Ambajipeta Marriage Band Movie Review Rating: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మూవీ రీవ్యూ, రేటింగ్

Critic’s Rating

2.75

About the movie

- Advertisement -

‘హనుమాన్’ తర్వాత అంత బజ్ క్రియేట్ చేసుకున్న సినిమాగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ నిలిచింది. సుహాస్, శివానీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘జిఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. బన్నీ వాస్, వెంకటేష్ మహా.. సమర్పకులు. ఇక ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి…

కథ:
మల్లిగాడు (సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్) ఇద్దరూ అక్కా తమ్ముళ్లు. పైగా వీళ్ళు కవలలు కావడంతో వీళ్ళ మధ్య బాండింగ్ మరింత ఎక్కువ. వీళ్ళ తండ్రి సెలూన్ షాప్ ఓనర్. పద్మ స్కూల్ టీచర్ గా చేస్తుంది. ఇక మల్లి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ట్రూప్ మెంబర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఖాళీ టైంలో తన సెలూన్ షాప్‌లో తండ్రికి సాయం చేస్తుంటాడు. ఇక అదే ఊరిలో వెంకన్న బాబు (నితిన్ ప్రసన్న) వడ్డీ వ్యాపారం, కొబ్బరికాయ, సిమెంట్ వ్యాపారాలు కూడా చేస్తుంటాడు. ఊర్లో వాళ్లకి ఎక్కువ వడ్డీ రేటుకి డబ్బులు అప్పుగా ఇచ్చి వారిని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు వెంకన్నబాబు. మరోపక్క పద్మకి తనే స్కూల్ టీచర్ ఉద్యోగం ఇప్పించి పర్మినెంట్ చేయించినట్టు, అలాగే ఆమెతో అక్రమ సంబంధం ఉన్నట్టు కూడా పుకారు పుట్టిస్తాడు. మరోపక్క వెంకన్న బాబు చెల్లెలు లక్ష్మీ(శివానీ) ని ప్రేమిస్తాడు మల్లి. ఆమె కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. విషయం తెలుసుకున్న వెంకన్న బాబు.. మల్లి పై కోపాన్ని పద్మ పై చూపిస్తాడు. ఆమెను స్కూల్ కి పిలిపించి బట్టలు ఊడదీసి అవమానిస్తాడు. దీంతో మల్లి – వెంకన్న బాబు..ల మధ్య శత్రుత్వం పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది మిగిలిన కథ

విశ్లేషణ :
దర్శకుడు దుశ్యంత్ తన జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు ప్రమోషన్స్ లో అంతా చెప్పుకొచ్చారు. అయితే ఇందులో కులాల ప్రస్తావన నేరుగా కాకపోయినా పరోక్షంగా టచ్ చేశాడు అని చెప్పాలి. హీరో కుటుంబం మంగలి కులానికి చెందినదిగా చూపించాడు. అయితే వెంకన్న బాబు ఏ కులానికి చెందిన వ్యక్తి అనేది ఇందులో చూపించలేదు. అయితే గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కాపు, కమ్మ, క్షత్రియ కులాలు ఉంటాయి. వీళ్ళలో విలన్ రోల్ ఏ కులానికి చెందినదిగా చూపించాడు అనేది జనాల ఊహలకే వదిలేశాడు. సో ఓసి కేటగిరికి చెందిన కొంతమంది జనాలని ఈ సినిమా ఇబ్బంది పెట్టే విధంగా ఉండొచ్చు.

ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉంటుంది. హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ కులాల ప్రస్తావన.. ఇదే మెయిన్ పాయింటేమో అనిపిస్తుంది. దీంతో ‘కలర్ ఫోటో’ ‘ఉప్పెన’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సినిమాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ సీన్ నుండి కథ కొత్త టర్న్ తీసుకుంటుంది. సెకండాఫ్ ఎక్కువగా అక్క పాత్ర పైనే నడిపించి ఎమోషనల్ ఫీల్ కలిగించాడు దర్శకుడు. అది అందరికీ కొత్తగా అనిపిస్తుంది. అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. మాస్ సెంటర్స్ లో ఈ సినిమా బాగా వర్కౌట్ అవ్వొచ్చు. నిర్మాణ విలువలు, టెక్నికల్ టీం అంతా బాగా పనిచేశారు.

నటీనటుల విషయానికి వస్తే.. హీరో హీరోయిన్లు అయిన సుహాస్, శివానీ బాగా నటించారు. కానీ వాళ్ళకంటే శరణ్య ప్రదీప్ ఎక్కువ మార్కులు కొట్టేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటి నుండో సినిమాల్లో నటిస్తున్నప్పటికీ శరణ్యలో ఇంత గొప్ప నటి ఉంది అనే విషయం బయటపడలేదు. ఈ సినిమా ఆమెకు టర్నింగ్ పాయింట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. విలన్ గా చేసిన నితిన్ ప్రసన్న కూడా చాలా బాగా నటించాడు. అతన్ని జనాలు విపరీతంగా తిట్టుకుంటున్నారు అంటే అతను ఎంత బాగా చేశాడో అర్ధం చేసుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్
శరణ్య ప్రదీప్
సుహాస్
మ్యూజిక్

మైనస్ పాయింట్ :

రొటీన్ గా అనిపించే ఫస్ట్ హాఫ్

మొత్తంగా…‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా. ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు