RamojiRao : రామోజీరావు సారథ్యంలో వస్తూ ఎంతోమంది గొప్పగాయకులని నిలబెట్టిన ఎవర్ గ్రీన్ షోలు..

RamojiRao : ప్రముఖ దిగ్గజ ఈనాడు సంస్థల చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావు ఈరోజు తుదిశ్వాస విడిచారు. నిన్న అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో చేరిన రామోజీరావు, తెల్లవారుజామున కన్నుమూయడం జరిగింది. ఇక ఆయన చనిపోయిన వార్త తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఆయన మరణవార్త తీరని లోటు అని సం సంతాపం ప్రకటించారు. అలాగే లెజెండరీ సినీ నటులు చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజనటులు రామోజీరావు (RamojiRao) మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఇక ఈనాడు పత్రికారంగం, అలాగే ఈటివి మీడియా ఛానెళ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలని ఎంతో చైతన్యపరిచారు. ఇక ఈటీవి ఛానెల్ ద్వారా గత మూడు దశాబ్దాలుగా ఎంతో మంది ప్రతిభావంతులను చిత్రపరిశ్రమకు పరిచయం చేసి వారికి జీవితాన్ని అందించారు.

RamojiRao's ETV Evergreen Classic Shows Padutha Teeyaga, Swarabhishekam

ఎంతో మందిని తీర్చిదిద్దిన క్లాసిక్ షోస్..

అయితే ఈటివి షోస్ అనగానే చిన్నా, పెద్దా అందరికి గుర్తొచ్చే ఎవర్ గ్రీన్ క్లాసిక్ షోలు రెండున్నాయి. అవే “పాడుతా తీయగా”, “స్వరాభిషేకం”. ముఖ్యంగా పాడుతా తీయగా షో నుండి పాతికేళ్లుగా ఎంతో మంది గొప్పగాయకులు, స్టార్ సింగర్స్ వచ్చారు. ఈ పాటల ప్రోగ్రాం ద్వారా వచ్చిన గాయకుల్లో చాలా మంది ఇండస్ట్రీ లో స్టార్ సింగర్స్ అయ్యారు. ఆరేళ్ళ పిల్లాడి నుండి ముసలివాళ్ల దాకా అందరికి ఈ ప్రోగ్రాం అంటే చాలా ఇష్టం. ఎలాంటి వ్యంగ్య భాషలకు కూడా చోటునివ్వని స్వచ్ఛమైన తెలుగు పాటల షో ఇది. మహా గాయకులు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జడ్జిగా దాదాపు పాతికేళ్ల పాటు అప్రతిహతంగా పాడుతా తీయగా పాటల కార్యక్రమం సాగింది. 1996 లో రామోజీరావు నిర్మాణ సారథ్యంలోనే, 25 ఏళ్ల క్రితం బాలు చేతుల మీదుగా ప్రారంభమైంది. బాలు ఉన్నప్పటి వరకు విజయవంతంగా 18 సీజన్స్ అప్రతిహతంగా సాగింది. ఈ స్వరయజ్ఞంలో ఎంతోమంది వేలాది మంది ప్రతిభావంతులను తెలుగు తెరతో పాటు సమాజానికి పరిచయం చేసింది ఈ వేడుక. ఎస్పీ బాలు ఉన్నపుడు “పాడుతా తీయగా” అంటే అదో బ్రాండ్. కానీ ఆయన అర్ధాంతరంగా మరణించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిలిపివేయకుండా, ఎస్పీ బాలు కుమారుడు నిర్వహిస్తున్నాడు.

- Advertisement -

ఎంతో మందిని గాయకులకు జీవితం ఇచ్చిన పాడుతా తీయగా..

ఇక పాడుతా తీయగా పాటల షో లో పాల్గొన్న ఎంతో మంది గాయకులు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. అలాగే ఈ గాయకులకు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ చేయూతగానే ఉంటుంది. ఎప్పట్నుంచో టాలీవుడ్‌లో స్టార్ సింగర్లుగా రాణిస్తున్న ఉష, హేమచంద్ర, కారుణ్య, రామాచారి, మాళవిక, కౌసల్య, స్మిత, కె.ఎం.రాధాకృష్ణ, గోపికా పూర్ణిమా, సాహితి, దామిని, మల్లిఖార్జున్ లాంటి ఎందరో గాయకులు ఈటీవీ పాడుతా తీయగా నుంచి వచ్చిన వాళ్లే. ఇక ఈ షో కి ఎలాంటి ఆటంకం రాకుండా ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వ్యాఖ్యాత గా నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత చంద్రబోస్, అలాగే సునీత, విజయ్‌ ప్రకాష్‌ లాంటి మేటి గాయకులు, జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

ఇద్దరు మహామహులు వెళ్లిపోయారు.. కళ తప్పుతుందా?

ఇక అలాగే ఎస్పీ బాలు సారథ్యంలోనే స్వరాభిషేకం అనే గొప్ప షో కూడా చాలా ఏళ్లుగా రన్ అవుతూ వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ సింగర్స్ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ పాటల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే నిజం చెప్పాలంటే ఎస్పీ బాలు వెళ్ళిపోయాక ఈ షోలు నిర్వహిస్తున్నా ఆయన లేని లోటు స్పష్ఠంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి గొప్ప షోలు జరగడానికి కారణమైన రామోజీరావే ఇండస్ట్రీకి దూరమవడం మరింత బాధాకరం అని చెప్పాలి. మరి ఈ మహామహులు లేని లోటు ముందుముందు తీరుతుందా? పాడుతా తీయగా లాంటి గొప్ప షోలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయా లేదా చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు