Evv Satyanarayana BirthAnniversary : ది కింగ్ అఫ్ ఎంటర్టైన్మెంట్స్ ‘ఈవీవీ సత్యనారాయణ’…

Evv Satyanarayana BirthAnniversary : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో తొలితరం నుండి ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలు రాజ్యమేలుతున్నాయి. మాస్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా, ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి సక్సెస్ రేటు ఎక్కువ. అందుకే కామెడీ సినిమాలకి దర్శకులు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినా అందరూ అందులో సక్సెస్ కాలేరు. ఎందుకంటే హాస్యం అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. కామెడీ పంచ్ లు వేయడం వల్ల, కామెడీ పాత్రలు చేయడం వల్ల, కామెడియన్లను కొట్టడం వల్ల కామెడీ పండదు. కామెడీ అంటే నటీనటులు చేసే పనిలోనుండి పుట్టాలి. కమెడియన్ల హావభావాలతోనే ప్రేక్షకులకి నవ్వు తెప్పించాలి. అలాంటి కామెడీ దర్శకులలో “ఇవివి సత్యనారాయణ” శైలి ప్రత్యేకమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో “జంధ్యాల” తర్వాత హాస్యానికి కేరాఫ్ గా ఎంటర్టైన్మెంట్స్ సినిమాలు చేస్తూ వాటితోనే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించే “ఇవివి సత్యనారాయణ” జయంతి (Evv Satyanarayana BirthAnniversary) (జూన్10) నేడు. ఈ సందర్బంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, ‘కింగ్ అఫ్ ఎంటెర్టైన్మెంట్’ గా చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్న ఇవివి ఫిల్మ్ జర్నీ పై ఓ లుక్కేద్దాం..

Evv Satyanarayana BirthAnniversary Special Story

గురువుకు తగ్గ శిష్యుడుగా ఇవివి సత్యనారాయణ..

ప్రేక్షకులు మనసు బాగోలేనప్పుడు కాసింత ఊరట చెందటానికే చాలామంది సినిమాలను ఎంచుకుంటారు. అలాంటి వారికోసం ప్రేక్షకులని నవ్వించాలనే సంకల్పంతో ఎంటెర్టైనర్స్ కే ప్రాధాన్యత ఇచ్చారు ఇవివి. ఇక హాస్యచిత్రాలలో అప్పటికే ఇండస్ట్రీలో అగ్రగణ్యులైన తన గురువు జంధ్యాల దగ్గర పనిచేసిన ఇ.వి.వి.సత్యనారాయణ గురువు బాటలోనే పయనిస్తూ పలు నవ్వుల చిత్రాలతో ప్రేక్షకులకి అమితమైన వినోదం పంచారు. ఇక ఇ.వి.వి. సత్యనారాయణలోని దర్శకుడ్ని గుర్తించి డి.రామానాయుడు మేనల్లుడైన అశోక్ కుమార్ నిర్మాతగా ఇ.వి.వి.ని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘చెవిలో పువ్వు’ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ప్రేక్షకుల్ని అలరించినా ఆర్ధికంగా విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఈవీవీ ఎంతో మందిని కలిసినా ఆయన్ని చూడగానే ముఖం చాటేసేవారు. అలాంటి సమయంలో ఇ.వి.వి.ని ప్రోత్సహించింది రామానాయుడే. అలా రామానాయుడు కాంపౌండ్ చేరిన ఇ.వి.వి. ‘ప్రేమఖైదీ’ని రూపొందించారు. చక్కటి ప్రేమకథగా రూపొందిన ‘ప్రేమఖైదీ’ ఘన విజయం సాధించింది. ఇక ఇ.వి.వి. సత్యనారాయణ గురువు జంధ్యాల లాగే నవ్వునే నమ్ముకొని ముందుకు సాగారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ హీరోగా అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజన్ దొంగలు వంటి చిత్రాలు రూపొందించగా, అలాగే నరేశ్ తో ఇ.వి.వి. తెరకెక్కించిన ‘జంబలకిడి పంబ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు.

- Advertisement -

రెండో తరం స్టార్ అందరితో హిట్లు తీసిన ఈవీవీ..

ఇక ఈవివి సత్యనారాయణ పూర్తి స్థాయి కామెడీ చిత్రాలతో పాటు స్టార్ హీరోలతో మాస్ ఎంటెర్టైనర్స్ కూడా తీసారు. మెగాస్టార్ చిరంజీవి తో అల్లుడా మజాకా, బాలకృష్ణ తో గొప్పింటి అల్లుడు, నాగార్జునతో ‘వారసుడు, హలో బ్రదర్’, వారసుడు, వెంకటేశ్ తో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు -వంటింట్లో ప్రియురాలు’ వంటి చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’ ని తెరకెక్కించిందీ ఇ.వి.వి.నే! అలాగే శ్రీకాంత్, జగపతిబాబు, వడ్డే నవీన్ వంటి హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ లు తీసి, ఇండస్ట్రీలో స్టార్లు కావడానికి దోహదపడ్డారు. అలాగే ఇ.వి.వి. తానే నిర్మాతగానూ మారి, ఇ.వి.వి. సినిమా పతాకంపై తొలి ప్రయత్నంగా ‘చాలాబాగుంది’ తీశారు. తరువాత ఎన్నో చిత్రాలు ఈ బ్యానర్ పైనే రూపొందించారు.

సెంటిమెంట్ చిత్రాల్లోనూ మేటి..

ఇక ఇవివి అనగానే కేవలం కామెడీ చిత్రాలే తీశారు అని కొందరు అనుకున్నా, జనాలు మెచ్చే సెంటిమెంట్ ప్రధాన చిత్రాలనూ తీసి శభాష్ అనిపించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆమె, అమ్మో ఒకటో తారీఖు, ఆయనకిద్దరు, తాళి, మా నాన్నకు పెళ్లి, మావిడాకులు, కన్యాదానం వంటి చిత్రాలతో కుటుంబ కథా చిత్రాలను తీయడంలో మేటి అనిపిన్చుకున్నారు.

అల్లరోడితో ఇ.వి.వి. సినిమాలు…

ఇక దర్శకుడిగా వరుస ప్లాప్ లు అందుకుంటున్న ఓ సందర్భంలో ఇ.వి.వి. సత్యనారాయణ ఇద్దరు కుమారుల్లో ఆర్యన్ రాజేశ్ ను హీరోగానూ, నరేశ్ ను డైరెక్టర్ గానూ చూడాలనుకున్నారు. నరేశ్ కూడా కొన్ని సబ్జెక్టులు రాసుకున్నానంటూ చెప్పేవాడు. ఇక ఇ.వి.వి. డైరెక్షన్ లోనే ‘హాయ్’ చిత్రం ద్వారా రాజేశ్ హీరో అయినా, అంతగా అలరించలేకపోయాడు. ఎవడిగోల వాడిది, నువ్వంటే నాకిష్టం వంటి హిట్ చిత్రాలను తీసిన ఆర్యన్ రాజేష్ హీరోగా సక్సెస్ కాలేదు. కానీ చిన్న కొడుకు నరేష్ మాత్రం రవిబాబు తీసిన ‘అల్లరి’ సినిమాతో సక్సెస్ కొట్టి హీరోగా సక్సెస్ రూటులో సాగిపోయాడు. ఇక ఆ తర్వాత నరేశ్ ని హీరోగా పెట్టి ఇవివి తొట్టి గ్యాంగ్, కితకితలు, అత్తిలి సత్తిబాబు lkg, బెండు అప్పారావ్ RMP, కత్తి కాంతారావు వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఇక ఆయన చివరగా ఆర్యన్ రాజేష్ తో బురిడీ తెరకెక్కించగా, 2011 లో అనారోగ్య కారణాల వల్ల తుదిశ్వాస విడిచారు. ఏది ఏమైనా ఇ.వి.వి. సత్యనారాయణ పేరు వినగానే ఆయన పండించిన నవ్వుల పువ్వులు ముందుగా గుర్తుకు వస్తాయి. ఈవీవీ సినిమాలో హాస్యంతో పాటు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఈవీవీ అనే శకంలో ఎన్నో గొప్ప చిత్రాలు రాగా, హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో ఈవీవీ ముందు నిలిచారు. చిన్న సినిమాలతో మొదలై స్టార్ హీరోల వరకు అందరితోనూ పని చేయడమే కాకుండా అందరితోనూ బ్లాక్ బస్టర్లు తీశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు