Manjummel Boys Case : మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలపై ఈడీ విచారణ స్టార్ట్

Manjummel Boys Case : మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’పై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ( ED ) దర్యాప్తును ముమ్మరం చేసింది. మరోసారి నిర్మాతలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

రెండవసారి నిర్మాతలకు నోటీసులు

మనీలాండరింగ్ నిరోధక సంస్థ ఈడీ మంజుమ్మెల్ బాయ్స్ చిత్ర నిర్మాతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. ఇప్పటికే ఓసారి దీనికి సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయగా, ఇంకా స్పందించని సౌబిన్ షాహిర్ , బాబు షాహిర్, షాన్ ఆంటోనీలకు రెండవ సారి నోటీసులు జారీ చేసింది ఈడీ. నిర్మాత, నటుడు సౌబిన్ షాహిర్‌ను త్వరలో ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. మంజుమ్మెల్ బాయ్స్ ను నిర్మించిన నిర్మాణ సంస్థ పరవ ఫిల్మ్స్ వ్యవస్థాపకులు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలకు ప్రాథమిక నోటీసు పంపారు.

వివాదం ఏంటంటే?

మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ ఈ సంవత్సరం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఫీలింగ్ ను కలిగించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2024లో మలయాళ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. అయితే తరువాత సినిమా పెట్టుబడిదారు తనను నిర్మాతలు మోసం చేశారని చెప్పడంతో మేకర్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఫిర్యాదుదారు ప్రకారం చిత్ర నిర్మాతలు సినిమాపై పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలంగా సినిమా మొత్తం లాభాల వాటాలో 40% అతనికి ఇస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళ హామీ మేరకు మంజుమ్మెల్ బాయ్స్ మూవీకి 7 కోట్లను చిత్ర పెట్టుబడిదారుడు సిరాజ్ వలియతార హమీద్ ఖర్చు పెట్టారు.

- Advertisement -

ED initiates money laundering probe against producers of Manjummel Boys

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 220 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కానీ ఊహించని విధంగా నిర్మాతలు పెట్టుబడి దారుడికి తాము ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవడం చీటింగ్ కేసుకు దారితీసింది. సినిమా లాభాల్లో వాటా ఇస్తామని చెప్పి రూ.7 కోట్లు దోచుకున్నారని సిరాజ్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ విషయంపై ఈడీ దర్యాప్తు ముందుకు సాగుతోంది. మరి చివరకు ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

నిర్మాతల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్

తురవూరుకు చెందిన సిరాజ్ ఫిర్యాదు చేయగా, ఎర్నాకుళం 1వ తరగతి మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, ఫోర్జరీ ఆరోపణల కింద మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై గతంలో సిరాజ్ సివిల్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో భాగంగా నిర్మాత బ్యాంకు ఖాతాను స్తంభింపజేయాలని ఎర్నాకులం సబ్ కోర్టు ఆదేశించింది. నిర్మాణ సంస్థ పరవ ఫిల్మ్స్, దాని భాగస్వామి షాన్ ఆంథోనీకి చెందిన 40 కోట్ల బ్యాంక్ ఖాతాను ఎర్నాకులం సబ్ కోర్టు స్తంభింపజేసింది. అదే సమయంలో ముందస్తు ఆలోచనతోనే మోసం జరిగిందని మారేడు పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ సినిమాకు దాదాపు రూ.22 కోట్లు ఖర్చయిందని నిర్మాతలు చెబుతున్నా.. విచారణలో రూ.18 కోట్లు మాత్రమే దొరికాయి. దీంతో పోలీసుల విచారణ అనంతరం ఈడీ కూడా రంగంలోకి దిగింది.

తరువాత నిర్మాతలలో ఒకరైన షాన్ ఆంథోనీని మరుసటి రోజు చాలా గంటలు పాటు ఈడీ విచారించింది. సౌబిన్ షాహిర్‌కు తక్షణమే ఈడీ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. సినిమా నిర్మాణంలో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ ప్రధానంగా దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక విచారణ మాత్రమే కొనసాగుతోంది. తదుపరి దర్యాప్తులో ఈడీ కేసు నమోదుతో సహా చర్యలు తీసుకుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు