Darling Movie Review : డార్లింగ్ మూవీ రివ్యూ

Darling Movie Review : ప్రియదర్శి హీరోగా కూడా మారి ‘మల్లేశం’ ‘బలగం’ వంటి మంచి సినిమాలు తీస్తున్నాడు. ‘హనుమాన్’ తో పెద్ద హిట్ కొట్టారు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి..లు! ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే.. సహజంగానే మంచి అంచనాలు ఏర్పడతాయి. పైగా ప్రభాస్ సూపర్ హిట్ సినిమా పేరు ‘డార్లింగ్’ ని టైటిల్ గా పెట్టుకున్నారు. మరి పాత ‘డార్లింగ్’ లా ఈ కొత్త ‘డార్లింగ్’ అలరించిందా? లేదా? అనేది తెలుసుకుందాం రండి :

కథ :

ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటాడు రాఘవ్ (ప్రియదర్శి). అతనికి చిన్నప్పటి నుండి ఒకటే కోరిక..! అదేంటంటే.. పెళ్లైన తర్వాత తన భార్యతో కలిసి ఎలాగైనా పారిస్‌కు హనీమూన్ వెళ్లాలని..! అందుకోసం సేవింగ్స్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో తండ్రి (మురళీధర్ గౌడ్) చూసిన నందిని (అనన్యా నాగళ్ల) అనే సైకాలజిస్ట్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. కానీ వీరి పెళ్లి పీటలపైనే ఆగిపోతుంది. దీంతో రాఘవ్ ఆత్మహత్య చేసుకోవాలని ఓ కొండా మీదకి వెళ్తాడు. అదే టైంలో అతనికి ఊహించని విధంగా ఆనంది (నభా నటేష్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. పరిచయమైన కొన్ని గంటల్లోనే వీరు పెళ్లి చేసుకుంటారు. అయితే ఫస్ట్ నైట్ రోజున రాఘవ్ కి చేదు అనుభవం ఎదురవుతుంది. ఎందుకంటే ఆమె స్ప్లిట్ పర్సనాలిటీ కాబట్టి.! ఆనందిలో ఐదుగురు (ఆది, మాయ, ఝాన్సీ, పాప, శ్రీ శ్రీ) ఉంటారు. దీంతో రాఘవ్ కి చాలా సమస్యలు తలెత్తుతాయి. చివరికి తన భార్యని కాపాడుకోగలిగాడా? లేదా అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

టాలీవుడ్ ఫిలిం మేకర్స్ అంతా ఓ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయంలో నిజంగా టాలీవుడ్ వెనుకపడి ఉంది కాబట్టి..! తెలుగులో ఎంతోమంది టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరినీ కాదని ఎప్పుడూ ఫ్లైట్ దిగిన వాళ్ళకే అగ్ర స్థానం ఇస్తున్నారు. వాళ్ళు ఏది చెబితే అది ‘ఎందుకు?’ అని ప్రశ్నించకుండా చేసేస్తున్నారు. ‘డార్లింగ్’ విషయంలో కూడా ఇదే జరిగింది. అశ్విన్ రామ్ అనే తమిళ దర్శకుడు తెరకెక్కించిన సినిమా ఇది. ‘రాజా రాణి’ సినిమాకి అసిస్టెంట్ గా పనిచేశాడు ఇతను. తమిళంలో 2 సినిమాలు తీశాడు. అవి ఆడలేదు. ఇతనికి అక్కడ పెద్ద ఛాన్సులు ఏవీ లభించలేదు. అసలు ఛాన్సులే రావడం తగ్గిపోయాయి. దీంతో అతను టాలీవుడ్ కి వచ్చి జల్లెడ పట్టగానే ‘బలగం’ హీరో ప్రియదర్శి, ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి, చైతన్య..లు దొరికేసినట్టు ఉన్నారు. అంతే ఏమాత్రం తల, తోక లేని కథ చెప్పి దానికి ‘డార్లింగ్’ అనే పేరు పెట్టి హైప్ తెచ్చేసుకునే ప్రయత్నం చేశాడు. ‘మ్యాడ్ మాక్స్ ఎంటర్టైన్మెంట్’ ‘వై థిస్ కొలవరి’ వంటి ఏంటేంటో మాటలు చెప్పేయడం వల్ల ఇతను పెద్ద క్రియేటర్ అని నిరంజన్ రెడ్డి, చైతన్య అనుకున్నారేమో. అందుకే తాము తీసిన ‘హనుమాన్’ ఓ ఫ్లూక్ హిట్ అని మర్చిపోయి ఛాన్స్ ఇచ్చేశారు. వీళ్ళు మాత్రమే కాదు టాలీవుడ్ నిర్మాతలు చాలా మంది ఇదే ట్రాన్స్ లో ఉన్నారు.

- Advertisement -

ఇక సినిమా గురించి చెప్పుకోవాలి అంటే.. ‘డార్లింగ్’ మొదటి 15 నిమిషాలు ఓకే. ఆ తరువాత నుండి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతూ సాగుతుంది. ఏ దశలోనూ కూడా అలరించే విధంగా ఉండదు. రామ్ కామ్ సినిమాకి 2 గంటల 40 నిమిషాల రన్ టైం ఎందుకు? అని నిర్మాతలు ప్రశ్నించలేదు అంటే.. అది వారి గుడ్డినమ్మకమైనా అయ్యుండాలి, అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు అని అయినా అనుకోవాలి? కంప్లీట్ గా డైరెక్షన్ మైనస్. సినిమాటోగ్రఫీ ఒకటి బాగుంది. సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పుకోదగిన విధంగా ఏమీ లేవు.. కానీ పర్వాలేదు.

ప్రియదర్శి ఎప్పటిలానే బాగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు అతని పై సింపతీ పెరుగుతూనే ఉంటుంది. నభా నటేష్.. కొంతవరకు బాగా చేసింది. మిగిలిన శాతం విసిగించింది. అనన్య నాగళ్ళ ‘మల్లేశం’ తర్వాత మరోసారి ఈ సినిమాలో ప్రియదర్శి పక్కన చేసే ఛాన్స్ దక్కించుకుంది. ఆమె పాత్ర ఓకే. ఇంకొంచెం సేపు ఆమె ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. లుక్స్ పరంగా కూడా అనన్య ఇందులో బాగుంది. బ్రహ్మానందం, రఘుబాబు వంటి ఎంతోమంది పేరున్న నటీనటులు ఈ సినిమాలో నటించినా.. ఎవరి పాత్ర కూడా సినిమాకి ఆయువుపట్టుగా నిలవలేకపోయింది.

ప్లస్ పాయింట్స్ :

ప్రియదర్శి
ఒకటి రెండు కామెడీ సీన్లు

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
స్క్రీన్ ప్లే
సెకండాఫ్ మొత్తం

మొత్తంగా… ‘డార్లింగ్’ అనే మంచి టైటిల్ ని చెడగొట్టడమే కాకుండా.. ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష పెట్టిన సినిమా ఇది. ఓటీటీలో కూడా భరించడం కష్టమే..! సింపుల్ గా స్కిప్ కొట్టేయొచ్చు.

రేటింగ్ : 1/5

– Kumar Naidu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు