HBD Vijayashanthi : ది రియల్ లేడీ సూపర్ స్టార్.. వెండితెర “రాములమ్మ”..

HBD Vijayashanthi : తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ సూప‌ర్ స్టార్‌ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ “విజ‌య‌శాంతి”. 80ల కాలంలో అందరు స్టార్ హీరోలతోనూ నటించిన ఈమె ఆ తర్వాత ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ తో మెప్పించి సౌత్ ఇండియాలోనే లేడీ సూపర్ స్టార్ గా చక్రం తిప్పింది. క‌థానాయ‌కురాలిగా ఎన్నో వైవిధ్యమైన పాత్ర‌ల‌లో న‌టించి మెపించిన విజయశాంతి ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌లో ఓ చ‌రిత్ర‌నే సృష్టించారు. ఒక కర్తవ్యం, ఒక రాములమ్మ, ఒక ప్రతిఘటన ఎలా ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ లో నటించి ప్రేక్షకులని మెప్పించడమే కాక, ది రియల్ లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ అనే బిరుదు దక్కించుకున్న ఘనత విజయశాంతికే దక్కింది . గ్లామ‌ర్‌ పాత్రలు చేయడమే కాకుండా, యాక్ష‌న్ హీరోయిన్‌ గా కూడా స‌క్సెస్ సాధించిన లేడీ సూపర్ స్టార్ విజ‌యశాంతి (HBD Vijayashanthi) బ‌ర్త్ డే (జూన్ 24) నేడు. ఈ సంద‌ర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ అందచేస్తూ విజయశాంతి సినీ కెరీర్ జర్నీ పై ఓ లుక్కేద్దాం.

HBD Vijayashanthi Birth Day Special

80స్ లో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పిన విజయశాంతి..

వరంగల్ లో జన్మించిన (1966 june 24) విజ‌య‌శాంతి అసలు పేరు శాంతి. విజ‌య‌శాంతి పిన్ని విజ‌య‌ల‌లిత తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలలో న‌టించారు. పిన్ని పేరులోని విజ‌య‌ను త‌న పేరులో చేర్చుకుని.. విజ‌య‌శాంతిగా మారిన శాంతి తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజ‌యాలు అందుకున్నారు. విజ‌య‌శాంతి 1979లో భారతి రాజా దర్శకత్వం వహించిన ‘కల్లుక్కుళ్ ఈరమ్‌’ సినిమా త‌మిళ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వగా, ఆ వెంటనే తెలుగులో సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాలో హీరోయిన్‌ గా న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు. మొదట్లో త‌మిళ సినిమాల్లో ఎక్కువ‌గా న‌టించిన విజయశాంతి ‘నేటి భార‌తం’ సినిమా త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఎక్కువగా నటించారు. ఆ తర్వాత వందేమాత‌రం, ప్రతిఘటన, రేపటి పౌరులు, పసివాడి ప్రాణం, స్వ‌యం కృషి, మువ్వ గోపాలుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జానకిరాముడు, ముద్దుల మావయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, ప‌డ‌మ‌టి సంధ్యారాగం, శత్రువు, గ్యాంగ్ లీడర్, వంటి సినిమాల‌తో విజయశాంతి స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమాల్లో చక్రం తిప్పారు.

- Advertisement -

స్టార్ హీరోలకి ధీటైన నటన..

ఇక విజయశాంతి ఎన్టీఆర్, ఏఎన్నార్ మినహా టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ హీరోయిన్ గా నటించింది. నటశేఖర కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఆ తర్వత చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల‌తో విజ‌య‌శాంతి నటించి మెప్పించారు. ఇక చిరంజీవి లాంటి స్టార్లతో విజ‌య‌శాంతి వేసే బ్రేక్ డాన్సులకు అప్ప‌ట్లో భ‌లే క్రేజ్ ఉండేది. ఇక నటనలోనూ విజయశాంతి తనకు తానే సాటి అనిపించుకుంది. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో విజయశాంతి మామూలుగా గ్లామర్ పాత్రలు ఇవ్వడం కాకుండా, నటనకి ప్రాధాన్యం ఉన్న రోల్స్ ఎక్కువగా ఇచ్చేవారు. ఇక విజయశాంతి ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది. అయితే ఒసేయ్ రాములమ్మ సినిమా తర్వాత మాత్రం పూర్తిగా లేడీ ఓరియెండిటెడ్ సినిమాలకే పరిమితం అయింది. రాములమ్మ తర్వాత వరుసగా రౌడీ దర్బార్, అడవి చుక్క, ఇందిరమ్మ, నాయుడమ్మ అనే సినిమాల్లో నటించి మెప్పించింది.

రాజకీయాల్లోనూ తనదైన సత్తా…

అయితే రాజకీయాల్లో రాణించాలని వచ్చిన రాములమ్మ దాదాపు పాతికేళ్ల కిందే రాజకీయాల్లో ప్రవేశించింది. ముందుగా బిజెపి లో చేరిన విజయశాంతి, ఆ తర్వాత తెలంగాణ కోసం తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టింది. కానీ తక్కువ కాలంలోనే ఆ పార్టీని టీఆరెస్ లో విలీనం చేసింది. ఆ సమయంలో మెదక్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేసింది. ఆ తర్వాత బిఆర్ఎస్ నుండి బయటికి వచ్చి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో చేరుతానని మాట ఇవ్వగా, 2014లో కాంగ్రెస్ లోక్ చేరింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ బిజెపి బాట పట్టింది. ఇక ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటుంది విజయశాంతి. ఇదిలా ఉండగా నాలుగేళ్ళ కింద సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాలో తన తల్లిగా, అలాగే ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు