15YearsForMagadheera : దర్శకధీరుడి ‘మగధీర’కు 15యేళ్లు.. ‘మెగా’ధీరుడి ఇండస్ట్రీ రికార్డుల జాతర..

15YearsForMagadheera : “మగధీర”.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మైలు రాయి. ఈ సినిమా అప్పటివరకు ఒకే రకమైన మాస్ మూసధోరణిలో సాగిపోతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి పాన్ ఇండియా రేంజ్ లో రుచి చూపించి, తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టిన సినిమా ‘మగధీర’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఓవర్ నైట్ స్టార్ హీరోని చేసిన మగధీర, రాజమౌళిని దర్శక ధీరుడిగా నేషనల్ వైడ్ గా మార్మోగిపోయేలా చేసింది. తెలుగు ఇండస్ట్రీని అప్పటికీ చులకనగా చూసే ఇతర ఇండస్ట్రీలకు, తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమాగా మగధీర నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో వందల థియేటర్లలో ఎన్నో రోజులపాటు ప్రదర్శింపబడిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కి కొత్త పాఠాలు నేర్పింది.

15Years For Ram charan Magadheera Movie

కనీవినీ ఎరుగని రికార్డుల జాతర…

నిజానికి రామ్ చరణ్ తొలి సినిమాని రాజమౌళిని డైరెక్ట్ చేయమని చిరు అల్లు అరవింద్ కోరగా, పలు కారణాల వల్ల కుదరలేదు. అయితే రెండో సినిమా సెట్ అయింది. రామ్ చరణ్ కి మరపురాని సినిమా ఇవ్వాలని అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో ఖర్చుకి వెనకాడకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. 40 బడ్జెట్ తో తెరకెక్కగా అప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ మూవీగా నిలిచింది. పీరియాడిక్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా, పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కిన మగధీర సినిమా 2009 లో జులై 31న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై సంచలన విజయం సాధించింది. స్పెషల్ బెనిఫిట్ షో ల నుండే యానానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మగధీర రోజోరోజుకి థియేటర్లు పెంచాల్సి వచ్చింది. అప్పటికీ ఆన్లైన్ బుకింగ్స్ కూడా లేని టైం లో మగధీర థియేటర్ల వద్ద క్యూ వద్ద డజన్ల కొద్దీ పోలీసు సెక్యూరిటీలను ప్రతి థియేటర్ల వద్ద నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే మగధీర ప్రభంజనం ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవాలి.

- Advertisement -

 

కాలభైరవ గా రామ్ చరణ్ విశ్వరూపం..

ఇక మగధీరలో రామ్ చరణ్ కాలభైరవ గా, హర్ష గా రెండు భిన్నమైన పాత్రల్లో నటించగా, కాజల్ అగర్వాల్ మిత్రవింద గా, ఇందుగా అలరించింది. మగధీరుడిగా రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి, నటనకు మెగాభిమానులు ఫిదా అయిపోయారు. అలాగే రియల్ స్టార్ శ్రీహరి షేర్ ఖాన్ గా నటించిన కీలక పాత్ర కూడా సినిమాకి బాగా హెల్ప్ అయింది.

దర్శక ధీరుడి అద్భుతమైన ప్రతిభ…

ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడిగా తన పనితనాన్ని ప్రతి ఫ్రేమ్ లో మగధీరలో చూపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన మార్క్ ని చూపించగా, కీరవాణి మ్యూజిక్ సినిమాకి ఎంతో ప్లస్ అయింది.

ఇక మగధీర రికార్డుల విషయానికి వస్తే… ఆరోజుల్లోనే అత్యధికంగా 283 డైరెక్ట్సెంటర్లలో 50 రోజులు ఆడగా, 312 షిఫ్ట్ సెంటర్లలో యాభై రోజులాడింది. ఇక తెలుగు సినిమా చరిత్ర లో అత్యధిక వంద రోజుల రికార్డు ఇప్పటికీ మగధీరకే ఉంది. మగధీర సినిమా 223 డైరెక్ట్ సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. ఇక 4 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకోగా, కర్నూలు లో లక్ష్మి థియేటర్ లో ఏకంగా 1000 రోజులు ప్రదర్శింపబడి అరుదైన రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ రికార్డులు బ్రేక్ అయ్యాయని కొన్ని చిత్రాల నిర్మాతలు పోస్టర్స్ వేసినా అవి నిజం కాదని తేలింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద అప్పటికి 78 కోట్ల షేర్ వసూలు చేసిన మగధీర 150 కోట్ల గ్రాస్ వసూలు చేసి, పోకిరిని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటికి సౌత్ ఇండియాలో రెండో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది మగధీర. ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయడానికి ఏకంగా బాహుబలి వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది. నేటికీ మగధీర విడుదలై(జులై31) 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసి, చిత్రంలో నటించిన నటీనటులకు, దర్శకుడికి అలాగే చిత్ర యూనిట్ లో అందరికి స్పెషల్ విషెస్ తెలియచేసారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు