SV RangaRao Birth Anniversary : వెండితెర గౌరవం “విశ్వనటచక్రవర్తి”… “ఎస్వీ రంగారావు”…

SV RangaRao Birth Anniversary : “ఎస్వీ రంగారావు”… తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి పేజీలో ఉండే పేరు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఆయనది. తెలుగు చిత్రసీమని దేశమంతా చాటిచెప్పిన వారిలో అందరికంటే ముందుండే వ్యక్తి ఆయన. నవరస నటనా ధురీణుడిగా, నట గంభీర ఎస్వీ రంగారావు నటన గురించి చెప్తుంటేనే తెలుగువారి ఖ్యాతి గురించి ఎంతైనా వినాలన్న కోరిక కలుగుతుంది. “విశ్వనటచక్రవర్తి” గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ఆయన తెలుగు చిత్ర సీమకు గౌరవం తెచ్చిపెట్టినవారిలో ప్రథముడు. తెలుగు సినిమాకి రెండు కళ్ళు ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే కనిపించని ఆ మూడో నేత్రమే “ఎస్వీఆర్”. ఆయన ఏ పాత్ర చేసినా, ఎస్వీఆర్ వల్ల ఆ పాత్రకు గౌరవం లభిస్తుంది. ముఖ్యంగా పౌరాణిక ప్రతినాయక పాత్రలకు పెట్టింది పేరు. రావణ బ్రహ్మ అయినా, దుర్యోధనుడైనా, కీచకుడైనా, ఘటోత్కచుడైనా, కంసుడైనా, హిరణ్యకశిపుడైనా ఎస్వీఆర్ మాత్రమే గుర్తుకు వస్తారు. అంతటి ఘన కీర్తి పొందిన ఎస్వీఆర్ జయంతి (SV RangaRao Birth Anniversary) (జులై3) నేడు. ఈ సందర్బంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఎస్వీఆర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

SV RangaRao Birth Anniversary Special

 

- Advertisement -

రాజసానికి పెట్టిందిపేరు…

ఇక తెలుగు పౌరాణికాల్లో ఎస్వీ రంగారావు అంటే రాజసానికి పెట్టింది పేరుగా చెప్తారు. ఆయన పోషించిన పాత్రల్లో ఒక హుందాతనం ఉంటుంది. పౌరాణిక పాత్రలు వేయాలంటే ఎస్వీఆర్ తర్వాతే ఎవరైనా అంటారు. ఆయన డైలాగ్ చెప్తుంటే అందులో రాజసం ఉట్టిపడుతుంది. ఎస్వీఆర్ డైలాగ్ చెప్తుంటే ఎదురుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నటులు కూడా ఆయనతో పోటీపడలేకపోయేవారు. రంగారావు డైలాగ్ చెప్తుంటే డైరెక్ట్ గా ఆ పాత్ర మనతోనే మాట్లాడుతుందని అనిపిస్తుంది. అంత నేచురల్ గా ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్నది తక్కువ 50 ఏళ్ళే అయినా, తెలుగు సినిమా ఎన్నటికీ గుర్తుంచుకునేంత కీర్తిని సాధించారు. ఆయన వేసిన పాత్రలు అలాంటివి మరి. అలనాటి చిత్రాల్లో ఒక ఊరిపెద్ద అయినా, హుందాతనం ఉన్న జమీందారు అయినా, నేపాళ మాంత్రికుడైనా, సగటు తండ్రి పాత్ర అయినా, మునసబు అయినా రంగారావే కనిపించేవారు. అలాంటి పాత్రలు ఎంతమంది చేసినా, ఎస్వీఆర్ నటించిన ఆయన చిత్రాలు చూసిన ప్రేక్షకులు వేరే ఎవ్వర్నీ ఊహించుకోలేరు.

తెలుగు చిత్రసీమలో అన్ని రకాల పాత్రలు వేసిన రంగారావు పాత్ర చిన్నదైనా సరే దానికి తన నటనతో, ఆహార్యంతో సినిమాకే ఆ పాత్ర కీలకం అనేలా చేస్తారు. పౌరాణిక, చరిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాలలో ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు ప్రాణప్రతిష్ట చేయడం ఎస్వీఆర్ ప్రత్యేకత. అద్భుతమైన దేహదారుఢ్యం, దానికి తగ్గ గంభీరమైన స్వరం, ఆయన వాక్చాతుర్యానికి, ఎవరైనా నవరసాలను ప్రదర్శించే నైపుణ్యం ఆయన సొత్తు. ఎస్వీఆర్ నవ్వించడం లో ఎంత ఘటికుడో, ప్రేక్షకుల చే అంతే కన్నీరు పెట్టించగలడు. ఆయన తెలుగు గడ్డ పై పుట్టడం తెలుగు జాతి చేసుకున్న పుణ్యం. కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు ఒక కళాకారుడికి సత్కారాలు, పురస్కారాలు కాదు కావలసింది. ప్రేక్షకుల చప్పట్లు , అభినందనలే అని చాటి చెప్పారు.

చిత్రసీమ చేసుకున్న పుణ్యఫలం ఎస్వీఆర్ – చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన అభిమాన నటులు ఎస్వీ రంగారావు అని ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. ఓ సందర్భంలో చిరంజీవి ఎస్వీ రంగారావు కీర్తిని కొనియాడుతూ… ఎస్వీ రంగారావు గారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండడం తెలుగు చిత్ర సీమ చేసుకున్న అదృష్టం. కానీ ఆయన దురదృష్టం అంటూ.. నిజంగా ఆయన హాలీవుడ్ సినిమాల్లో చేసి ఉంటే దేశదేశాల్లో ఎస్వీ రంగారావు గురించి ఇప్పుడు ఆదర్శంగా చెప్పుకునేవారు అని చిరంజీవి చెప్పుకొచ్చారు. నిజంగా ఎస్వీఆర్ నటనని చూసిన ఏ తెలుగు ప్రేక్షకుడికైనా అలాగే అనిపిస్తుంది. పాతాళభైరవి, మిస్సమ్మ, మాయా బజార్, నర్తనశాల, భక్త ప్రహ్లాద, బొబ్బిలి యుద్ధం, సంపూర్ణ రామాయణం చిత్రాల్లో ఆయన నటనని ఎంత పొగిడినా తక్కువే. అంతటి కీర్తి ప్రఖ్యాతలు పొందిన “సామర్ల వెంకట రంగారావు” జయంతి (జులై3) నేడు. ఈ సందర్బంగా ఎస్వీఆర్ కి ఘన నివాళి అర్పిస్తోంది ఫిల్మీఫై టీం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు