RamaNaidu Birth Anniversary : “మూవీ మొఘల్” గా ఇండస్ట్రీ లో చెరగని ముద్ర..

RamaNaidu Birth Anniversary : తెలుగు చిత్రసీమలో “మూవీ మొఘల్” రామానాయుడు ప్రస్థానం చాలా ప్రత్యేకమైంది. ఆరు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర సీమలో ఎన్నో రికార్డులు, రికార్డులు సాధించిన ఆయన విజయాలకు కేరాఫ్ గా నిలిచి ఇండస్ట్రీ లో అందరి మన్ననలను పొందారు. ఇండస్ట్రీ లో రాణించాలనుకునే ఎంతో మంది నిర్మాతలకు ఆదర్శప్రాయుడయ్యారు. తెలుగులో ఎంతో మంది దర్శకనిర్మాతలతో పాటు హీరో,హీరోయిన్లను కూడా పరిచయం చేసి వాళ్ళకి జీవితాన్నందించారు రామ నాయుడు. అసలు రామానాయుడు పేరు తలచుకోగానే ఆయన సాధించిన అపూర్వ విజయాలు ముందుగా గుర్తుకు వస్తాయి. ప్రపంచంలోనే అత్యధిక కథా చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన తీరు మన మదిలో మెదలుతుంది. భారతదేశంలోని 14 భాషల్లో 12 ప్రముఖ భాషల్లో చిత్రాలను నిర్మించి, దేశంలోనూ ఉన్నతమైన ఘనతను సాధించారు. ఒక నిర్మాతగా అనితర సాధ్యంగా రామానాయుడు సాగిన తీరును గుర్తు చేసుకుంటే తెలుగు సినీ అభిమానులకు మనసు పులకించి పోవలసిందే. దిల్ రాజు, నాగ వంశి లాంటి బడా నిర్మాతలు ఎందరో రామనాయుడుని ఆదర్శంగా తీసుకుని నిర్మాతలుగా సక్సెస్ అయ్యారు. ఈ రోజు ఆయన జయంతి (RamaNaidu Birth Anniversary) (జూన్ 6) సందర్బంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ “మూవీ మొఘల్” గా రామానాయుడు ఇండస్ట్రీలో సాధించిన ఘనతని గుర్తు చేసుకుందాం.

RamaNaidu Birth Anniversary Special

మూడు తరాల హీరోలతో సినిమాల నిర్మాణం..

గుంటూరు జిల్లా కారంచేడు లో జన్మించిన దగ్గుబాటి రామానాయుడు సంపన్నుల రైతు కుటుంబంలో జన్మించినా, సినిమా ఇండస్ట్రీ లో రాణించాలని ఆసక్తిగా ఉండేది. అప్పుడే రామానాయుడు సమీపబంధువు యార్లగడ్డ వెంకన్న చౌదరి, ఏయన్నార్ హీరోగా ‘నమ్మిన బంటు’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి. ఆ సినిమాలో కొంత భాగాన్ని కారంచేడులోనూ చిత్రీకరించారు. ఆ సమయంలో షూటింగ్ లో యూనిట్ వారికి కావలసినవి సమకూరుస్తూ హుషారుగా పాలు పంచుకున్నారు రామానాయుడు. ఆ క్రమంలో సినిమాలపై ఇష్టంతో రామానాయుడు నటుడు కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. అయితే నటన కన్నా నిర్మాణం మేలని భావించి, ముందు ‘అనురాగం’ అనే చిత్రానికి పార్ట్ నర్ గా ఉన్నారు. ఆపై సొంతగా ‘సురేశ్ ప్రొడక్షన్స్’ సంస్థను స్థాపించి, తొలి ప్రయత్నంలోనే యన్టీఆర్ తో ‘రాముడు-భీముడు’ నిర్మించి అఖండ విజయం సాధించాడు. ఆ తర్వాత వరుసగా యన్టీఆర్ తో ‘శ్రీకృష్ణతులాభారం, స్త్రీజన్మ’ చిత్రాలు నిర్మించారు. అలాగే కాంతారావుతో ‘ప్రతిజ్ఞాపాలన, బొమ్మలు చెప్పిన కథ’, ఏయన్నార్ తో ‘సిపాయి చిన్నయ్య, ప్రేమనగర్, సెక్రటరీ, ప్రేమమందిరం” చిత్రాలు, శోభన్ బాబుతో “జీవనతరంగాలు, చక్రవాకం, సోగ్గాడు, దేవత, వంటి సినిమాలు, కృష్ణతో ‘సావాసగాళ్ళు’, కృష్ణంరాజుతో ‘అగ్నిపూలు’ వంటి సినిమాలు నిర్మించి సూపర్ సక్సెస్ అయ్యారు.

- Advertisement -

అలాగే రెండో తరం స్టార్ హీరోలైన చిరంజీవితో ‘సంఘర్షణ’, బాలకృష్ణతో ‘కథానాయకుడు, రాము’, నాగార్జునతో ‘చినబాబు’, ఇక రామానాయుడు చిన్న కొడుకైన వెంకటేశ్ తో ‘కలియుగ పాండవులు, బ్రహ్మపుత్రుడు, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, కూలీ నంబర్ వన్” వంటి చిత్రాలు నిర్మించారు. వీరితోనే కాక శ్రీకాంత్, జగపతి బాబు, జె.డి.చక్రవర్తి, వడ్డే వంటి హీరోలతోనూ చిత్రాలు నిర్మించి అలరించారు రామానాయుడు. ఇక మూడో తరం యంగ్ హీరోలైన అల్లరి నరేష్, నిఖిల్, నవదీప్, తరుణ్, రామ్ పోతినేని వంటి హీరోలతో కూడా పలు సినిమాలు చేసారు రామానాయుడు.

సినీ చరిత్రలో మూవీ మొఘల్ గా రికార్డులు…

ఇక రామానాయుడు ఒక్క తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, పంజాబీ, భోజ్ పురి, గుజరాతీ, అస్సామీ భాషల్లోనూ చిత్రాలు నిర్మించి రికార్డులు సృష్టించారు. ఓ నిర్మాత ఇన్ని భాషల్లో సినిమాలు నిర్మించడం ఓ రికార్డ్. భారతదేశంలో 14 భాషల్లో సినిమాలు తీసిన చరిత్ర మరెవరికి లేదు. అయితే రామానాయుడు తాను చేసే చిత్రాన్నయినా మనస్ఫూర్తిగా నమ్మి నిర్మించేవారు. కథ విన్నాక ఆ సినిమాకి బడ్జెట్ ఎక్కువైనా సరే ఆలోచించకుండా సినిమా కోసం పెట్టేస్తారు. తన చిత్రాల ద్వారా ప్రతిభావంతులకు పట్టం కట్టి ఎంతోమంది దర్శకులను, కళాకారులను తన సినిమాల ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు. అలాగే నిర్మాణంలో సాగుతూనే స్టూడియోను నిర్మించారు. పంపిణీ సంస్థను, పబ్లిసిటీ కంపెనీని కూడా నెలకొల్పి, సినిమారంగానికి అత్యున్నత సేవలు అందించారు. శతాధిక చిత్రాల నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాదు, తన స్టూడియో నిర్మాణ సంస్థల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు నాయుడు. అలాగే రాజకీయాల్లో బాపట్ల పార్లమెంట్ నుండి లోక్ సభకు ఎన్నికై, ఎంపీగా జనానికి చేతనైన సాయం చేశారు రామానాయుడు. ఇలా ఎంతోమంది మదిలో చెరిగిపోని స్థానం సంపాదించిన రామానాయుడు 2015 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. అయినా ఇప్పటికి కొత్తగా చిత్రసీమలో ప్రవేశించే నిర్మాతలు ముందుగా రామానాయుడునే తలచుకుంటున్నారు. అదీ ఆయన సాధించిన ఘనత! ఇక రామానాయుడు తర్వాత సురేష్ బాబు నిర్మాణ బాధత్యల్ని తీసుకుని రామానాయుడు స్టూడియోని చూసుకుంటుండగా, నటవారసుడిగా విక్టరీ వెంకటేష్ తన సినిమాలతో ప్రేక్షలుల్ని మెప్పిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు