HBD Balakrishna : వెండితెర నటసింహం “నందమూరి బాలకృష్ణ”…

HBD Balakrishna : “నందమూరి బాలకృష్ణ”.. తెలుగు చలన చిత్రసీమను మూడు దశాబ్దాలు ఏలిన నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమై తన అద్భుతమైన నటనతో నేడు నందమూరి నటవారసుడిగా, వెండితెర నటసింహంగా, అభిమానుల లెజెండ్ గా నందమూరి అభిమానులని అలరిస్తున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో పాత్ర ప్రాధాన్యత కోసం ఎంతటి వైవిధ్యానికైనా, ప్రయోగాలకైనా వెనుకాడని హీరో బాలకృష్ణ. బాలయ్య డైలాగ్ చెప్పాడంటే విజిల్స్ మోత మోగిపోద్ది.. ఆయనను వెండితెరపై చూస్తున్నంతసేపు థియేటర్లలో అదో ఊపు. 14 ఏళ్లకే ఎన్టీఆర్ నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి.. నాలుగు దశాబ్దాలకుపైగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా అభిమానులని అలరిస్తూ ఇప్పటికి యంగ్ హీరోలకి సైతం పోటీనిస్తున్న నందమూరి బాలకృష్ణ (HBD Balakrishna) (జూన్10) పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా ఫిల్మిఫై తరపున ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ నాలుగు దశాబ్దాల బాలకృష్ణ నట ప్రస్థానాన్ని చర్చించుకుందాం..

HBD Balakrishna Birthday Special

నటవారసుడిగా లెగసీని నిలబెట్టిన నటసింహం..

నందమూరి బాలకృష్ణ నటుడిగా చిత్ర పరిశ్రమకు స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలోనే పరిచయం అవ్వడం విశేషం. ఎన్టీ రామారావు దర్శకత్వంలో వచ్చిన “తాతమ్మ కల” మూవీ ద్వారా బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత వరుసగా తండ్రి దర్శకత్వంలోనే ఎన్టీఆర్ తో పాటు కొన్ని సినిమాల్లో కలిసి నటించాడు. అయితే సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం “సాహసమే జీవితం” అనే చిత్రంతో. అయితే స్టార్ డైరెక్టర్‌ కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో 1984లో ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాతో హీరోగా తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు బాలకృష్ణ. ఆ సినిమా ఘన విజయం తరువాత బాలయ్య మళ్లీ వెనుతిరిగి చూసుకోలేదు. తండ్రి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుని.. తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమా ద్వారా బాలయ్యలో కామెడీ యాంగిల్‌ను ప్రముఖ దర్శకుడు జంధ్యాల అభిమానులకు పరిచయం చేశారు. ఆ తర్వాత వరుసగా ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, నారి నారి నడుమ మురారి, లారీ డ్రైవర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాలకృష్ణ ఇండస్ట్రీలో సత్తాచాటారు.

- Advertisement -

ఇక 1991లో సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా టీవీల్లో ఎప్పుడు ప్రసారం అయినా.. ప్రేక్షకులు టీవీలకు అలానే అతుక్కుపోతారు. అలాగే రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, బొబ్బిలి సింహం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాలకృష్ణ మాస్ క్రేజ్ సత్తా ఏంటో తెలిసొచ్చింది. ఇక ఈ సినిమాల హిట్స్ తరువాత బాలయ్య నటించిన ‘భైరవద్వీపం’ మూవీ మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో బాలయ్య అద్భుత నటనతో ప్రేక్షకులని విస్మయానికి గురి చేసారు.

రికార్డులకు కేరాఫ్ బాలయ్య సినిమాలు…

ఇక బాలకృష్ణ కెరీర్ కి మరింత ఊపు తెచ్చిన సినిమా ‘సమరసింహా రెడ్డి’. ఫ్యాక్షన్ సినిమాలకు నాంది పలుకుతూ.. బి.గోపాల్ డైరెక్షన్‌లో 1999లో వచ్చిన ఆ మూవీ టాలీవుడ్‌లో అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. బాలయ్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్‌ ను రెట్టింపు చేసింది. ఆ తరువాత బి.గోపాల్ డైరెక్షన్‌లోనే “నరహింహా నాయుడు” మూవీతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ చేసారు. ఆ తర్వాత 2004 విడుదలైన లక్ష్మీనరసింహ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా హిట్ తరువాత మళ్లి విజయం అందుకునేందుకు దాదాపు ఆరేళ్ళు పట్టింది. విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు, పరమవీరచక్ర వంటి వరుస ఫ్లాపులతో ఇక బాలయ్య పని అయిపోయిందనుకున్నారు అందరూ. కానీ ఏదో సినిమాలో అన్నట్టు దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందనే రితీలో ఇండస్ట్రీ షేక్ అయ్యేలా.. 2010లో “సింహా” మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. బోయపాటి శ్రీను బాలయ్య బాబును సరికొత్తగా చూపిస్తూ.. నందమూరి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.

ఆ తర్వాత 2014లో మరోసారి బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో లెజెండ్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక “గౌతమిపుత్ర శాతకర్ణి” మూవీతో ఆకట్టుకున్న బాలయ్య.. మళ్లీ బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నారు. ఇక బాలకృష్ణ ఇప్పటి వరకు 108 సినిమాల్లో నటించారు. ఇక నేడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా బాబీ డైరెక్షన్ లో వస్తున్న బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే అఖండ2 సినిమా మొదలయ్యే అవకాశం కూడా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు