Jandhyala Death Anniversary : వెండితెరపై హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన హాస్యబ్రహ్మ “జంధ్యాల”…

Jandhyala Death Anniversary : తెలుగు చిత్ర సీమ లో సినిమాల్లో హాస్యాన్ని కొత్త రకంగా పండించిన దర్శకుల్లో మేటి “జంధ్యాల”. అప్పటివరకూ అన్ని రకాల జోనర్లలో ఒక్కో దర్శకుడికి ఒక్కో తరహా చిత్రాలు తీసే ప్రావీణ్యం ఉండేది. కానీ హాస్యం ప్రేక్షకుల్ని నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుని తెలుగు తెరపై నవ్వుల పంట పండించిన దర్శకుడు హాస్య బ్రహ్మ జంధ్యాల. నవ్వడం ఒక యోగం. నవ్వించడం ఒక భోగం. నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పిన హాస్యబ్రహ్మ ఈయన. 80ల కాలంలో ఆయన సినిమా సినిమా వచ్చిందంటే చాలు కడుపుబ్బా నవ్వించే స్వచ్ఛమైన తెలుగు హాస్యంతో కూడిన సినిమా ఉంటుంది. వెకిలి చేష్టలు, వ్యంగంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ చూసేలా ఆయన సినిమాలు ఉంటాయి. చిత్ర పరిశ్రమలో అయన సృష్టించిన నవ్వుల పంట మరెవరికీ సాధ్యం కాలేదు. హాస్య చిత్రాలు ఉన్నంత కాలం గుర్తుండిపోయే అమరజీవి ఈయన. నేడు హాస్య బ్రహ్మ జంధ్యాల (Jandhyala Death Anniversary) (జూన్ 19) వర్థంతి. ఈ సందర్బంగా ఆయన్నీ స్మరించుకుంటూ జంధ్యాల సినీ ప్రయాణం గురించి, ఆయన చిత్ర విశేషాలను గురించి కొన్ని విశేషాలని తెలుసుకుందాం.

Jandhyala Death Anniversary Special

రచయిత గా ప్రారంభమై హాస్య దర్శకుడిగా…

జంధ్యాల పూర్తి పేరు “జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి”. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తితో కొన్ని నాటకాలు రచించిన జంధ్యాల, నాటకాలు రాస్తూనే కళాతపస్వీ కె.విశ్వనాథ్ దృష్టిలో పడ్డారు. ఆయన చొరవతోనే సినీ రంగ ప్రవేశం చేసిన జంధ్యాల, ఆయన రచయతగా తొలి చిత్రం ‘సిరిసిరి మువ్వ’ చేసాడు. ఇటు ‘శంకరాభరణం’ వంటి క్లాస్ చిత్రాలకు సంభాషణలు అందిస్తునే… ‘అడవిరాముడు’ వంటి మాస్ సినిమాలకు డైలాగ్స్ రాస్తూ తన కలానికి రెండు వైపులా పదును చూపించారు జంధ్యాల. మాటల రచయతగా ప్రారంభమైన జంధ్యాల సినీ కెరీర్, దర్శకుడి అవతారమెత్తి అనేక హాస్య చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కుటుంబ సభ్యులు అందరు కూర్చోని చూసే ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు అందించారు జంధ్యాల. డైరెక్టర్ గా ఆయన తొలి చిత్రం ‘ముద్ద మందారం’. తొలి చిత్రం తోనే సక్సెస్ అందుకున్నారు జంధ్యాల. అంతే కాదు ఎంతో మంది కామెడీ నటీనటులను తెలుగుతెరకు అందించిన ఘనత జంధ్యాలది. ముఖ్యంగా సుత్తి జంటైన వీరభద్రరావు, సుత్తి వేలుని ‘నాలుగు స్తంభాలాట’ సినిమాతో వెండితెరకు పరిచయం చేసారు. ఆ తర్వాత ఈ సుత్తిజంట ఎన్నో చిత్రాల్లో తమ కామెడీ టైమింగ్ తో ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది. మొదటి చిత్రంతోనే తనదైన పంచ్ డైలాగులతో, కామెడీ టైమింగుతో పరిశ్రమలో పలువురిని ఆకర్షించిన జంధ్యాల జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీమార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకుని సినిమాలు చేసారు జంధ్యాల.

- Advertisement -

హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన హాస్య బ్రహ్మ..

ఇక ఆ తర్వాత తెలుగువారందరి నవ్వుల రారాజైన బ్రహ్మానందాన్ని ‘అహనా పెళ్లంట’ చిత్రంతో పరిచయం చేసి అద్భుతమైన నటుడ్ని పరిచయం చేసారు దర్శకుడు జంధ్యాల. ఆ చిత్రంలో ‘ఒరేయ్ అరగుండు వెధవ’ అని కోటతో బ్రహ్మానందాన్ని తిట్టించినా.., బ్రహ్మానందం పోతావ్ రారేయ్ నాశనమైపోతావ్ అంటూ విచిత్రమైన హావభావాలతో నవ్వించినా, అది జంధ్యాలకు మాత్రమే చెల్లింది. తన మార్క్ డైలాగ్స్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో జంధ్యాల చేయి తిరిగినవారు. దరిద్ర నారాయణుడికి దిక్కు మాలిన స్వరూపం అని వర్ణించినా…. పాండురంగారావుతో.. “పాండ్” “జేమ్స్ పాండ్” గా మెప్పించినా, శ్రీలక్ష్మీతో నవలా రచయిత్రిగా కథలు వినిపిస్తూ వెరైటీ డైలాగ్స్ చెప్పించినా అది ఒక్క జంధ్యాలకే సొంతం. ఇక రాజేంద్రప్రసాద్ తో జంధ్యాల కి ప్రత్యేక అనుబంధం ఉంది. కామెడీ హీరోగా రాజేంద్రపసాద్ నిలదొక్కుకోవడానికి జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాలు ఎంతో ప్రముఖ పాత్ర పోషించాయి. ఇక మెగాస్టార్ చిరంజీవితో సైతం ‘చంటబ్బాయి’ గా చిత్ర విచిత్ర వేషాలు వేయించిన ఘనపాటి జంధ్యాల. ఈ సినిమాలో చిరంజీవిని జేమ్స్ పాండ్ గా మార్చి ప్రేక్షకులపై హాస్యపు జల్లులు కురిపించారు. అలాగే చిరంజీవిలో ఉన్న మంచి కామెడీ నటుడ్ని వెలికి తీసిన ఘనత కూడా హాస్య బ్రహ్మ జంధ్యాలకే దక్కుతుంది. ఇప్పటికీ ఈ చిత్రం తెలుగు వారికి గొప్ప క్లాసిక్ చిత్రంగా నిలిచింది.

కరుణరసాలతోనూ మెప్పించిన జంధ్యాల..

ఇక జంధ్యాల కేవలం హాస్య ప్రధానంగా సాగే చిత్రాలే కాకుండా క్లాసికల్ డాన్స్ ఇతివృత్తంతో ఆయన తీసిన ‘ఆనందభైరవి’ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక పడమటి సంధ్యారాగం చిత్రం తో సరికొత్త ప్రేమకథా చిత్రాన్ని అందించారు జంధ్యాల. ఇక కళా తపస్వీ దర్శకత్వం వహించిన ‘ఆపద్భాందవుడు’లో హీరోయిన్ తండ్రిగా అద్భుతాభినయాన్ని కనపరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. నటుడిగా, రచయతగా రెండు పాత్రలను సమర్థవంతంగా పోషించి మెప్పించాడు జంధ్యాల. హీరో ఎవరైనా..నటీనటులు ఎవరైనా…తన మార్కు హాస్యం ఉండేలా జాగ్రత్త తీసుకునేవాడు జంధ్యాల. ఆయన ఒక్కో చిత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉండేలా చూసుకునేవారు జంధ్యాల. తన సినిమాలతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి తన సత్తా చాటిన దర్శకుడు జంధ్యాల. చివరగా తెలుగు సినిమా చరిత్ర లో జంధ్యాల అంత స్వచ్ఛమైన హాస్యాన్ని పండించిన దర్శకులు ఎవరూ లేరని చెప్పాలి. ప్రస్తుతం ఆయన మనమధ్య లేకపోయినా, తన సినిమాలతో ఆయన పండించిన హాస్యం ప్రేక్షకుల చిరునవ్వుల్లో ఎప్పటికి నిలిచి ఉంటారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు