Operation Raavan Movie Review: ఆపరేషన్ రావణ్ మూవీ రివ్యూ

Operation Raavan Movie Review: ‘పలాస 1978’ ‘లండన్ బాబులు’ సినిమాలతో డీసెంట్ సక్సెస్..లు అందుకుని ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. ఆ తర్వాత ‘నరకాసుర’ అనే సినిమా కూడా చేశాడు. అది అంతగా మెప్పించలేదు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని భావించి తన తండ్రి వెంకట్ సత్య డైరెక్షన్ లో ‘ఆపరేషన్ రావణ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేశాడు. ‘నరకాసుర’లో ఓ హీరోయిన్ గా నటించిన విపిన్ సంగీర్తన ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

ఆమని(సంగీర్తన) tv45 అనే న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన మినిస్టర్(రఘు కుంచె) చేసే అన్యాయాల గురించి కొన్ని కీలక విషయాలు సేకరించి లైవ్ షో చేయాలనుకుంటుంది. అయితే తమ ఛానల్ నడిచేది గవర్నమెంట్ యాడ్స్ వల్లే అని తెలిసి.. ఆమెని వేరే సెక్షన్ కి మారుస్తాడు ఆ ఛానల్ సీఈవో(జర్నలిస్ట్ మూర్తి). మళ్ళీ ఆ మినిస్టర్ ని ఎక్కడ టార్గెట్ చేస్తుందో అని భావించి… ఆమె వద్ద రామ్(రక్షిత్ అట్లూరి) ని అసిస్టెంట్ గా పెడతాడు ఆ సీఈవో. ఈ క్రమంలో వరుసగా పెళ్ళైన అమ్మాయిలను హత్యలు చేస్తూ ఉంటాడు ఓ సీరియల్ కిల్లర్. ఆ కేసుని ఆమని టేకప్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె పోలీసుల దర్యాప్తుని తప్పుపడుతూ బుల్లెటిన్ చేస్తుంది. దీంతో పోలీసులు ఆమెకు వార్నింగ్ ఇవ్వడానికి.. ఆమె ఛానల్ వరకు వచ్చేస్తారు. ఈ విషయమై సీఈవోతో పాటు ఆమె పై-అధికారులు ఆమెపై విమర్శలు చేస్తుంటే.. రామ్ వచ్చి వాళ్ళకి బుద్ధిచెబుతాడు. అతను మరెవరో కాదు ఆ ఛానల్ కి ఓనర్ కొడుకు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆమని ..రామ్ లు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. ఇదే టైంలో ఆమనిని కూడా ఆ సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు? ఆ తర్వాత ఏమైంది? ఆమని అతని భారి నుండి బయటపడిందా? లేదా? ఈ క్రమంలో రామ్ ప్లే చేసిన మైండ్ గేమ్స్ ఏంటి అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

లవ్ స్టోరీలు, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూస్తున్నప్పుడు కొన్ని లాజిక్స్ మిస్ అయినా ప్రేక్షకులు పట్టించుకోరు. కానీ థ్రిల్లర్స్, ముఖ్యంగా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కోడి గుడ్డు మీద ఈకలు వెతుకినట్టు వెతుకుతూ చూస్తారు. ప్రతి సన్నివేశానికి లాజిక్ అవసరం. కథ ముందుకు వెళ్లే కొద్దీ సస్పెన్స్, థ్రిల్స్ వంటివి అవసరం. అన్నిటికీ మించి స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉండాలి. ‘ఆపరేషన్ రావణ్’ సినిమాలో ఇవన్నీ పూర్తిగా లోపించాయి. ఫస్టాఫ్ లో కథ ఎక్కడో మొదలుపెట్టి.. దాన్ని మధ్యలోనే వదిలిపెట్టి సీరియల్ కిల్లర్ వైపు తీసుకెళ్తాడు దర్శకుడు. పోనీ అక్కడైనా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అలరించిందా అంటే.. మచ్చుకైనా అలాంటిది ఉండదు. సైకో కిల్లర్స్ కి ఒక మోటో ఉంటుంది అన్నట్టు ప్రతి సినిమాలో చూపించారు. ఈ సినిమాలో మొదటి హత్య విషయంలో తప్ప.. మిగిలిన మర్డర్స్ విషయంలో సైకో కిల్లర్ కి ఎలాంటి గోల్ ఉండదు. అసలు క్లైమాక్స్ లో మిగిలిన హత్యల గురించి ప్రస్తావనే ఉండదు. డైరెక్షన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ.. వంటివి ఏమాత్రం ఆకట్టుకునే విధంగా ఉండవు. నిర్మాణ విలువలు కూడా నాసిరకంగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో హీరో కంటైనెర్ పైకి దూకే సన్నివేశం అయితే.. నెక్స్ట్ లెవెల్ ట్రోల్ స్టఫ్ గా ఉంది. రాబోయే రోజుల్లో దాని పై బోలెడన్ని మీమ్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. రక్షిత్ అట్లూరిలో టాలెంట్ ఉంది. అతని స్టోరీ సెలక్షన్ విషయంలో ఇది క్లియర్ గా తెలుస్తుంది. కానీ నటన పై, బాడీ లాంగ్వేజ్ పై అతను పూర్తిగా దృష్టిపెట్టాలి. ఫిజిక్ విషయంలో కూడా..! హీరోయిన్ విపిన్ సంగీర్తన లుక్స్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. రాధికా పాత్రకి చాలా వెయిటేజ్ ఉంది. కొన్ని సీన్స్ లో ఆమె సీనియారిటీ కనిపించింది. ఆమె మాత్రమే నటనతో మెప్పించింది. ఎస్.ఎస్.కాంచి, జర్నలిస్ట్ మూర్తి, చరణ్ రాజ్ వంటి వాళ్ళు ఏదో సినిమాలో ఉన్నారు అంటే ఉన్నారు అనుకోవాలి. రఘుకుంచెని విలన్ రేంజ్లో చూపించి తర్వాత సైడ్ చేసేశారు.

ప్లస్ పాయింట్స్ :

రన్ టైం 2 గంటల 27 నిమిషాలే ఉండటం

మైనస్ పాయింట్స్ :

మిగిలినవన్నీ

చివరిగా.. ‘ఆపరేషన్ రావణ్’ ఏ దశలోనూ ఆకట్టుకోని సైకో థ్రిల్లర్ మూవీ. సింపుల్ గా ఈ వీకెండ్ కి స్కిప్ కొట్టడమే కాకుండా ఓటీటీలో చూసే సాహసం చేయకుండా ఉండటం బెటర్.

రేటింగ్ : 0.5/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు