Salman Khan : సల్మాన్ ఇంటి బయట కాల్పుల్లో నిందితుడు ఆత్మహత్య… కస్టడీలోనే

Salman Khan : ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన కేసులో నిందితుడు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల కేసులో ఇద్దరు అరెస్ట్ కాగా, పోలీసులు వాళ్ళను ఆయుధాల సరఫరాదారులుగా గుర్తించారు. అందులో ఒకరు ముంబై పోలీసు కస్టడీలో తాజాగా ఆత్మహత్య చేసుకున్నట్లు బయట కొచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. నిందితుడి పేరు అనుజ్ థాపన్ అని తెలుస్తోంది. అతని వయసు 32 ఏళ్లు. ఆత్మహత్యకు ప్రయత్నించిన అనూజ్‌ను వెంటనే ముంబైలోని జిటి ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మరి కస్టడీలో అతను ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఆయుధాలు సరఫరా చేసిన నిందితుడు

మరణించిన అనూజ్ థాపన్‌ను ఏప్రిల్ 26న పంజాబ్‌లో అరెస్టు చేశారు. ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ ముంబైలోని బాంద్రాలొ ఉన్న నివాసం వెలుపల కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను అనుజ్ థాపన్ సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో నిందితుడు సోను సుభాష్ చందర్ కూడా ఆయుధాలు సరఫరా చేశాడనే ఆరోపణలపై పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.

కాల్పులు జరిపింది ఈ ఇద్దరు

సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన మరో ఇద్దరు విక్కీ గుప్తా, సాగర్ పాల్ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఘటన జరిగిన రోజు రాత్రి వాళ్ళు బైక్ పై అక్కడి నుంచి వెళ్లిపోవడం సీసీటీవీలో రికార్డయింది. దాని ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ సజావుగానే సాగుతుంది, నిందితులను కూడా త్వరగానే అరెస్ట్ చేశారని, వాళ్ళు ఇలా చేయడానికి గల కారణాన్ని పోలీసులు కూడా త్వరగానే తెలుసుకుంటారు అనుకుంటున్నా నేపథ్యంలో ఇలా నిందితుల్లో ఒకరు సడన్ గా కస్టడీలోనే ఆత్మహత్యకు ప్రయత్నించడం, ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే ప్రాణాలు కోల్పోవడం కొత్త అనుమానాలకు తెర తీస్తోంది. అధికారుల సమక్షంలో కస్టడీలో ఉన్న వ్యక్తి ఆత్మహత్య ఎలా చేసుకుంటాడు అని ప్రశ్నిస్తున్నారు సల్మాన్ ఫ్యాన్స్. అంతేకాకుండా ఆయన మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

ఆరోజు ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున 4.51 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ముంబై పోలీసు అధికారి ప్రకారం కాల్పులు జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ తన ఇంట్లో ఉన్నాడు.

ఈ ఘటన తర్వాత ఇద్దరు షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను ముంబై పోలీసులు గుజరాత్‌లోని భుజ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు అరెస్టయిన షూటర్ల సమాచారం మేరకే థాపన్, చందర్‌లను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులందరిపై ముంబై పోలీసులు కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA)తో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు