HBD Allari Naresh : “అల్లరోడే” అయినా ఉగ్రరూపం చూపించే నవ్వులరాజు..

HBD Allari Naresh : ” అల్లరి నరేష్”.. టాలీవుడ్ లో ఉన్న అద్భుతమైన నటుల్లో అల్లరి నరేష్ ఒకరు. కామెడీ కి కేరాఫ్ గా నవ్వుల రారాజుగా టాలీవుడ్ ని దశాబ్దంన్నర పాటు ఏలిన కామెడీ కింగ్ అల్లరి నరేష్. రాజేంద్ర ప్రసాద్ తర్వాత హాస్యానికి కేరాఫ్ గా నిలిచి కామెడీ హీరోలకి ఇన్స్పిరేషన్ అయ్యాడు. పేరుకి అగ్ర దర్శకుడి కొడుకైనా, తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విలక్షణ నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులకు “కిత‌కిత‌లు” పెట్టిన‌ “అల్ల‌రి న‌రేష్”, రేలంగి రాజబాబు గా, బ్లేడు బాబ్జి గా, ఓ కత్తి కాంతారావు గా, సీమ శాస్త్రిగా ప్రేక్షకుల మనస్సుల్లో, నవ్వుల్లో చోటు సంపాదించాడు. ఇక అల్లరోడిగానే ఎంట్రీ ఇచ్చినా ఇప్పుడు తన నటనతో “ఉగ్ర” స్వరూపం చూపిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్న ‘అల్లరి’ నరేష్” (HBD Allari Naresh) బర్త్ డే నేడు.(జూన్30) ఈ సందర్బంగా తనకి బర్త్ డే విషెస్ ని అందచేస్తూ అల్లరి నరేష్ ఫిల్మ్ జర్నీ పై ఓ లుక్కేద్దాం.

HBD Allari Naresh Birth Day Special

అల్లరోడి గా ప్రయాణించి ఉగ్ర స్వరూపం చూపించాడు..

ఇక టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీకి సుపరిచితమైన అల్లరి నరేష్, రవిబాబు తెరకెక్కించిన ‘అల్ల‌రి’ సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. అక్కడితో మొదలైన అల్లరి ఇంకా కొనసాగుతూనే ఉంది. తన మొద‌టి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని.. అల్ల‌రి న‌రేష్‌ గా ప్రేక్షకుల్లో ఫేమ్ సంపాదించాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులని నవ్వించడమే పనిగా పెట్టుకున్న నరేష్ వరుస కామెడి చిత్రాలతో దూసుకుపోయాడు. అల్లరి నరేష్ నటించిన తొట్టిగ్యాంగ్, కితకితలు, గోపీ – గోడ మీద పిల్లి, సీమ శాస్త్రి, బెండు అప్పారావ్, కత్తి కాంతారావు, బ్లేడ్ బాబ్జి, దొంగల బండి వంటి చిత్రాలతో తన హాస్యంతో అల‌రించారు.

- Advertisement -

విలక్షణ నటనకు నాంది పలికిన నరేష్..

అయితే అల్లరి నరేష్ అంటే కామెడీకి కేరాఫ్ అయినా తనలో అద్భుతమైన నటుడు దాగున్నాడని చెప్పొచ్చు. నరేష్ సీరియస్ డ్రామాలు ఇప్పుడు చూస్తున్నారేమో గాని, అప్పట్లోనే నేను, ప్రాణం వంటి చిత్రాలతో నటనలో వైవిధ్యాన్ని చూపించాడు అల్లరోడు. ఆ తర్వాత ‘గ‌మ్యం’ సినిమా నుండి నరేష్ కి అన్నిరకాల పాత్రలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ సినిమా క్లైమాక్స్ లో నరేష్ ని చూసి బాధపడని ప్రేక్షకులు ఉండరు. ఈ సినిమాలో గాలి శ్రీను పాత్ర‌లో న‌టించిన న‌రేష్ న‌ట‌న‌కు ఎన్నో అవార్డులు వ‌రించాయి. ఆ తర్వాత ‘శంభో శివ శంభో’, ‘మ‌హ‌ర్షి’ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించాడు. ప్ర‌స్తుతం కథాబలం ఉన్న సీరియస్ డ్రామాల్లోనే ఎక్కువగా నటిస్తునాడు నరేష్. కామెడీ పాత్ర‌ల్లో ఎంత న‌వ్వించాడో.. సీరియ‌స్ పాత్ర‌ల్లో కూడా అంతే మెప్పిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఫామ్ లో లేని నరేష్ “నాంది” తో కం బ్యాక్ హిట్ ఇవ్వగా, రీసెంట్ గా నా సామిరంగ సినిమాలో మరో ప్రత్యేకమైన పాత్రలో అలరించాడు.

హాస్యాన్ని వదలని అల్లరోడు…

అయితే అల్లరి నరేష్ కి సీరియస్ పాత్రలు మంచి గుర్తింపు తెచ్చినా, తనని ప్రేక్షకులు అల్లరోడిగానే ముందు గుర్తుంచుకుంటారు. అందుకే కామెడీ ని వదల్లేదు అల్లరి నరేష్. ఎన్ని ప్లాప్ లు వచ్చినా, కామెడీ చిత్రాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. లేటెస్ట్ గా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో పలకరించి తన కామెడీతో మెప్పించినా, సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇక ప్రస్తుతం నరేష్ బచ్చల మల్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు