Prince : అనుదీప్ మార్క్ కామెడీతో..

దర్శకుడు అనుదీప్ గురించి తెలియని వారు ఉండరు. ఈయన పిట్ట గోడ అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. తర్వాత నవీన్ పోలిశెట్టి తో తెరకెక్కించిన జాతి రత్నాలు చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆయన చేస్తున్న మూడో చిత్రం ప్రిన్స్. శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న తెలుగు, తమిళ్ ద్వి భాష చిత్రం ఇది. ఉక్రెయిన్ బ్యూటీ మరియా రియాబోషప్కా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ప్రముఖ కోలీవుడ్ నటుడు సత్య రాజ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా ఈ ట్రైలర్ ను చిత్ర‌ యూనిట్ విడుదల చేసింది.

ఈ ట్రైలర్ ”రేయ్ కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా.. మనందరిదీ ఒకే రక్తం రా..” అని సత్య రాజ్ చెప్పిన డైలాగ్ తో ప్రారంభమవుతుంది. ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న హీరో, అదే స్కూల్ లో కొత్తగా వచ్చిన బ్రిటీష్ అమ్మాయి జెస్సికా అనే టీచర్ తో ప్రేమలో పడుతాడు. అప్పటికే ఆ ఊళ్లో కులం, మతం గురించి గొడవలు ఉన్న సందర్భంలో వేరే దేశానికి చేందిన అమ్మాయిని హీరో ప్రేమించడంతో గొడవలు మరింత పెరుగుతాయి. వీటిని హీరో ఎదుర్కున్నాడా ?, జెస్సికాను పెళ్లి చేసుకున్నాడా అనేది సినిమాలో తెలుస్తోంది.

అనుదీప్ సినిమా అంటే కామెడీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ చిత్రంలో కూడా అనుదీప్ మార్క్ కామెడీ ఉందని ట్రైలర్ తో తెలుస్తోంది. చాలా సీరియస్, సున్నిత‌మైన అంశానికి కామెడీ జోడించి తెరకెక్కించిన్నట్టు అర్థమవుతోంది. కాగా ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా కూడా జాతి రత్నాలు అంతటి హిట్ అవుతుందో లేదో తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు