HBD Yesudas : ఈ లెజెండరీ సింగర్ ఎంతమంది తెలుగు హీరోలకు సెంటిమెంటో తెలుసా?

HBD Yesudas : భక్తి పాటైనా, ప్రేమ లేదా విరహగీతమైనా లెజెండరీ సింగర్ ఏసుదాసు గళం నుంచి జాలువారితే ఆ తన్మత్వమే వేరుగా ఉంటుంది. దేశం గర్వించదగ్గ ఈ సింగర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలుగులో ఎంతమంది హీరోలకు ఈయన గాత్రం సెంటిమెంట్ గా మారింది ? ఎంతమంది టాలీవుడ్ హీరోలకు ఏసుదాసు పాటలు పాడారు? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఈ రోజు 84వ పుట్టినరోజును జరుపుకుంటున్న లెజెండరీ సింగర్ ఏసుదాసు 60 ఏళ్లకు పైగా సినీ రంగంలో సేవలందిస్తున్నారు. ఆయన ఇప్పటిదాకా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్, గుజరాతి, అరబిక్, రష్యన్ తదితర భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి కొత్త రికార్డును క్రియేట్ చేశారు. “హరివరాసనం” అనే భక్తి పాటతో శబరిమల అయ్యప్ప స్వామిని పరవశింపజేశారు. ఈ జోల పాటతోనే అయ్యప్ప స్వామి పవళింపు సేవను చేస్తారు. ఏసుదాసు 1940 జనవరి 10న కేరళలోని కొచ్చిలో క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు.

ఏసుదాసు తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు, ప్రముఖ రంగస్థల నటుడు. ఆయన నుంచే ఏసుదాసుకు ఈ వారసత్వం అబ్బింది. చిన్నప్పటి నుంచి ఏసుదాసు తండ్రి ప్రభావంతో పాటలు పాడుతూ ఉండేవారు. 17 ఏళ్ల వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత సంగీత కళాశాలలో చేరి తన గాత్రానికి పదును పెట్టుకున్నారు. అప్పటిదాకా ఆయన గాయకుడిగా పనికి రారని అవమానించిన వారే ఆ తర్వాత క్యూలో నిలబడేలా చేశారు. ఇక చాలామంది తెలుగు హీరోలకు కూడా ఏసుదాసు ఫేవరెట్ గాయకుడు.

- Advertisement -

కాంతారావు “బంగారు తిమ్మరాజు” అనే మూవీలో “ఓ నిండు చందమామ” అనే పాట పాడి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఏసుదాస్. ఆ తర్వాత “శ్రీకృష్ణసత్య” అనే మూవీలో “జయ రామ” అనే పాటను పాడించి ఏసుదాసుపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టారు సీనియర్ ఎన్టీఆర్. అలా ఆ తర్వాత కూడా “బ్రహ్మర్షి విశ్వామిత్ర”, “కుల గౌరవం” వంటి ఎన్టీఆర్ సినిమాల్లోనూ ఏసుదాసు పాటలు పాడారు. బాలకృష్ణ నటించిన ఫస్ట్ మూవీ “సాహసమే జీవితం”లో ఒక పాట మినహా మిగిలినవన్నీ ఏసుదాసు పాడడం విశేషం.

ఏఎన్ఆర్ “మేఘ సందేశం” సినిమాకు ఏసుదాస్ పాడిన పాటలు అవార్డులను రప్పించాయి. “ప్రతిభావంతుడు, పచ్చని కాపురం” వంటి కృష్ణ సినిమాలకు, శోభన్ బాబు నటించిన “స్వయంవరం, జీవన పోరాటం, రామబాణం” వంటి సినిమాలకు, కృష్ణంరాజు “ధర్మాత్ముడు” మూవీకి ఏసుదాస్ మధుర గానం పంచారు. అప్పట్లో వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న మోహన్ బాబును ఏసుదాస్ పాటే మళ్లీ ఫామ్ లోకి వచ్చేలా చేసింది. “అల్లుడుగారు, పెదరాయుడు” వంటి చిత్రాలకు ఏసుదాస్ గానమే ప్రాణం పోసింది. దీంతో మోహన్ బాబుకు ఆయన సెంటిమెంట్ గా మారారు.

చిరంజీవి ‘రుద్రవీణ, హిట్లర్’, బాలకృష్ణ “పవిత్ర ప్రేమ”, వెంకటేష్ “పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం”, నాగార్జున “సంకీర్తన” వంటి చిత్రాల్లో ఈయన పాడిన పాటలు స్పెషల్ గా నిలిచాయి. దాదాపుగా అప్పట్లో అందరు తెలుగు హీరోలు ఈయన మధుర గీతాలకు పులకించి పోయేవారు. ఏసుదాస్ సంగీతమే పలు సినిమాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచేది. ఇక తెలుగు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంతో ఏసుదాసుకు ఆత్మీయ అనుబంధం ఉంది. “దళపతి” మూవీలో వీళ్ళిద్దరూ కలిసి పాడిన “సింగారాల పైరుల్లోన” సాంగ్ ఎవర్ గ్రీన్. తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని ముద్రను వేసుకున్న ఏసుదాస్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుందాం.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు