Star Singer : బాలీవుడ్లో చాలా మంది ప్రముఖ నటులు, గాయకులు ఉన్నారు. కానీ కొంతమంది గాయకుల స్వరం మాత్రం హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. అ సింగర్స్ స్వరాలకు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే శక్తి ఉంటుంది. అలా హిందీ చిత్ర పరిశ్రమను తన గాత్రంతో శాసించిన గాయని అల్కా యాగ్నిక్. అయితే తాజాగా ఈ బ్యూటీ తనకో అరుదైన జబ్బు ఉందంటూ షాక్ ఇచ్చింది.
అల్కాకు అరుదైన వ్యాధి
దశాబ్దాలుగా పాటలు పాడుతున్న హిందీ సింగర్ అల్కాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె తన మధురమైన స్వరంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానుల కోసం విభిన్నమైన పోస్ట్‌లను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా అల్కా యాగ్నిక్ షేర్ చేసిన పోస్ట్ చదివిన ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అల్కా అరుదైన న్యూరో డిజార్డర్‌తో బాధపడుతున్నాను అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. పైగా దానికి కారణం ఏంటో చెప్పి షాక్ ఇచ్చింది.
అల్కా యాగ్నిక్ పోస్ట్ లో ఏముంది?
అల్కా యాగ్నిక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో ‘నా స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొన్ని వారాల క్రితం నేను ఫ్లైట్ నుండి దిగినప్పుడు, నేను ఏమీ వినలేకపోతున్నాను అని అకస్మాత్తుగా గ్రహించాను. కాసేపటి తరువాత ఇంతసేపు ఎందుకు మౌనంగా ఉన్నారని నన్ను చాలా మంది అడిగారు. చాలా వారాల తర్వాత నేను మీకు చాలా ధైర్యంగా ఈ విషయాన్ని చెబుతున్నాను. తర్వాత నేను చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లాను. ఇది సెన్సరీ నర్వ్ హియరింగ్ లాస్ అనే అరుదైన వ్యాధి అని గుర్తించారు. వైరల్ అటాక్ కారణంగా ఈ వ్యాధి వస్తుందని తెలిసింది. ఈ ఆకస్మిక సంఘటనతో నేను షాక్ అయ్యాను. కానీ నేను దీన్ని అంగీకరించడానికి ప్రయత్నిస్తున్నాను. దయచేసి నా కోసం ప్రార్థించండి’ అంటూ రాసుకొచ్చింది.
ఈ వ్యాధికి కారణం ఇదే
అదే సమయంలో అల్కా తన అభిమానులకు, తోటి గాయకులకు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చింది. ‘నేను చాలా బిగ్గరగా ఉండే సంగీతం, హెడ్ఫోన్ల గురించి హెచ్చరించాలనుకుంటున్నాను. హెడ్‌ఫోన్స్‌లో బిగ్గరగా పాటలు వినడం మానుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా నా వృత్తికి సంబంధించిన ఆరోగ్య ప్రమాదాల గురించి మాట్లాడతాను. మీ ప్రేమ, మద్దతు నా జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకువస్తుంది. త్వరలో మీ అందరినీ మళ్లీ చూడాలని ఆశిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ మద్దతు నాకు చాలా ముఖ్యం’ అని తన పోస్ట్‌లో పేర్కొంది అల్కా. దీంతో ఇదంతా హెడ్ ఫోన్స్ ను ఎక్కువగా వాడడం వల్లే జరిగింది అనే విషయం అర్థం అవుతోంది.
అల్కా యాగ్నిక్ ఎవరు?
90వ దశకంలో బాలీవుడ్లో చాలా పాపులర్, ఐకానిక్ పాటలకు గాత్రాన్ని అందించిన సింగర్ అల్కా యాగ్నిక్. అల్కా బాలీవుడ్లోనే కాకుండా దేశంలోని అత్యంత పాపులర్ సింగర్లలో ఒకరు. 25కి పైగా భాషల్లో 21 వేలకు పైగా పాటలను పాడిన అల్కా రెండుసార్లు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. 2022లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పాపులర్ సింగర్ గా చోటు దక్కించుకుంది.