SiriVennela Sitaramashastri Birth Anniversary : వెండితెర సాహిత్య సాగరంలో సిరివెన్నెల ప్రయాణం…

SiriVennela Sitaramashastri Birth Anniversary : తెలుగు చిత్ర పరిశ్రమలో సాహిత్య ప్రపంచంలో ఒక్కో తరం ఒక్కో లెజెండరీ వ్యక్తులకి సొంతం. ఒక్కో రచయితది ఒక్కో శైలి. కానీ అన్ని రకాల నవరసాల రుచులని మేళవించి ఏ సందర్భాన్నైనా మైమరపించేలా, ఉత్తేజ పరిచేలా, ఆలోచింపచేసేలా గీతాలని రాసేవారు కొందరే ఉంటారు. అలంటి అతి తక్కువ మంది అద్భుతమైన రచయితల్లో “సిరివెన్నెల సీతారామశాస్త్రి” ఒకరు. ప్రేమగీతమైన, విరహరాగమైన, దేశభక్తి అయినా, విప్లవ గీతమైనా.. ఆయనకు ఆయనే సాటి. ఆయన ఏ సందర్భానికైనా క్షణాల్లో పాట రాసేయగల దిట్ట. తెలుగు చిత్ర పరిశ్రమలో కాలానికి తగ్గట్టుగా పాటలు రాసుకుపోయే రచయిత ఆయన. పదేళ్ల చిన్న పిల్లాడికి కూడా అర్ధమయ్యే విధంగా, ఆలోచింపచేసే విధంగా పాటలు రాయడానికే ఆయన ఇష్టపడతారు. ముఖ్యంగా ఓటమిలో
ఉన్న సగటు మనిషికి ధైర్యం చెప్పేలా ఉండే సిరివెన్నెల పాటలు అందరికి ఆదర్శం. ఇలా ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. తొలి పాటతోనే చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుని, తొలిసినిమానే ఇంటి పేరుగా మార్చుకున్న “సిరివెన్నెల సీతారామశాస్త్రి” (మే 20) జయంతి నేడు. ఈ సందర్బంగా ఆయన్నీ గుర్తుచేసుకుంటూ సిరివెన్నెల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం.

“సిరివెన్నెల” గా చిత్ర పరిశ్రమలో శిఖరాగ్రం..

అనకాపల్లి నుండి చిత్ర పరిశ్రమకు వచ్చిన సీతారామశాస్త్రి, తొలి సినిమాకే కె. విశ్వనాధ్ సినిమాకి పని చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన “జనని జన్మభూమి” చిత్రంలో ఓ పాట కి అవకాశం ఇవ్వగా, “రసవాహిని స్వాగతం” అంటూ తొలిపాట రాయగా, మంచి పేరు వచ్చింది. అయితే సీతారామశాస్త్రిని చిత్ర పరిశ్రమలో నిలబెట్టింది “సిరివెన్నెల” చిత్రం. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు విశ్వనాథ్. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ అద్భుతమైన పాటలను అందించారు సీతారామశాస్త్రి. ఎంతగా అంటే తొలిసినిమాకే నంది అందుకునేంతగా. సిరివెన్నెల సినిమాలోని అన్ని పాటలు రాశారు. ఈ సినిమాలో “విధాత తలపున ప్రభవించినది” అనే పాట ఇప్పటికీ కోట్ల మంది తెలుగు వాళ్లకి ఎంతో ఇష్టమైన పాట. ఇక ఈ సినిమానే ఇంటిపేరుగా మలుచుకున్న శాస్త్రి “సిరివెన్నెల సీతారామశాస్త్రి” అయ్యారు. ఆ తరవాత విశ్వనాధ్ తీసిన ప్రతి సినిమాలోనూ ఆయన పాటలు రాసారు. అక్కడి నుండి ఇప్పటివరకు మూడు వేలకు పైగా పాటలు రాసారు సీతారామశాస్త్రి.

SiriVennela Sitaramashastri Brith Anniversary Special

- Advertisement -

ఆణిముత్యాలకు పదకొండు నందుల పంట..

ఇక సిరివెన్నెల పాటల్లో ఈ పాట బెస్ట్ అని కూడా నిర్ణయించలేము. ఎందుకంటే ఆయన పాటల్లో దేనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలో కూడా నిర్ణయించలేనంత గొప్పగా ఉంటాయి. ఆది భిక్షువు వాడినేదిఅడిగేది అంటూ తొలి చిత్రంలోనే శివుడ్ని నిందిస్తూ, కీర్తిస్తూ పాడిన సిరివెన్నెల తొలి చిత్రానికే నందిని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘శ్రుతిలయలు’ లో “తెలవారదేమో స్వామీ…” ఆ తర్వాత ఏడాది “అందెలరవమిది పదములదా…” ‘స్వర్ణకమలం’ తో వరుసగా మూడు నందులను సొంతం చేసుకున్నారు సీతారామ శాస్త్రి. ఇక ఆయన అందుకున్న తొలి మూడు నంది అవార్డులూ కళాతపస్వి కె.విశ్వనాథ్ చిత్రాల ద్వారానే కావడం విశేషం.

ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ‘గాయం’తో “సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని?…” పాటతో మరో నందిని సొంతం చేసుకోగా, ‘శుభలగ్నం’లో లో “చిలకా ఏ తోడు లేక…” అంటూ సాగే పాటకు ఇంకో నంది వచ్చి వాలింది. ఆ తర్వాత ‘శ్రీకారం’ లో “మనసు కాస్త కలత పడితే…” అంటూ ఐదో నందిని దక్కించుకున్నాడు. ఆ తర్వాత కృష్ణవంశీ ‘సిందూరం’ కోసం “అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా…” అంటూ తెలుగు జనాలను ప్రశ్నిస్తూ ఆరో నందిని తెచ్చుకున్నాడు. ఇక
ఆ తర్వాత వర్మ తీసిన ‘ప్రేమకథ’లో “దేవుడు కరుణిస్తాడని” పాటకి మళ్ళీ దేవుడు కరుణించి నందిని ఇచ్చేసాడు. ఇక చక్రంలో “జగమంత కుటుంబం నాది…” అంటూ వేదాంతం పలికి నందిని తీసున్నాడు. “ఎంతవరకు ఎందుకొరకు…” అంటూ క్రిష్ ‘గమ్యం’ కోసం సిరివెన్నెల రాస్తే.. పదవ నంది పరుగులు తీస్తూ వచ్చింది. ఇక శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో “మరి అంతగా…” అంటూ రాగాలు తీసింది సిరివెన్నెల కలం. అలా పదకొండు నందులు సీతారామశాస్త్రి ఇంట చేరాయి.

ఇక సిరివెన్నెల అవార్డుల పంట గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు రాసేస్తాం. అంతటి ఘనమైన కీర్తిని సంపాదించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి (SiriVennela Sitaramashastri Birth Anniversary) మన మధ్య లేకపోయినా ఆయన రాసిన ఎన్నో వందల పాటలతో నిత్యం తెలుగు సాహిత్య అభిమానులని పలకరిస్తూనే ఉంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు