Gangs Of Godavari Movie Review in Telugu : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ

Gangs Of Godavari Movie Review : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ లో కృష్ణ చైతన్య ఒకరు. సాహిత్య రచయితగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ చైతన్య చాలా అద్భుతమైన పాటలను అందించారు. మంచి పేరును సంపాదించుకున్నాడు. రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా మారాడు కృష్ణ చైతన్య. దర్శకుడిగా ఆ సినిమా చాలామందిని ఆశ్చర్యపరిచింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి ఒక మంచి దర్శకుడు దొరికాడు అనే అభిప్రాయాన్ని కూడా కలిగించింది. ముఖ్యంగా ఆ సినిమాలోని పాత్రలు, ఆ పాత్రలు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాయి. ఆ తర్వాత ఛల్ మోహన్ రంగా అనే సినిమాను చేశాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు మళ్లీ కృష్ణ చైతన్య నుంచి లేటెస్ట్ గా వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకుంది ఇప్పుడు చూద్దాం.

కథ:

రాజమండ్రి కొవ్వూరు మధ్యలో ఉన్న లంక అనే ఒక గ్రామంలో రత్న (విశ్వక్ సేన్) అనే ఒక వ్యక్తి ఉంటాడు. చిన్నతనం నుంచి అల్లరి చిల్లరగా తిరిగే రత్న చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. ఎప్పటికైనా గొప్పోడు అవ్వాలని ఒక ఆశయంతో ఉంటాడు. అయితే ఆ లంకలో చాలామందికి రత్న నచ్చడు. అటువంటి రత్న తన జీవితంలో ఎలా ఎదిగాడు.? పాలిటిక్స్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు.? తనకంటూ ఒక గ్యాంగ్ ని ఎలా సిద్ధం చేసుకున్నాడు.? ఆ గ్యాంగ్ రత్న కోసం ఎంతవరకు నిలబడింది.? అదే గ్యాంగ్… రత్న పై ఎటువంటి పన్నాగాలు పన్నింది.? రత్న కుటుంబం ఏంటి.? చివరికి రత్న ఏమయ్యాడు ఇలాంటి అంశాలు అన్ని సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ:

కృష్ణ చైతన్య దర్శకుడిగా ఒక సినిమా వస్తుంది అనంటే చాలా అంచనాలతో ఎదురుచూసే ప్రేక్షకులు కొంతమంది ఉన్నారు. దీనికి కారణం కృష్ణ చైతన్య యొక్క రచన స్థాయి అని చెప్పొచ్చు. ఒక హీరోకి డైలాగ్స్ తో ఎలివేషన్ ఇవ్వడమే కాకుండా, సాధారణమైన పాత్రలతో కూడా ఆలోచించగలిగే డైలాగులను రాయగల సామర్థ్యం ఉన్న రచయిత. “ఆకలి అందరికీ ఇచ్చిన దేవుడు, అన్నం మాత్రం ఎందుకు ఇవ్వడు” “బ్రతకడం నేర్పిన దేవుడు, ధైర్యం మాత్రం ఎందుకు ఇవ్వడు” ” ఆశకి ఆకలికి మధ్య అవసరం అనేది ఒకటి ఉంటుంది” ఈ డైలాగ్స్ అన్నీ కూడా కృష్ణ చైతన్య తను దర్శకత్వం వహించిన రౌడీ ఫెలో అనే సినిమాలో రాశాడు.

- Advertisement -

” జీవితమే ఒక చిన్న మజిలీ, వెళ్ళిపోమా లోకాన్ని వదిలి, మళ్లీ మళ్లీ చూడగలమా ఈ కళల్ని ఈ కథల్ని” అంటూ పాటలో కూడా ఫిలాసఫీ చెప్పగలిగే సామర్థ్యం ఉన్న రచయిత. ఇటువంటి రాతలను ఇష్టపడే ఎంతోమంది అభిమానులు కృష్ణ చైతన్యకు ఉన్నారు. ఛల్ మోహన్ రంగ సినిమా తర్వాత కృష్ణ చైతన్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాను చేస్తున్నాడు అంటే చాలామంది అంచనాలు పెంచుకున్నారు. అయితే ఆ అంచనాలను సగం మాత్రమే నిలబెట్టుకున్నాడు కృష్ణ చైతన్య. ఎందుకంటే సినిమా సగం మాత్రమే బాగుంటుంది. సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా కృష్ణ చైతన్య మార్క్ డైలాగ్స్ తో మంచి క్యారెక్టర్రైజేషన్ తో కూడుకుని ఉంటుంది.

మంచి యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని మించి ఇంటర్వెల్లో పడే కార్డు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది కథ కృష్ణ చైతన్య మార్క్ అనే ఫీల్ కూడా వస్తుంది. కానీ ఇది ఒక హఠాత్పరిణామం అనే డైలాగులా, ఇంటర్వెల్ తర్వాత సినిమా నీరసంగా సాగుతుంది. డీజే టిల్లు సినిమాలో రాధికను టిల్లు అడిగినట్లు.. “సెకండ్ ఆఫ్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేదా మీరు, అంత హై ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ తర్వాత సెకండ్ ఆఫ్ వస్తుంది అంటే ఎలా ఉండాలి శివాలెత్తిపోవాలా ” అని కృష్ణ చైతన్యను చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీన్ తర్వాత ఒక సీన్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. దీనివలన చాలామంది ఆడియన్స్ అయోమయంలోకి వెళ్లిపోయారు.

ఇక హీరో విశ్వక్సేన్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ నాగ వంశీ చెప్పినట్లు, నిజంగానే నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా విలనిజంతో కూడుకున్న ఒక హీరో కథ, అచ్చం టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ మాదిరిగా ఉంటుంది. తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు విశ్వక్సేన్. ఇంక బుజ్జి పాత్రలో కనిపించిన నేహా శెట్టి విషయానికి వస్తే, రాధిక పాత్రను మర్చిపోయాంతగా ఏమీ లేదు. ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. అంజలి క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ ను అద్భుతంగా డీల్ చేశారు. యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్. దొర పాత్రలో కనిపించిన గోపరాజు రమణ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశాడు దర్శకుడు. నాజర్ క్యారెక్టర్ పరవాలేదు అనిపించింది. ఉన్నంతలో మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు. ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ అఫ్ ఇచ్చినంత కిక్ సెకండ్ హాఫ్ ఇవ్వదు. ఎప్పుడు గోదారంటే కొబ్బరి చెట్లు, అందమైన పొలాలు, అద్భుతమైన అనుబంధాలు మాత్రమే కాకుండా, అక్కడ కొంతమంది మనుషులు వ్యక్తిత్వాలు, రాజకీయ పరిణామాలను బాగానే చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్

విశ్వక్సేన్ నటన
డైలాగ్స్
ఫస్టాఫ్
యువన్ శంకర్ రాజా మ్యూజిక్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్
క్లారిటీ లేని సీన్
సరైన విలన్ లేకపోవడం

మొత్తంగా: గోదావరి అనుకుని వెళ్తే పిల్ల కాలువను చూసినట్లుంది

రేటింగ్ : 2.25

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు