Manjummel Boys : తాగుబోతులు… “మంజుమ్మెల్ బాయ్స్”పై తమిళ రచయిత సెన్సేషనల్ కామెంట్స్

రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ “మంజుమ్మెల్ బాయ్స్”పై ఒక తమిళ రచయిత నోరు పారేసుకున్నారు. ఇదో చెత్త సినిమా, మలయాళీలు మూర్ఖులు, తాగుబోతులు అంటూ ఆయన చేసిన విమర్శలు వివాదానికి తెర తీసాయి. మరి “మంజుమ్మెల్ బాయ్స్”పై సదరు రచయిత ఈ రేంజ్ లో ఫైర్ అవ్వడానికి గల కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

అసలు వివాదం ఏంటి?
2024లో బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసి సత్తా చాటిన మాలివుడ్ సినిమాల్లో “మంజుమ్మెల్ బాయ్స్” కూడా ఒకటి. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ప్రశంసల వర్షం కురుస్తున్న ఇలాంటి తరుణంలో ప్రముఖ తమిళ రచయిత జయ మోహన్ ఈ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించి వార్తల్లో నిలిచారు. కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ లోని గుణ గుహలకు విహారయాత్రకు వెళ్లగా, అక్కడ “మంజుమ్మెల్ బాయ్స్” గ్రూప్ లోని యువకుడు ఓ గుహలో పడిపోవడం, తర్వాత మిగిలిన ఫ్రెండ్స్ అతన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నాన్ని “మంజుమ్మెల్ బాయ్స్” మూవీలో అద్భుతంగా చూపించారు.

అయితే కేరళకు చెందిన యువకులంతా మూర్ఖులని, తాగుబోతులని రచయిత జయ మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా తాను సినిమా రివ్యూల జోలికి వెళ్ళనని, కానీ ది ఎలిఫెంట్ డాక్టర్ అనే పుస్తక రచయితగా “మంజుమ్మెల్ బాయ్స్” మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నానని అన్నారు. కేరళలోని అడవుల్లో స్థానిక యువకులు తాగి పారేసిన మందు సీసాలు పగిలి ఏనుగులు ఎలాంటి గాయాల పాలవుతున్నాయో ఈ పుస్తకంలో తెలిపారు ఆయన. ఈ సందర్భంగానే రచయిత జయ మోహన్ ఏనుగులు పడుతున్న బాధను, తన ఆవేదనను ఇలా వ్యక్తం చేశారు. అయితే మలయాళీలు ఎక్కడికి వెళ్లినా తాగుతూ ఇలాంటి పనులే చేస్తారని, కానీ అలాంటి ఘటనను గొప్పగా చూపిస్తున్నట్టు తీసిన “మంజుమ్మెల్ బాయ్స్” తన దృష్టిలో చెత్త సినిమా అని జయ మోహన్ వెల్లడించారు.

- Advertisement -

జయ మోహన్ కామెంట్స్…
తమిళ రచయిత జయ మోహన్ “మంజుమ్మెల్ బాయ్స్” మూవీ గురించి మాట్లాడుతూ తన దృష్టిలో ఇది అసహ్యకరమైన సినిమా అని, ఇది ఒక నిజమైన స్టోరీ కల్పితం కాదని చెప్పుకొచ్చారు. అయితే కేరళలో ఉండే టూరిస్ట్ లంతా ఇలాగే ఉంటారని, తాగి, ఊగి, పడిపోవడం తప్ప ఇంకేమీ పట్టించుకోరని మండిపడ్డారాయన. అంతేకాకుండా ఈ మలయాళ మూర్ఖులకు వాళ్ళ భాష తప్ప ఇంకేమీ తెలియదని, ఈ తాగుబోతులు వాళ్ళ భాష మాత్రం ఇంకొకరికి తెలియాలి అంటారు అంటూ దుమారం రేపే కామెంట్స్ చేశారు.

జయ మోహన్ డిమాండ్ ఇదే…
రచయిత జయ మోహన్ ఇలాంటి టూరిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇలాంటి వారే ప్రమాదాలకు కారణమై మరణాలు కూడా సంభవిస్తాయని హెచ్చరిస్తూ జయ మోహన్ తన బ్లాగ్ లో ఈ సినిమాపై రివ్యూ రాసుకువచ్చారు. దీంతో ఎక్కడో ఏదో జరిగితే దాన్ని పట్టుకొని మలయాళీలను ఇంత దారుణంగా విమర్శించడం కరెక్ట్ కాదని, తాగుబోతుల చర్యల వల్ల ఏనుగులు గాయపడుతున్నాయి అన్న మాట వాస్తవమే అయినప్పటికీ దాని గురించి చెప్పడానికి “మంజుమ్మెల్ బాయ్స్”ను టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఫిబ్రవరి 22న రిలీజ్ అయిన “మంజుమ్మెల్ బాయ్స్” మూవీని టార్గెట్ చేస్తూ జయ మోహన్ చేసిన కామెంట్స్ రచ్చకు కారణం అయ్యాయి. కాగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ 200 కోట్ల మార్క్ వైపు పరుగులు తీస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు