Peka Medalu Movie Review : పేక మేడలు మూవీ రివ్యూ

Peka Medalu Movie Review : ‘బాహుబలి 2’ లో ప్రభాస్ తో తలనరికించుకునే సేతుపతి పాత్రతో ఫేమస్ అయిన రాకేష్ వర్రే హీరోగా, నిర్మాతగా మారి ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే సినిమా చేశాడు. దానికి క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అది బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఇక ఇప్పుడు ‘పేక మేడలు’ అనే సినిమాని నిర్మించాడు. ‘గీతా ఆర్ట్స్’ లో ఓ నిర్మాతగా ఉంటున్న ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం, ప్రీమియర్స్ షోల టికెట్ ధర రూ.50 మాత్రమే పెట్టడంతో.. కొంతమంది ప్రేక్షకులు ఈ చిత్రం చూడాలనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి సినిమా ఆ రూ.50 కి న్యాయం చేసే విధంగా ఉందా? లేక అది కూడా వేస్ట్ అనిపించిందా? అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి :

కథ :

లక్ష్మణ్(వినోద్ కిషన్) తన భార్య వరలక్ష్మీ(అనూష కృష్ణ), కొడుకు..లతో కలిసి ఓ బస్తీలో నివసిస్తూ ఉంటాడు.బిటెక్ చదుకున్న లక్ష్మణ్..కు అత్యాశ ఎక్కువ. చదువుకి తగ్గ జాబ్ చేయడం మానేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారి తక్కువ టైంలో వెంచర్లు అమ్మేసి కోటీశ్వరుడు అయిపోవాలి అనుకుంటాడు. భార్య, పిల్లల పట్ల అస్సలు భాద్యతగా వ్యవహరించడు. పైగా అతని భార్య పిండివంటలు వంటివి చేసి ఇంటి ఖర్చుల కోసం సంపాదించిన డబ్బుని కూడా తన విలాసాల కోసం వాడేసి భార్యని వేధిస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో ఓ ఎన్నారై (రితిక శ్రీనివాస్) అతని కంట పడుతుంది. ఆమెకి భర్త ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉంటారు.భర్తతో గొడవ కారణంగా ఆమె విదేశాల నుండి ఇండియాకి వచ్చేసి సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. ఆమెకి మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటాడు లక్ష్మణ్. ఆమె కూడా ఇతని మాయలో పడిపోయి శారీరకంగా సంబంధం పెట్టుకుంటుంది. దీంతో తన భార్య, పిల్లాడిని వదిలించుకోవాలి అనుకుంటాడు లక్ష్మణ్. ఈ విషయం అతనికి భార్యకి, పెద్దలకి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? లక్ష్మణ్ మారి మంచి మనిషి అయ్యాడా? లేక కుక్కతోక వంకరే అన్నట్టు.. అడ్డదారుల్లోనే గాల్లో మేడలు కడుతూ జీవించాడా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

కథ పరంగా చూసుకుంటే షార్ట్ ఫిలింకి సరిపోయే సినిమా ‘పేకమేడలు’. కానీ దీనిని 2 గంటల వరకు ఎంటర్టైనింగ్ గా, అదే సమయంలో ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు నీలగిరి మామిళ్ల. ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా వెళ్ళిపోతుంది. సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. నిజజీవితానికి చాలా దగ్గరగా ఉండేలా వాటిని రాసుకున్నాడు దర్శకుడు. అయితే తెలిసిన మొహాలు ఎక్కువగా లేకపోవడం వల్ల .. వాటికి ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనేది పెద్ద ప్రశ్న. అయితే క్లైమాక్స్ మాత్రం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంది. మలయాళంలో మాత్రమే ఇలాంటి సినిమాలు వస్తాయి అనే నమ్మకం జనాల్లో ఉంది.

- Advertisement -

‘పేక మేడలు’ తో ఆ అభిప్రాయం మారే ఛాన్స్ లేకపోలేదు. నిర్మాత రాకేష్ వర్రే కథకి తగ్గట్టు ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాడు. ఇలాంటి స్క్రిప్ట్ చేయడానికి అతను ముందుకు రావడం అనేది అభినందించదగ్గ విషయమే. ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ లానే ఇది కూడా అతను చేసిన ఓ మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. స్మరన్ సాయి మ్యూజిక్ బాగుంది. ఆడవాళ్ళ లైఫ్ స్టైల్ ని వివరిస్తూ కంపోజ్ చేసిన సాంగ్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఎడిటింగ్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది.

నటీనటుల విషయానికి వస్తే.. వినోద్ కిషన్ పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అలా అని అతనిది హీరో పాత్ర అనలేం. అలాగే అతని పాత్ర లేకపోతే సినిమా కూడా లేదు. సినిమా చూస్తున్నంత సేపూ ఇతన్ని గట్టిగా కొట్టాలి అని ప్రేక్షకులు ఫీలవుతారు. అంతలా ఈ పాత్రకి తన బెస్ట్ ఇచ్చేశాడు. అలాగే అతనికి ఏమాత్రం తీసిపోకుండా అనూష కృష్ణ కూడా అద్భుతంగా నటించింది. డౌట్ లేదు టాలీవుడ్ కి ఆమె రూపంలో మరో ప్రామిసింగ్ నటి దొరికింది అని చెప్పొచ్చు. రితిక శ్రీనివాస్ కూడా ఎన్నారైగా బాగానే చేసింది. మురళీధర్ గౌడ్ ఒకటి రెండు సీన్స్ లో కనిపించాడు. అంతకు మించి అతను చేసింది ఏమీ లేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టు నటించారు.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్షన్
సెకండాఫ్
రన్ టైం 2 గంటలు మాత్రమే ఉండటం

మైనస్ పాయింట్స్ :

కొన్ని లాజిక్స్ మిస్సవ్వడం
తెలిసిన నటీనటులు ఎక్కువగా లేకపోవడం

మొత్తంగా.. ‘పేకమేడలు’ ఓ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ తో తీసిన సినిమా. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఓటీటీకి పర్ఫెక్ట్ సినిమా ఇది. కానీ ప్రేక్షకులు థియేటర్ వరకు వచ్చి చూసేంత ఎక్సైట్ అయితే చేయదు.

రేటింగ్ : 2.25/5

– Kumar Naidu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు