Kiran Abbavaram : పాన్ ఇండియా అనేది స్థాయి కాదు.. బాధ్యత

Kiran Abbavaram : ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్లో పాన్ ఇండియా ప్రాజెక్టుల హవా పెరిగింది. బిజినెస్ బాగా జరుగుతుందనో లేక ఆ ప్రాజెక్టు ఎక్కువగా వార్తల్లో నిలిచి బజ్ వస్తుందనో కానీ.. మేకర్స్ ప్రారంభోత్సవం రోజునే ‘మాది పాన్ ఇండియా సినిమా’ అంటూ ప్రకటనలు చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా ప్రకటించిన ప్రతి సినిమా.. ఫైనల్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందా అంటే? ‘చాలా వరకు అవ్వడం లేదు’ ఇది నిజం. ఎందుకు అంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమాకి సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. ముఖ్యంగా ఒక భాషలో రూపొందిన సినిమా సోలో రిలీజ్ డేట్ ను దక్కించుకోవడం చాలా కష్టంగా మారింది. ఒకవేళ సోలో రిలీజ్ డేట్ కదా అని అనౌన్స్ చేసినా.. రిలీజ్ టైంకి ఇంకో పెద్ద సినిమా పోటీగా దిగుతుంది అంటే బయ్యర్స్ నుండి ప్రాబ్లమ్ ఎదురవుతుంది. థియేటర్స్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది. అందువల్ల పాన్ ఇండియా ప్రాజెక్టులుగా అనౌన్స్ చేసిన సినిమాలు చివరి నిమిషంలో రీజనల్ మూవీస్ గానే రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి లెక్కలు ఏమీ వేసుకోకుండా.. చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో భాగం కావాలని చూస్తున్నారు.

వాస్తవానికి కంటెంట్ డిమాండ్ చేస్తే పాన్ ఇండియా ప్రాజెక్టు అవుతుంది. పెద్ద స్టార్స్ ఉన్నంత మాత్రాన, పెద్ద బడ్జెట్ పెట్టినంత మాత్రాన. ఏవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అయిపోవు. కంటెంట్ డిమాండ్ చేయాలి. దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా కేటాయిస్తే.. అప్పుడు హీరోల ఇమేజ్ తో సంబంధం లేకుండా విజయాలు వరిస్తాయి.

‘బాహుబలి’ ‘కాంతార’ ‘కార్తికేయ 2’ వంటివి హీరోల ఇమేజ్ తో, మార్కెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ పై ఆధారపడి రూపొందిన సినిమాలు. అందుకే అవి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాయి. ‘పుష్ప’ లో కూడా హీరో ఎదుగుదల అనేది ఆంధ్రలోని చిత్తూరు నుండి మొదలై తమిళనాడు వంటి ఏరియాలకి పాకుతుంది. ఆ ఎలిమెంట్ ఉంది కాబట్టే అది పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. కేవలం అల్లు అర్జున్ కి ఉన్న ఇమేజ్ ని బట్టి కాదు.

- Advertisement -

సరే అన్నీ పక్కన పెడితే.. కిరణ్ అబ్బవరం కూడా ‘క'(KA) అనే పాన్ ఇండియా సినిమా చేశాడు. దీని టీజర్ రిలీజ్ వేడుకలో ఓ రిపోర్టర్ ‘మీ స్థాయికి తగ్గట్టు కాకుండా పాన్ ఇండియా ప్రాజెక్టు చేయడం రిస్క్ కదా?’ అంటూ ప్రశ్నించాడు.

నిజమే కిరణ్ అబ్బవరం మార్కెట్ ఇప్పుడు రూ.20 కోట్ల రేంజ్లోనే ఉంది. థియేట్రికల్ గా చూసుకుంటే రూ.6 కోట్ల నుండి రూ.8 కోట్ల దగ్గరే ఉంది. అలాంటప్పుడు అతనితో రూ.50 కోట్ల బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమా తీస్తే రిస్కే. అది కిరణ్ అబ్బవరంకి కూడా తెలుసు.

కానీ ‘క’ అనే సినిమా రూ.20 కోట్ల బడ్జెట్లో రూపొందిన పాన్ ఇండియా సినిమా. సో అది రిస్కీ ప్రాజెక్టు కాదు. గట్టిగా మార్కెట్ చేసుకుని అన్ని భాషల్లోనూ నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగితే.. పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. సో ఇది అంచనా వేయకుండా రిపోర్టర్లు కిరణ్ అబ్బవరం వంటి హీరోలని అలాంటి ప్రశ్నలు వేయకూడదు అనే చెప్పాలి.

అలాగే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని.. పాన్ ఇండియా ప్రాజెక్టుని ‘హీరో స్థాయికి తగ్గట్టు కాదు… బాధ్యతగా రూపొందించాలి’ అనే విషయాన్ని దర్శకనిర్మాతలు అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి.

– Kumar Naidu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు