NTR Birth Anniversary : విశ్వా విఖ్యాత నటసార్వభౌముడు.. “కథానాయకుడి” నుండి “నాయకుడి”గా సినీ,రాజకీయ ప్రస్థానం..

NTR Birth Anniversary : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహానటుడు ఎన్టీ రామారావు సినీ ప్రస్థానం ఒక శకం. విశ్వా విఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగు ప్రజల చేత జేజేలు అందుకున్న మహానటుడాయన. ఎన్టీవోడు అని అభిమానులు పిలుచుకునే ఎన్టీఆర్ ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు తెలుగు చిత్రసీమ ని ఏలాడు. అయితే పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రం తారక రామారావుని శ్రీరాముడు, శ్రీకృష్ణుడి వేషంలో చూసిన తర్వాత రాముడైనా, కృష్ణుడైనా ఆయనే అనేవారు. వెండితెరపై ఆయన చేయని పాత్ర లేదు. వేయని వేషం లేదు. పౌరాణిక, ఇతిహాస, జానపద, సాంఘిక చిత్రాల వరకు అన్నీ రకాల సినిమాలు చేసేశారాయన. వెండితెరపై నవరసాలను అలవోకగా పండించగల నట సార్వభౌముడుగా తెలుగు ప్రజల చేత ‘అన్నగారు’ అని పిలిపించుకునే నందమూరి తారక రామారావు 101వ జయంతి (NTR Birth Anniversary) నేడు. ఈ సందర్బంగా ఆ మహానటుడుకి నివాళులు అర్పిస్తూ చిత్ర కథానాయకుడి నుండి రాజకీయ మహానాయకుడిగా ఎన్టీ రామారావు సినీ ప్రస్థానాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

NTR Birth Anniversary Special story

నటసార్వభౌముడిగా రామారావు ప్రయాణం..

1923 మే 28న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలం నిమ్మకూరు జన్మించిన ఎన్టీఆర్ 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుని, రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరారు. కానీ ఆ ఉద్యోగం నచ్చక సినిమాలపై మక్కువతో నటించడానికి మద్రాసు వచ్చారు. 1949లో మనదేశం అనే చిత్రంలో చిన్న పోలీస్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అందులో భారతీయుల్ని కొట్టే బ్రిటిష్ పోలీస్ గా ఎన్టీఆర్ వెండితెరపై మొదటిసారిగా కనిపించారు. ఆ తర్వాత దర్శకుడు ఎల్వి ప్రసాద్ ఎన్టీఆర్ ని మెచ్చుకుని, తన షావుకారు చిత్రంతో తొలిసారి కథానాయకునిగా పరిచయం చేసారు. ఆ వెంటనే పల్లెటూరి పిల్ల చిత్రంలోనూ నటించిన ఎన్టీఆర్, వీటి తర్వాత చేసిన “పాతాళభైరవి” (1951) తో స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా చంద్రహారం, రేచుక్క, అగ్గిరాముడు, మిస్సమ్మ వంటి చిత్రాలతో తెలుగుతెరపై వరుస హిట్లు కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక 1957 లో వచ్చిన మాయాబజార్ సినిమా ఎన్టీఆర్ ని పౌరాణిక చిత్రాలకు కేరాఫ్ గా మార్చింది. అప్పటి నుండి రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆర్ తర్వాతే అన్నట్టుగా తెలుగుప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఆపై లవకుశ, సీతారామకల్యాణం, శ్రీ కృష్ణ పాండవీయం, పాండవ వనవాసం, వంటి పౌరాణిక చిత్రాలతో సినీ పరిశ్రమని ఏలారు. అలాగే జానపదాల్లోనూ తనదైన శైలిలో అగ్గిబరాట, జయసింహ, జగదేకవీరునిథ, గులేబకావళి కథ వంటి చిత్రాలతో అలరించారు.

- Advertisement -

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఎన్టీ రామారావు అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక.. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. అంతే కాదు రెండో తరం హీరోలకు ధీటుగా అడవిరాముడు, వేటగాడు వంటి కమర్షియల్ చిత్రాలతో కూడా తనదైన దమ్ము చూపించారు. అయితే అప్పటివరకు సినీ ప్రస్థానంలో నెంబర్ వన్ గా చిత్ర సీమని ఏలిన ఎన్టీఆర్, ఆ తర్వాత రాజకీయాల్లోనూ అందనంత ఎత్తుకు ఎదిగారు.

NTR Birth Anniversary Special story

తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి గా జయకేతనం..

చిత్ర పరిశ్రమలో రారాజుగా నాలుగుదశాబ్దాలు ఏలిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోకి రాకముందే ప్రజలకి సినిమాల ద్వారా చేరువైన ఎన్టీఆర్, రాజకీయాల్లో రాణించడానికి చాలా సులభమైంది. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించగానే, తారక రాముడి అనూహ్య నిర్ణయానికి అప్పటి కాంగ్రెస్ నుండి రాజ్యసభ సీటు ఇస్తాం, సీఎం ని చేస్తాం అంటూ రాయబారాలు మొదలయ్యాయి. కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగని ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయి తెలుగువాడి వాడి,వేడి ఏంటో ఢిల్లీ నాయకులకు చూపించాడు. తెలుగు నాట ఏకంగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ సినీ, రాజకీయాల్లో అప్రతిహత విజయాలను అందుకుంటూ మహానేతగానూ తెలుగువారి ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు