Krishna Birth Anniversary : వెండితెరని ఏలిన ‘నటశేఖరుడి’ నట ప్రస్థానం..

Krishna Birth Anniversary : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూప‌ర్ స్టార్ కృష్ణ ప్రస్థానం ఎంతో ప్రత్యేకమైనది. తెలుగు సినిమాను ఉన్న‌త స్థానంలో నిల‌బెట్టిన న‌ట శిఖ‌రం ఆయన. వెండితెరని సమవుజ్జీలుగా ఏలుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో ఉప్పెనలా దూసుకొచ్చారు నటశేఖర “కృష్ణ”. కొన్ని వంద‌ల సినిమాల‌లో.. ప్రత్యేకమైన సరికొత్త, కథా, కథనాలతో కృష్ణ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. హాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన ఎన్నో కొత్త యాక్ష‌న్ తరహా సినిమాల‌ను టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేసిన ఘనత కూడా హీరో కృష్ణదే కావడం విశేషం . ఒక కౌబాయ్, జేమ్స్ బాండ్ క్యారెక్ట‌ర్ల‌లో కృష్ణ నటించిన తీరు, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వర్షం కురిపించింది. ఒక నటుడుగా మాత్రమే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయనాయకుడిగా కూడా తెలుగు ప్రజలని మెప్పించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సంపాదించారు. ఎన్నో చిత్రాలతో నటించి అలరించిన కృష్ణ డేరింగ్ డాషింగ్ హీరోగా, నటశేఖరుడిగా, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల ప్ర‌జ‌ల అభిమానాన్నీ సంపాదించుకున్నారు సూప‌ర్ స్టార్ కృష్ణ. ఈ రోజు (మే31) ఆ మహానటుడి జయంతి (Krishna Birth Anniversary) సందర్బంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ‘కృష్ణ’ నట రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం.

Super Star Krishna Birth Anniversary Special

సైడ్ హీరో నుండి సూపర్ స్టార్ గా కృష్ణ ప్రయాణం..

తెనాలిలో బుర్రిపాలెం గ్రామానికి చెందిన కృష్ణ (1942 మే 31) పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. కాలేజీ రోజుల్లోనే ఏఎన్నార్ ని చూసి ప్రేరణ పొందిన కృష్ణ అప్పట్లోనే సినిమాల్లో హీరోగా నటించాలని ఫిక్స్ అయి మద్రాసు వచ్చారు. అలా ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తొలిసారిగా కృష్ణకు సినిమాలలో అవకాశం కల్పించారు. ముందుగా పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ఠ వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో, కీలక పాత్రల్లో కనిపించిన కృష్ణ ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త వాళ్ల‌తో సినిమా తీయాలని భావించినప్పుడు, అయన దర్శకత్వంలో ‘తేనెమ‌న‌సులు’ ద్వారా కృష్ణ వెండితెరకు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఇక తొలి తెలుగు సాంఘిక రంగుల చిత్రంగా ‘తేనెమ‌న‌సులు’ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇక మూడో సినిమా ‘గూఢ‌చారి 116’ బ్లాక్ బాస్ట‌ర్ కాగా స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ. ఆ సినిమాతో తెలుగులో తొలి జేమ్స్ బాండ్ హీరోగా కృష్ణ నిలిచారు. ఆ త‌ర్వాత ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమాలో కౌబాయ్‌గా ‘కృష్ణ‌’ న‌టించారు. ఇక ‘అల్లూరి సీతారామరాజు‘ సినిమాలో కృష్ణ త‌న న‌ట విశ్వ రూపం చూపించారు. ఇక పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సినిమాల‌తో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు నమోదు చేశారు కృష్ణ.

- Advertisement -

రికార్డుల రారాజుగా కృష్ణ..

ఇక హీరోగా కృష్ణ ఎన్నో ఎత్తుపల్లాలను చూడగా, ఆ మధ్య ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తర్వాత, దాదాపు 12 సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్లాప్ అయ్యాయి. అయినా పట్టువదలకుండా, ఎక్క‌డ పోగుట్టుకున్నారో.. అక్క‌డే విజయం సాధించారు కృష్ణ‌. సొంత నిర్మాణంలో చేసిన ‘పాడిపంట‌లు’ మూవీతో మ‌ళ్లీ రికార్డులు నెల‌కొల్పారు. ఇక నటుడుగా ఎన్నో రికార్డులు సృష్టించిన కృష్ణ ఎన్టీఆర్, ఏన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో కలసి ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఇక ఆ రోజుల్లోనే కృష్ణ కి 2500 అభిమాన సంఘాలు ఉండేవని అంటారు. తెలుగు సినిమాకు కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేసింది కూడా కృష్ణ కావడం గమనార్హం . తెలుగులో తొలి 70MM, తొలి స్టీరియో స్కోప్ చిత్రాలని అందించారు కృష్ణ.

రాజకీయాల్లోనూ సూపర్ స్టార్…

ఇక రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ కృష్ణ తన సత్తా చాటారు. ఆ రోజుల్లోనే జై ఆంధ్రా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కృష్ణ, తొలుత ఎన్టీఆర్ కి సపోర్ట్ గా తెలుగు దేశం పార్టీకి మద్దతుగా ఈనాడు అనే సినిమా కూడా తీశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన కొన్ని పథకాలు నచ్చక 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి.. నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. దీనికి కృష్ణ మద్దతుగా నిలిచారు. నాదెండ్ల‌ భాస్కరరావును అభినందిస్తూ కృష్ణ పేరిట అప్పట్లో, ఓ ఫుల్‌పేజీ ప్రకటన విడుదలవ్వడం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. 1984 లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరగా, 1989లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీ గా విజయం సాధించారు. 1993 త‌ర్వాత కృష్ణ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు. సినీ రాజకీయాల్లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన కృష్ణ, ఇండస్ట్రీ లో డేరింగ్ డాషింగ్ హీరోగా చరిత్ర సృష్టించారు. సూపర్ స్టార్ అన్న పదానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ గా నట శేఖర కృష్ణ మాత్రమే నిలుస్తారని చెప్పొచ్చు. ప్రస్తుతం భౌతికంగా ఆయన లేకపోయినా, తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకాభిమానులని పలకరిస్తూనే ఉంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు