28Years For Sri Krishnarjuna Vijayam : 28 వసంతాల “శ్రీ కృష్ణార్జున విజయం”.. వెండితెరపై బాలయ్య పౌరాణిక చిత్రరాజం..

28Years For Sri Krishnarjuna Vijayam : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నట వారసుడిగా రెండవతరం అగ్రహీరోల్లో ఒకరిగా నాలుగు దశాబ్దాల పాటు అభిమానులని అలరిస్తున్న బాలయ్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయన వేయని పాత్ర లేదు. డైలాగ్ చెప్పాడంటే థియేటర్లలో విజిల్స్ పడాల్సిందే. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలకృష్ణ. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని రకాల పాత్రలు వేసిన నటుడు బాలకృష్ణ. అన్ని రకాల సినిమాలు కూడా చేసారు. ఎన్టీఆర్ వారసుడు కావడం వల్ల ఆయన లోని నటన, తేజస్సే కాదు, అన్ని రకాల చిత్రాలపై పట్టు సాధించారు. ముఖ్యంగా అత్యధిక పౌరాణికాల్లో నటించిన రెండో తరం హీరోగా బాలయ్యకు పేరుంది. ఇక ఒక్క పౌరాణికాలే కాదు, ఇతిహాస, భక్తిరస, జానపద చిత్రాలలో తనదైన ముద్ర వేశారు బాలకృష్ణ. ఇక నటసార్వభౌమ యన్టీఆర్ శ్రీకృష్ణునిగా, అర్జునునిగా పలు చిత్రాలలో మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే రామారావు తరువాత అలా అన్ని రకాల చిత్రాలతో ప్రేక్షకులను మురిపించిన ఘనత బాలకృష్ణ సొంతం. తన తరం నటుల్లో ఈ క్రెడిట్ బాలయ్య ఒక్కరిదే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బాలకృష్ణ నటించిన పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణునిగా, అర్జునునిగా ద్విపాత్రాభినయం తో నటించి మెప్పించిన చిత్రం ‘శ్రీకృష్ణార్జున విజయము’ (28Years For Sri Krishnarjuna Vijayam) చిత్రం మే 15 తో 28 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్బంగా ఈ చిత్ర విశేషాలని కొన్ని తెలుసుకుందాం.

సింగీతం బాలయ్య కలయికలో హ్యాట్రిక్..

యన్టీ రామారావును సూపర్ స్టార్ ను చేసిన ఘనత దిగ్దర్శకుడు కేవీ రెడ్డికే దక్కుతుంది. ఎన్టీఆర్ కెరీర్ ని మార్చేసిన పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరుని కథ లాంటి చిత్రాలను తీసిందిఈయనే. అలాంటి కేవీ రెడ్డి వద్ద అసోసియేట్ గా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు కు యన్టీఆర్ తోనూ ఎంతో మంచి అనుబంధం ఉంది. అయితే, తన దర్శకత్వంలో రామారావుతో సినిమా తీద్దామని సింగీతం శ్రీనివాసరావు ఎన్నో సార్లు ప్రయత్నించినా కుదరలేదు. కానీ బాలకృష్ణతో మాత్రం మూడు క్లాసిక్ చిత్రాలను తీశారు. పైగా మూడు చిత్రాలు కూడా డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కినవి కావడం విశేషం. ముందుగా ‘ఆదిత్య 369’ లో సైన్స్ ఫిక్షన్ కథతో టైమ్ మిషన్ ద్వారా శ్రీకృష్ణదేవరాయల కాలానికి పోయినట్టుగా చూపించి, చరిత్రనూ లింక్ చేసి తీసిన విధానం అద్భుతం. ఇక ఆ తర్వాత బాలయ్యతో సింగీతం తెరకెక్కించిన జానపద చిత్రం ‘భైరవద్వీపం’. ఈ నాటికీ జానపద చిత్రాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ రెండింటి తర్వాత హ్యాట్రిక్ సినిమాగా బాలకృష్ణ, సింగీతం కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకృష్ణార్జున విజయము’. చందమామ విజయా కంబైన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.

28Years for Sri Krishnarjuna Vijayam Movie

- Advertisement -

ద్విపాత్రాభినయంతో మెప్పించిన బాలకృష్ణ..

అయితే బాలకృష్ణ ప్రధాన పాత్ర అనుకున్నప్పటికీ ఈ చిత్రాన్ని ముందుగా మల్టి స్టారర్ గా తీద్దామని అనుకున్నారు. ఈ చిత్రంలో ముందుగా శ్రీ కృష్ణుని పాత్రకు శోభన్ బాబును అనుకున్నారు. కానీ అప్పటికే ఆయన వయసు మీద పడ్డవారు కావడం, ఆ సమయంలోనే ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం మరికొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో శ్రీ కృష్ణుడిగా, అర్జునుడిగా రెండు పాత్రలనూ బాలకృష్ణ పోషించారు. ఇక ‘శ్రీకృష్ణార్జున విజయము’ చిత్రంలో రోజా ద్రౌపదిగా నటించగా, ప్రియా రామన్ రుక్మిణిగా, సత్యభామగా శ్రీకన్య దుర్యోధన పాత్రలో శ్రీహరి, కర్ణునిగా దగ్గుబాటి రాజా, నారదునిగా నరేశ్, భీమునిగా విజయరంగరాజా, ధర్మరాజుగా చక్రపాణి, కె.ఆర్.విజయ కుంతిగా, ఏవీయస్ శకునిగా నటించారు. అయితే మహాభారతంలో కీలకమైన సుభద్ర, బలరాముడు అలాగే మరికొన్ని పాత్రలను ఇందులో చూపించలేదు. ఎందుకంటే ఈ చిత్రం మహాభారతం నుండి ఒక చిన్న భాగమైన కురు వీరుల మొదటి విద్యాప్రదర్శనం నుండి ద్రౌపది పరిణయం వరకు జరిగిన కథ ఆధారంగా రూపొందించబడింది.

చిన్న చిన్న లోపాల వల్ల పరాజయం..

ఇక మాధవపెద్ది సురేశ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఇదే కాంబోలో అంతకు ముందు వచ్చిన భైరవద్వీపం అద్భుత విజయం సాధించగా, మంచి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఈ శ్రీ కృష్ణార్జున విజయం సినిమాకి మాత్రం పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఆల్మోస్ట్ నటీనటులు టెక్నిషియన్స్ సహా భైరవ ద్వీపం క్యాస్టింగే ఇందులోనూ ఉంటుంది. బహుశా ‘భైరవద్వీపం’ అందించిన అఖండ విజయంతో వచ్చిన అమితోత్సాహం వల్ల ఈ సినిమా చిత్రీకరణ పై మేకర్స్ అంతగా దృష్టి పెట్టలేదని చాలా మంది అంటుంటారు. ‘శ్రీకృష్ణార్జున విజయము’లోని చిత్రీకరణ లో చాలా వరకు సెట్స్ గాని, సాంగ్స్ గాని ఆకట్టుకొనేలా తెరకెక్కలేదు. పైగా సన్నివేశాలన్నీ నాటకఫక్కీలో సాగాయి. పైగా నటీనటుల ఆభరణాలు చూడగానే నాటకాల్లో వాడినట్టుగా కనిపించాయి. అప్పటికే వీటి మీద ప్రేక్షకులకు ఆసక్తి తగ్గింది. అన్నిటికి మించి సింగీతం వంటి దర్శకుడు ఈ చిత్రాన్ని ఎందుకనో తేలికగా తీసుకొని తెరకెక్కించినట్టు కనిపిస్తుంది.

ఇక శ్రీ కృష్ణార్జున విజయం సినిమాలో గ్రాఫిక్స్ తో అలరించే ప్రయత్నం చేసిన అవి పిల్లల సినిమా కంటే దారుణంగా ఉంటాయి. ఓవరాల్ గా బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా వచ్చిన శ్రీ కృష్ణార్జున విజయం అంతగా ఆకట్టుకోలేదు. కానీ పౌరాణికాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా కాస్త నచ్చే అవకాశం ఉంది. ఇక 1996 మే 15న విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఫెయిల్ అయినా, బాలయ్య చిత్రాల్లో క్లాసిక్ గా నిలవగా, తెలుగు తెరపై మహాభారత కథ నేపథ్యంలో ఆల్మోస్ట్ చివరి పౌరాణిక చిత్రంగా నిలిచింది. దీని తర్వాత చాలా ఏళ్లకు బాలకృష్ణే ప్రధాన పాత్రలో బాపు దర్శకత్వంలో లవ కుశ రీమేక్ గా శ్రీరామరాజ్యం తీశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు