Adithi Rao Hydari : హైదరాబాదీ బ్యూటీ అదితి రావ్ హైదరీ తాజాగా ఎయిర్పోర్ట్ లో చిక్కుకుంది. గత 32 గంటలుగా అదితి ఎయిర్ పోర్ట్‌లో తన లగేజీ కోసం వెయిట్ చేస్తోందట. ఆ ఎయిర్ పోర్ట్ లో జరిగిన గందరగోళం కారణంగా అదితితో పాటు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలుస్తోంది. ఇంతకీ అసలు సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లండన్ ఎయిర్ పోర్ట్ లో పడిగాపులు
హీరోయిన్ అదితి రావు హైదరీ బుధవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఓ ప్రసిద్ధ విమానయాన సంస్థకు వ్యతిరేకంగా పోస్ట్‌ను షేర్ చేసి, తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమెతో పాటు సహ ప్రయాణీకులు లగేజీ సెక్యూరిటీ చెక్ తరువాత కనిపించలేదనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత విమానయాన సంస్థ సమస్యను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినప్పటికీ, తన లగేజీ కోసం దాదాపు 32 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది అదితి.
అదితి హీత్రూ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. “ముంబై నుండి మా విమానం సరిగ్గా మధ్యాహ్నం 2.15 గంటలకు లండన్‌లో దిగింది. ఇప్పటికీ మా లగేజి అందలేదు. ప్రయాణికులు అలసిపోయి ఇలా కూర్చున్నారు. చిన్న పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు వీల్‌ఛైర్‌లో కూర్చున్నారు… ఖాళీ సామాను బెల్ట్‌ని చూస్తున్నారు… మేము అందరం మా లగేజీ కోసం ఎదురు చూస్తున్నాము. ఈ వ్యక్తులకు తమ బాధ్యత గురించి తెలియదు. విమానాశ్రయం కోసం అందించిన QR కోడ్ తప్ప, ఎవరూ ఎటువంటి సమాచారం ఇవ్వరు. వారికి ఎటువంటి బాధ్యత ఉండదు!” అంటూ సోషల్ మీడియా ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేసింది అదితి. ఆమె ఈ పోస్ట్ చేశాక సంబంధిత ఎయిర్‌లైన్ వారు సహాయం చేస్తామని రియాక్ట్ అయ్యారు. వీలైనంత త్వరగా మీ సమస్యను పరిష్కరిస్తారని ఆమెకు హామీ ఇచ్చారు. కానీ ఆ తరువాత కూడా 32 గంటల తర్వాత కూడా అదితి విమానాశ్రయంలోనే చిక్కుకుపోయింది. అదితికి ముందు కూడా చాలా మంది సెలబ్రిటీలకు ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పుడు తన లగేజీని అదితి ఎప్పుడు తిరిగి తీసుకుంటుందో, విమానాశ్రయంలో ఆమె సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
హీరామండితో మారిన పేరు
ఇక ఎయిర్ పోర్ట్ సమస్యను పక్కన పెడితే ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ‘హిరామండి: ది డైమండ్ బజార్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది అదితి. ఈ సిరీస్ కారణంగా ఆమెకు కొత్త పేరు పెట్టారు అభిమానులు. అందులో తాను పోషించిన పాత్ర ‘బిబ్బోజన్’ అనే పేరుతోనే అధితిని ఫ్యాన్స్ పిలుస్తున్నారు. హీరామండిలో మిగతా హీరోయిన్లు కూడా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ పోషించిన పాత్ర బాగా పాపులర్ అయింది. అదితి ఇటీవల సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ రిసెప్షన్ పార్టీకి తనకు కాబోయే భర్త సిద్ధార్థ్ తో కలిసి హాజరయ్యారు. ఆ తర్వాత వేరే పని మీద లండన్ వెళ్లిపోయింది. కానీ అక్కడ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.