Manjummel Boys Movie Telugu Review: “మంజుమ్మెల్ బాయ్స్” మూవీ రివ్యూ

మలయాళ సినీ ప్రియులను మాయ చేసిన లేటెస్ట్ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఫిబ్రవరి 22న మలయాళ భాషలో థియేటర్లలోకి వచ్చిన ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ మూవీకి చిదంబరం దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, చంతు సలీంకుమార్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, ఖలీద్ రెహమాన్, అరుణ్ కురియన్, విష్ణు రఘు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 2006లో తమిళనాడులోని కొడైకెనాల్‌లోని గుణ గుహల వద్ద జరిగిన విషాదం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కొచ్చికి చెందిన మంజుమ్మెల్‌ అనే గ్యాంగ్ కు చెందిన 11 మంది యువకుల రియల్ స్టోరీ. మరి ఈ మూవీ ఎలా ఉంది అనే విషయంలోకి వెళ్తే…

కథ:
మంజుమ్మెల్ అనే స్నేహితుల బృందం తమ ప్రత్యర్థి టీం మున్నార్‌కు విహారయాత్రకు వెళ్లడాన్ని చూసి అసూయతో కొడైకెనాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. నిజానికి గోవా వెళ్ళాలి అనుకుంటారు. కానీ బడ్జెట్ సమస్యలతో చివరకు కొడైకెనాల్‌ కు బయల్దేరుతారు. “మంజుమ్మెల్ ఫ్రెండ్స్ క్లబ్” పేరుతో వీరంతా ట్రిప్ లో చాలా సరదాగా గడుపుతారు. అదే క్రమంలో కమల్ హాసన్ “గుణ” మూవీలోని పాపులర్ సాంగ్ “కణ్మణి అన్బోడు కధలన్” (“ప్రియతమా నీవచట కుశలమా” తెలుగు వెర్షన్)ను షూట్ చేసిన “గుణ” గుహలను చూడాలని అనుకుంటారు. అది ప్రమాదకరం అని తెలిసినా అక్కడికి వెళ్తారు. అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరు ఆ గుహల్లో ఉన్న గోతిలో పడిపోతారు. అతన్ని కాపాడాడనికి ప్రయత్నించిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కూడా చివరికి చేతులెత్తేస్తారు. మరి చివరకు గోతిలో పడిన స్నేహితుడు ప్రాణాలతో బయట పడ్డాడా? అతన్ని ఫ్రెండ్స్ అంతా కలిసి ఎలా కాపాడారు ? ఆ సమయంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది తెరపై చూడాల్సిన కథ.

విశ్లేషణ:
మంజుమ్మెల్ బాయ్స్ కథ… చిన్నప్పటి నుండి స్నేహితులుగా ఉన్న దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన 11 మంది యువకుల చుట్టూ తిరుగుతుంది. ఫస్టాప్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. కానీ అవే అల్లరి చిల్లరగా తిరుగుతూ, గొడవలు పడుతూ తమ జీవితాలను సరదాగా గడిపేస్తున్న 11 మంది అబ్బాయిల గురించి ప్రేక్షకులు ఒక అభిప్రాయానికి వచ్చేలా చేస్తాయి. రెండు ఫ్రెండ్స్ టీంల మధ్య మొదలైన థగ్-ఆఫ్-వార్‌ చివరికి జీవితానికి, మరణానికి మధ్య థగ్ ఆఫ్ వార్‌గా మారుతుంది. అదేవిధంగా ట్రిప్ డ్రైవర్‌తో దేవుని గురించి జరిగే సంభాషణ ఆలోచింపజేస్తుంది. ఆ తరువాత వచ్చే సన్నివేశాలు సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.

- Advertisement -

స్నేహితుడిని బ్రతికించుకోవడం కోసం ‘మంజుమ్మెల్ బాయ్స్’ మధ్య జరిగే భావోద్వేగ పోరాటం ఆడియన్స్ ను కంటతడి పెట్టిస్తాయి. తమ స్నేహితుల్లో ఒకరు ఆ గొయ్యిలో పడిపోయేదాకా వాళ్లకు అసలు నిజం తెలియదు. తమకు తెలిసిన గుణ గుహలను మొదట డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారని ఆ బృందానికి అప్పుడు తెలుస్తుంది. అధికారులు, స్థానికులు ఆ గొయ్యిలో పడిన వారు ప్రాణాలతో బయటపడ్డ దాఖలాలు లేవు అని చెప్పినప్పటికీ తమ స్నేహితుడిని గుహలో వదిలి బయటకు వెళ్లడానికి ఆ ఫ్రెండ్స్ నిరాకరించడం వంటి సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి.

‘మంజుమ్మాళ్ బాయ్స్’ టీం చిలిపి చేష్టలు, వారి బంధం, థగ్ ఆఫ్ వార్ పోటీ, దానికి సంబంధించిన శిక్షణ, టూర్‌కి రిక్రూట్‌మెంట్, కొడైకెనాల్ చుట్టూ తిరగడం, అక్కడక్కడ కామెడీతో సినిమాను స్టార్ట్ చేసిన డైరెక్టర్ ఆ తరువాత నేరుగా కథలోకి తీసుకెళ్తాడు స్నేహితుడికి ఆపద వచ్చినప్పుడు స్క్రీన్‌ప్లే మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. యాక్సిడెంట్‌ సీన్‌ని పెద్దగా డ్రామా లేకుండగా సహజంగా చిత్రీకరించి తన స్క్రీన్‌ప్లే తో మ్యాజిక్ క్రియేట్ చేశారు దర్శకుడు. సినిమా కథ, కథనం ఏమి కొత్తవి కావు. కానీ ఇప్పటికే చూసిన సన్నివేశాలని బోర్ కొట్టకుండా డైరెక్టర్ నడిపించిన స్క్రీన్ ప్లే తీరు మాత్రం కొత్తగా ఉంది.

స్నేహం, దృఢ సంకల్పం, విశ్వాసం వంటి అంశాలతో హృదయాన్ని కదిలించే కథాంశంతో ఈ మూవీని రూపొందిన దర్శకుడి ప్రయత్నం అభినందనీయం. ఇక సెకాండాఫ్ లో కమల్ హాసన్ పట్ల తనకున్న ప్రత్యేక ఆసక్తి గురించి దర్శకుడు చిదంబరం “కన్మణి అన్బోడు కాధలన్‌”తో బయటపెట్టాడు. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో చూసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి బదులుగా సెకండాఫ్‌లోని ఒక హై మూమెంట్స్‌లో అదే పాటను ఉపయోగించడం ప్రత్యేకంగా అన్పిస్తుంది. క్లైమాక్స్ లో చివరి 20 నిమిషాలు పెట్టే టెన్షన్, ఎమోషన్ మంచి థ్రిల్లింగ్ ఫీల్ ను ఇస్తాయి.

అయితే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ అయితే కాదు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారుల సన్నివేశాలను సాగదీయడం చికాకు కలిగిస్తుంది. ఒక టూర్ కు వెళ్ళినప్పుడు ఆ స్నేహితుల బృందంలో ఒక్కరికి కూడా సరైన అవగాహనా లేకపోవం అనేది విచిత్రంగా అనిపిస్తుంది. అలాగే సినిమాలో ఒక్క అమ్మాయి కన్పించదు. ఆ లోటు తెలియకుండా డైరెక్టర్ కొంత వరకు మ్యానేజ్ చేశాడు. ఏదేమైనా డైరెక్టర్ తెలిసిన కథనే తన స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా నడిపించి, పేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.

నటీనటుల పరంగా.. సుభాష్‌గా శ్రీనాథ్ భాసి అద్భుతమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో తన బాధను ప్రేక్షకులు ఫీల్ అయ్యేంతలా తన పాత్రలో జీవించాడు. శౌబిన్ షాహిర్, జార్జ్ మరియన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. శ్రీనాథ్, శౌబిన్ అనే బాల నటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

టెక్నీకల్ గా… సినిమాకు షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్. ఈ చిత్రం విజువల్స్‌ పరంగా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ బాగుంది. ఎమోషనల్‌, టెన్షన్‌ సన్నివేశాల్లో నేపథ్య సంగీతంతో సుశీన్‌ శ్యామ్‌ ఆకట్టుకున్నాడు. అజయన్ సల్లిసేరి ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. సినిమాలో కన్పించిన గుణ గుహలు సెట్ అన్న అనుమానం ఎవ్వరికీ రాకుండా మ్యానేజ్ చేయగలిగారు. మేకప్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్
టెక్నీకల్ టీం
స్రీన్ ప్లే
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్
కొన్ని సన్నివేశాల సాగదీత

రేటింగ్ : 2.5

చివరగా… సర్వైకల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి పర్ఫెక్ట్ మూవీ ఇది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు