Tollywood: “శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం”.. ది లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా

ఎస్పీ బాలు.. ఈ పేరు వింటే చాలు సంగీత హృదయం పులకరించి పోతుంది. మాట పాటగా మారుతుంది. గొంతు కోయిలైపోతుంది. “తరలి రాదా తనే వసంతం” అంటూ ప్రకృతిని పిలిచినా, ఓ పాప లాలి అంటూ చిన్నపిల్లలకి జో కొట్టినా, అంతా రామమయం అంటూ భక్తితో దేవుడ్ని పిలిచినా, నేనుసైతం ప్రపంచాగ్నికి అంటూ యువతను ఉత్తేజపరచాలన్నా ఆయనతోనే సాధ్యం. ఇంట, బయట, గుళ్లో, బళ్ళో ఎక్కడైనా సరే ప్రతిరోజు ఎదో ఒక సమయాన బాలు పాట వింటూ ఉంటాం.

నేడు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి. ఈ సందర్బంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ, SPB గురించి మచ్చుకు కొన్ని విషయాలను గుర్తుచేసుకుందాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దశకం నుంచి నేటి తరం హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వరకు మూడు తరాల హీరోలకు పాటలు పాడిన ఘనత ఎస్పీ బాలు కే చెందుతుంది. ఒకానొక దశలో కృష్ణ, శోభన్ బాబు లాంటి స్టార్లు ఎస్పీ బాలు పాడకపోతే తమ సినిమాలు ఆడవు అని అనేవారు. ఎక్కడో నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామములో బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన ఆయన ప్రముఖ సంగీత దిగ్గజం SP కోదండపాణి శిష్యుడిగా “ఎస్పీ బాలసుబ్రమణ్యం” 1966లో “శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న” చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

ఎస్పీ బాలు 16 భాషల్లో నలభై వేలకుపైగా పాటలు పాడగా, ఉత్తమ గాయకుడిగా ఆరు నేషనల్ అవార్డులని పొందారు. దేశంలోనే ఉత్తమ గాయకుడిగా ప్రఖ్యాతి గాంచిన ఆయన కేవలం సింగర్ గానే కాక సంగీత దర్శకుడిగా, రచయితగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా అనేక విభాగాల్లో తన ప్రతిభ చూపించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందారు.

- Advertisement -

ఇక భారతీయ సినీ, సాంస్కృతిక రంగాలకు ఎస్పీ బాలు చేసిన సేవలకు కృతజ్ఞతగా ఆయన్ని పద్మశ్రీ(2001), పద్మభూషణ్(2011), పద్మవిభూషణ్(2021) పురస్కారాలతో గౌరవించింది. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమాల్లో పాటలు పాడటమే కాకుండా, ప్రముఖ మ్యూజిక్ ప్రోగ్రాం “పాడుతా తీయగా” ద్వారా ఎంతో మంది గాయకులను సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. ఇప్పుడు తెలుగులో స్టార్ సింగర్లు గా వెలుగొందుతున్న మల్లికార్జున్ , హేమ చంద్ర, స్మిత, గీత మాధురి, రమ్య బెహ్రా, గోపిక పూర్ణిమ, శ్రావణ భార్గవి, కారుణ్య, మాళవిక, కౌసల్య ఈ ప్రోగ్రామ్ ద్వారానే పరిచయం అయ్యారు. 1996 లో మొదలైన పాడుతా తీయగా 2020 వరకు నడుస్తూనే ఉంది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటుడిగాను ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన ఆయన తణికెళ్లభరణి దర్శకత్వం లో చేసిన మిథునం చిత్రానికి ప్రాణం పెట్టి నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంకా ఎంతో చేయాలనీ తపించే ఆయనని విధి వక్రీకరించి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళిపోయింది. 2020ఆగస్ట్ లో కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఎజిఎం హాస్పిటల్ లో చేరగా, కరోనా ని జయించినా వయసు పైబడడంతో శ్వాస కోశ సమస్యతో 2020 సెప్టెంబర్ 25న కన్నుమూశారు. భౌతికంగా ఎస్పీ బాలు మన మధ్యలో లేకపోయినా ఆయన పాటల రూపంలో ఎల్లప్పుడూ మనకి కనిపిస్తూనే ఉంటారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు