NTR: నందమూరి ఫ్యామిలీ పంచాయితీ – తారక్ ని బాలయ్య వెలేస్తున్నాడా..?

టాలీవుడ్లో ప్రధాన పాత్ర పోషించే కుటుంబాల్లో నందమూరి కుటుంబం ఒకటి. విశ్వ ‘విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు’ సినిమాల్లో అగ్రగామిగా ఎదిగి ఆ తర్వాత సొంత పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో వచ్చి సంచలన విజయం అందుకోవటమే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయేలా పాలించాడు. ఆ రకంగా అటు తెలుగునాట రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ సినీ రంగంలో నందమూరి ఫ్యామిలీ ఐకాన్ గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నందమూరి లెగసీ క్యారియర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సమయంలో కాస్త అటు, ఇటుగా కళ్యాణ్ రామ్, తారకరత్న సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా కూడా ఆశించిన రేంజ్ లో క్లిక్ అవ్వలేకపోయారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ అస్తమయం చుట్టూ నెలకొన్న వివాదాల గురించి చర్చ అప్రస్తుతం అయినప్పటికీ ఆయన పోయాక రాజకీయాల్లో నందమూరి కుటుంబం పట్టు కోల్పోయిందనే చెప్పాలి. అందుకు రకరకాల కారణాలు ఉండచ్చు గాక, ఆ తర్వాత 2014లో బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి పార్టీలో నందమూరి ప్రభావం కనిపించటం మొదలైంది. ఇక అప్పటి నుండి తరచూ కుటుంబంలోని అంతర్గత వివాదాలు బహిర్గతం అవుతున్నాయి. కారణాలేంటో స్పష్టంగా తెలీదు కానీ, గత కొంత కాలంగా బాలకృష్ణ తారక్ ని దూరం పెడుతున్నట్టు అనిపిస్తుంది. బాలకృష్ణ నోటా తారక్ పేరు కూడా వినిపించట్లేదు, గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణను జూనియర్ టీడీపీలోకి వస్తే ప్లస్ అవుతుందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ ప్లస్ అయ్యి మైనస్ అయితే అంటూ తారక్ పేరు కూడా ప్రస్తావించకుండా, పార్టీలోకి ఎవరైనా రావచ్చు అంటూ సమాధానం ఇచ్చి ఆ ప్రశ్నను దాటవేశారు.

ఇటీవల తారకరత్న మరణం తర్వాత 11 రోజుల కార్యక్రమంలో కూడా బాలకృష్ణ తారక్ ల మధ్య దూరం ఉందన్న విషయం బహిర్గతం అయ్యింది. ఆ కార్యక్రమానికి వచ్చిన బాలయ్యను పలకరించేందుకు తారక్, కళ్యాణ్ రామ్ లు లేచి నిలబడగా బాలకృష్ణ కనీసం వారి వైపు కూడా చూడకుండా పక్కకి వెళ్ళటం చర్చకు దారి తీసింది. తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా జూనియర్ కి ఆహ్వానం అందలేదు. అది పార్టీ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి రజినీకాంత్ మినహా ఇండస్ట్రీలో ఎవరినీ పిలవలేదని అనుకుందాం. కానీ, కుటుంబ సభ్యుడైన తారక్ కి ఆహ్వానం పంపకపోవడం చూస్తే తారక్ పట్ల బాలయ్య మనసులో ఎంత ద్వేషం దాగుందో తెలుస్తుంది.

- Advertisement -

తారక్ ని కలుపుకుంటే తన అల్లుడైన లోకేష్ కి పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుందనా లేక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న తన కుమారుడు మోక్షజ్ఞ కి ఫాలోయింగ్ తగ్గుతుందనా కారణం ఏదైనా కానీ, తారక్ ని పక్కన పెట్టడం ద్వారా బాలకృష్ణ పెద్దరికానికి మచ్చ ఏర్పడుతుంది. ఇప్పటికే నందమూరి అభిమానులు బాలయ్య తారక్ వర్గాలుగా డివైడ్ అయ్యి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కి దిగుతున్నారు. బాలకృష్ణ మైండ్ సెట్ మార్చుకోకుండా ఇలాగే తారక్ పట్ల ద్వేషం పెంచుకుంటూ పోతే తన అనుభవానికి, పెరిగిన వయసుకి అర్థం, మర్యాద ఉండదు. ఇప్పటికైనా బాలకృష్ణ కళ్ళు తెరిచి ‘బావ చేతిలో కీలు బొమ్మ’ అన్న అపవాదుని చెరిపేసుకొని తారక్ ని కలుపుకొని పోతే తప్ప నారా వారి స్వార్థ రాజకీయానికి మినుకు మినుకు మంటున్న దీపంలా ఉన్న నందమూరి కుటుంబ ప్రతిష్ట నిలబడదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు