఈ అవార్డులన్నీ కూడా ఎస్పీబి ఘనతకు కొలమానం కాదు. ఆయన చిత్ర సీమకు దూరమైనా, పాటలతో అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు