Pawan Kalyan, Chiranjeevi with Modi : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో పాటు సినీ వర్గాల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవానికి మెగా ఫ్యామిలీతో పాటు రజినీకాంత్ లాంటి సీనియర్ స్టార్స్ అంతా తరలి వచ్చారు. ఉదయం 11 : 33 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ, రాజకీయ నాయకులు అతిథులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకే వేదికపై మెగా బ్రదర్స్ తో మోడీ కనిపించడం వైరల్ అవుతుంది.
ప్రధానితో మెగా బ్రదర్స్…
పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అంతులేకుండా పోయింది. స్పెషల్ గా మెగా పార్టీ నిర్వహించి తన తమ్ముడిని ఆశీర్వదించి, గుండెలకు హత్తుకోవడం దగ్గర నుంచి ఆ తర్వాత జరిగే పరిణామాలన్నీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, ఈద్ వేదికపై జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా సభా ప్రాంగణం మొత్తం పవన్ నామస్మరణతో ఓ రేంజ్ లో మార్మోగింది. ప్రమాణ స్వీకారం అనంతరం చిరంజీవి పాదాలకు పవన్ కళ్యాణ్ నమస్కారం చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖతోపాటు కొడుకు రామ్ చరణ్ తో కలిసి హాజరయ్యారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి వేదికపై తన తమ్ముడి విజయోత్సవాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు.
మెగా ఎమోషనల్
ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక ప్రధాని మోడీ వెళ్లిపోతుండగా జనసేనాని పవన్ ఆయనకు ఓ రిక్వెస్ట్ చేశారు. తన అన్నయ్య మెగాస్టార్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పగా, మోడీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన మెగా బ్రదర్స్ ను దగ్గరకు తీసుకుని ప్రజలకు అభివాదం చేయించడంతో పాటు, ఇద్దరిని కౌగిలించుకున్నారు. మోడీ ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ ను చూస్తూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఈ క్రమంలో పవన్ గడ్డాన్ని పట్టుకొని మోడీ ముందు తన తమ్ముడిని ప్రేమగా చూస్తూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. దాదాపు ఆనంద భాష్పాలు రాల్చినంత పని చేశారు. ఈ అరుదైన సన్నివేశాన్ని చూశాక అక్కడే ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ అన్నదమ్ములు ఇద్దరి అనుబంధాన్ని చూసి మెగా అభిమానులు కూడా ఎమోషనల్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. పదేళ్ల పవన్ కష్టం ఫలించింది అంటూ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఒకే ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్ తో పాటు మోడీ ఉండడంతో పిక్ ఆఫ్ ది డేకేడ్ అంటూ విపరీతంగా షేర్ చేస్తున్నారు.