HBD Ilayaraja : సంగీతపు అలల సముద్రం.. ది లెజెండరీ మాస్ట్రో.. ‘ఇళయరాజా’

HBD Ilayaraja : “ఇళయరాజా”.. దక్షిణ భారత చిత్ర సీమలో సంగీత జ్ఞాని గా, ఇసైజ్ఞాని గా, మాస్ట్రో గా.. ఇలా రకరకాల పేర్లతో సినీ సంగీత ప్రపంచంలో నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న మహా సంచలనం. ఈయన సంగీత ప్రతిభకు ఎంత పొడిగినా సమయం చాలదు. సంగీతంలో సముద్రం లో అలలా వచ్చి పడిన మెరుపు ఆయన. ఆయనే ఓ సంగీత సముద్రం. తరగని చెరగని బాణీల సృష్టికర్త ‘ఇళయరాజా’. భారతీయ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తమిళనాడుకి చెందిన వాడైనా, దేశం నలుమూలలా ఈయన సంగీతానికి చెవికోసుకునే అభిమానులుంటారు. భారతీయ సంగీతానికి, వెస్ట్రన్ బీట్స్ జోడించి, సరికొత్త సరిగమలు సృష్టించిన జ్ఞాని ఈయన. ఆయన సృష్టించిన గీతాల్లో వందల క్లాసిక్స్ ఉన్నాయి. ఇప్పటితరాన్ని కూడా ఉర్రూతలూగించే ఎన్నో మధురమైన పాటలిచ్చారాయన. ఏకంగా ఆరువేలకి పైగా పాటలనందించిన మాస్ట్రో ఇళయరాజా ఇప్పటికి సినిమాలకు సంగీతం అందిస్తూనే ఉన్నారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మాస్ట్రో ఇళయరాజా (HBD Ilayaraja) పుట్టినరోజు (జూన్ 2) నేడు. ఈ సందర్బంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఇళయరాజా మ్యూజిక్, గురించి ఆయన పాటల గురించి కొన్ని విశేషాల్ని తెలుసుకుందాం.

HBD Ilayaraja Birth day Special story

మెలోడీ కి కేరాఫ్ ఇళయరాజా పాటలు..

చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీత జీవితాన్ని ప్రారంభించగా, సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు ప్లేయర్ గా పనిచేశారు ఇళయరాజా. ఆ తరువాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. ఇక పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. ఇక అక్కడ్నుంచి ఇళయరాజా ప్రభంజనం మొదలైంది. దక్షిణ భారత సంగీతంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు, మరెన్నో కొత్త పుంతలు కనిపించాయి. ఇళయరాజా రాకతో సంగీత దర్శకులకు స్వేచ్ఛ పెరిగింది. కొత్త వాయిద్యాల రాక మొదలైంది. సన్నివేశం ఇలా చెప్పిన వెంటనే, అలా తన దగ్గరున్న సహాయకుల్ని సిద్ధం చేసేవారు ఇళయరాజా. అక్కడికక్కడే బాణీలు కంపోజ్ చేసేవారు. అది పాట అయినా, నేపథ్య సంగీతం అయినా ఆయన స్టయిల్ ఇదే. మనసులో వెంటనే స్ఫురించిన రాగం, బాణీగా మారిపోతుంది. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అంటారు చాలామంది. ఇప్పటికీ ఆయన స్టయిల్ ఇదే. దశాబ్దాలు గడిచినా ఇంకా పాటలు కంపోజ్ చేస్తూనే ఉన్నారు ఈ జ్ఞాని.

- Advertisement -

తెలుగులో ఎన్నో కల్ట్ సాంగ్స్..

ఇక మెలోడీ సాంగ్స్ కి కేరాఫ్ అయిన ఇళయరాజా కమర్షియల్ మాస్ సినిమాలకు కూడా పనిచేసారు. తెలుగులో సీతాకోక చిలుక, నిరీక్షణ, అభిలాష, సాగర సంగమం, సితార స్వాతిముత్యం, మహర్షి, గీతాంజలి, రుద్రవీణ, జగదేక వీరుడు అతిలోక సుందరి, చంటి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించారు. ఇక ఇళయరాజాకు జాతీయ అవార్డులు వచ్చిన తెలుగు సినిమాలు సాగర సంగమం, రుద్రవీణ. ఇలా రెండు తెలుగు సినిమాలతో జాతీయ అవార్డులు అందుకున్న అరుదైన ఘనత ఇళయరాజాకు మాత్రమే దక్కింది. మాస్‌ పాటైనా, మెలోడీ సాంగ్‌ అయినా, సంగీత ప్రధానమైన పాటైనా ఇది ఇళయరాజా సాంగ్‌ అని సామాన్య శ్రోత కూడా గుర్తు పట్టేంత విభిన్నంగా అతని పాటలు వుండేవి. శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్‌ మ్యూజిక్‌ని లింక్‌ చేసి ఎన్నో పాటలు స్వరపరిచి సంగీతం అంటే ఇదీ, పాటలంటే ఇవీ అని అందరిచేతా అనిపించారు.

ఇక ఇళయరాజా భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు ఇళయరాజా. 2015లో గోవాలో జరిగిన 46వ “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా”లో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ విభాగంలో సెంటినరీ అవార్డు దక్కించుకున్నారు. 2018లో భారత ప్రభుత్వం ఈయనను “పద్మవిభూషణ్” పురస్కారంతో సత్కరించింది. భారతీయ సినిమా మనుగడలో ఉన్నంతకాలం ఇళయరాజా సంగీతం ఉంటుంది. తరాలు మారినా ఆయన మాటలు అలరిస్తూనే ఉంటాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు