Mr Bachchan Movie Review : మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ

Mr Bachchan Movie Review : రవితేజ – హరీష్ శంకర్..లది హిట్టు కాంబినేషన్. వీరి కాంబోలో సినిమా అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ‘మిస్టర్ బచ్చన్’ పై కూడా అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం అదే. ఈ సినిమాని హీరో కంటే కూడా ఎక్కువగా దర్శకుడు హరీష్ శంకరే ప్రమోట్ చేశాడు. మరి అతని కష్టానికి తగిన ఫలితం దక్కిందో లేదో తెలుసుకుందాం రండి :

కథ :

ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అయినటువంటి మిస్టర్ బచ్చన్(రవితేజ) చాలా నిజాయితీ పరుడు.పని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ముందుగా ఓ పెళ్లి చూపుల సీన్ తో ఓ అవినీతి పరుడిని వెలుగులోకి తెస్తాడు. ఆ టైంలో పైఅధికారుల ఒత్తిడి వల్ల.. సహనం కోల్పోయి వారిపై నోరుపారేసుకుంటాడు. దీంతో అతను సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత అతని సొంతూరుకి వెళ్ళిపోతాడు బచ్చన్. అక్కడ జెక్కీ(భాగ్య శ్రీ) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. పెళ్ళికి సరిగ్గా కొద్ది రోజుల ముందు బచ్చన్ మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుతాడు. ఆ టైంలో అతనికి ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో రైడ్ చేయాల్సి వస్తుంది. బచ్చన్ కి ముందు అతని ఇల్లు, వ్యాపారాలపై రైడ్ చేసిన అధికారులని అతి కిరాతకంగా చంపేస్తాడు జగ్గయ్య. అలాంటి వ్యక్తిని ఎదురించి బచ్చన్ ఎలా రైడ్ కొనసాగించాడు. ఈ క్రమంలో బచ్చన్ కి జగ్గయ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు అనేది మిగిలిన కథ.?

విశ్లేషణ :

అందరికీ ఇది బాలీవుడ్ సినిమా ‘రైడ్’ కి రీమేక్ అనే సంగతి తెలిసే ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల కోసం చాలా మార్పులు చేసినట్టు మేకర్స్ మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చారు. అది నిజమే..! అలాగని ఈ ‘మిస్టర్ బచ్చన్’ కొత్త కథలా ఏమాత్రం అనిపించదు. సింపుల్ గా చెప్పాలంటే ‘రైడ్’ కి ‘మిరపకాయ్’ టెంప్లేట్ తగిలిస్తే ‘మిస్టర్ బచ్చన్’. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ పాయింట్ ని ఎక్కువగా టచ్ చేయలేదు. కానీ ఒరిజినల్ లో మొదటి 15 నిమిషాలకే అందరూ కథలో ఇన్వాల్వ్ అవుతారు. తెలుగులో మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా అనవసరమైన కామెడీతో నింపే ప్రయత్నం చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ‘మిరపకాయ్’ లో హీరోయిన్ బ్రాహ్మిన్. ఇందులో మార్వాడీ. అందులో సునీల్ చేసిన పాత్ర ఇక్కడ సత్య చేశాడు. ఇద్దరి ఇంటెన్షన్స్ ఒక్కటే. అలాగే చంద్రమోహన్ ప్లేస్ లో సచిన్ కేడెకార్ ఉన్నాడు. ‘మిరపకాయ్’ లో హీరో పోలీస్.. కానీ సస్పండ్ అయ్యి లెక్చరర్ అవుతాడు. ‘మిస్టర్ బచ్చన్’ లో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్.. కానీ సస్పండ్ అయ్యి ఫ్రెండ్స్ తో కలిసి రికార్డింగ్ డాన్స్ లు ఆడుతూ ఉంటాడు. ఇంటర్వెల్ కి అందులో హీరో ప్రకాష్ రాజ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ జగపతి బాబు లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. అయితే ‘మిరపకాయ్’ లో పండిన కామెడీ ‘మిస్టర్ బచ్చన్’ లో చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. సినిమాకి అతి కీలకమైన సెకండ్ హాఫ్ చాలా పేలవంగా ఉంటుంది. క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు కూడా ఇందులో ఎక్కువగా లేవు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ మంచినీళ్లులా ఖర్చు పెట్టేశాడు. సాంగ్స్ వినడానికే కాదు చూడటానికి కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. మిక్కీ తన బెస్ట్ ఇచ్చాడు. తన వర్క్ కి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఫైట్స్ విషయానికి వస్తే.. ఫస్ట్ ఫైట్ మినహా మిగిలినవి పెద్దగా ఆకట్టుకోవు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..

రవితేజ కొత్తగా ఏం చేసినా వర్కౌట్ అవ్వడం లేదు అనే సింపతీ ఉంది. ఈ సినిమా చూశాక.. ‘రవితేజ ఇంతకు మించి ఏమీ చేయలేడేమో’ అనే ఆలోచన వస్తుంది. అది అతని లోపమో లేక డైరెక్టర్ అతన్ని ప్రెజెంట్ చేసిన విధానం వల్లనో వాళ్ళకే తెలియాలి. భాగ్య శ్రీ బోర్సే… గ్లామర్ కి, రొమాంటిక్ సీన్స్ కే పరిమితమైంది. అంతకు మించి కథని ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే ఆమె పాత్ర లేదు. జగపతి బాబు నటనలో కొత్తదనం ఏమీ ఉండదు. కాకపోతే పాత పాటలు పాడుతూ కొంచెం ఎనర్జీ చూపించే ప్రయత్నం చేశాడు. సచిన్ కేడెకర్ , తనికెళ్ళ భరణి.. ల పాత్రలు వారి సీనియారిటీని ప్రశ్నించే విధంగా ఉంటాయి.సీనియర్ నటి గౌతమి చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడం లేదు. పాపం ఎందుకో తెలీదు. ‘మిస్టర్ బచ్చన్’ విషయంలో కూడా ఫలితం మారకపోవచ్చు. సత్య, అల్లూరి పవన్ కుమార్..ల కామెడీ కొన్ని చోట్ల మెప్పిస్తుంది. జగపతి బాబు భార్యగా చేసిన మణిచందన 2,3 సీన్లకి పరిమితమైంది.

ప్లస్ పాయింట్స్ :

హీరోయిన్ గ్లామర్

సాంగ్స్

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్

ఫోర్స్డ్ కామెడీ

సెకండ్ హాఫ్

మొత్తంగా..

‘మిస్టర్ బచ్చన్’ బోరింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందిన ‘రైడ్’ రీమేక్. సెలవుల వరకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ రాబడుతుందేమో కానీ, థియేటర్లలో ఎంటర్టైన్ చేసే సినిమా అయితే కాదు..!

రేటింగ్ : 2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు