Purushottamudu Movie Review: పురుషోత్తముడు మూవీ రివ్యూ

Purushottamudu Movie Review: రాజ్ తరుణ్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ‘పురుషోత్తముడు’ ఒకటి. ఈ మధ్య లావణ్య కాంట్రోవర్సీ వల్ల.. ఇతను ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. అందువల్ల ‘ ‘పురుషోత్తముడు’ అనే టైటిల్ రాజ్ తరుణ్ కి ఎలా పెట్టారు?’ అంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చల వల్ల ఈ సినిమా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ :

రచిత్ రామ్(రాజ్ తరుణ్) పీఆర్(పరశురామ్ కార్పొరేట్ కంపెనీ) కంపెనీకి వారసుడు.లండన్లో చదువుకుని హైదరాబాద్ కి వస్తాడు. రచిత్ రామ్..ని సీఈవోని చేయాలనీ ఇతని తండ్రి ఆదిత్య రామ్( మురళీశర్మ) డిసైడ్ అవుతాడు. అందులో భాగంగా బోర్డు మీటింగ్ పెట్టి.. బోర్డు మెంబర్స్ తో చెప్పి అనౌన్స్ చేసే క్రమంలో.. రచిత్ పెద్దమ్మ వసుందర(రమ్యకృష్ణ) , ఆమె కొడుకు(విరాన్ ముత్తంశెట్టి) అభ్యంతరాలు తెలుపుతారు. అతన్ని సీఈవోని చేయాలంటే…తమ కంపెనీలోని ఓ బైలాని ఫాలో అవ్వాలని కండీషన్ పెడతారు. దాని ప్రకారం రచిత్ రామ్ వందరోజుల పాటు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. అతను ఎక్కడ ఉన్నది.. కుటుంబ సభ్యులకి కానీ, స్నేహితులకి కానీ తెలుపకూడదు. అలాగే అతని బ్యాక్ గ్రౌండ్ ఎక్కడా బయటపెట్టకూడదు. ఏ విధంగానూ బయటపడకూడదు. దీంతో అతను కట్టుబట్టలతో బయటకి వెళ్ళిపోయి వైజాగ్ ట్రైన్ ఎక్కేస్తాడు. అయితే ఊహించని కారణాల వాళ్ళ మధ్యలో వచ్చిన కడియం స్టాప్లో దిగిపోతాడు. ఆ తర్వాత అమ్ములు(హాసిని సుధీర్) పొలంలో పనికి చేరతాడు. అదే టైములో ఆ ఊర్లో ఉన్న రైతులకి అండగా నిలబడతాడు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చే క్రమంలో ఆ ఊరిని పీడించుకుని తింటున్న పెద్దలకి శత్రువు అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? రచిత్ రామ్ సీఈవో అయ్యాడా? అమ్ములుతో ప్రేమ వ్యవహారం సక్సెస్ అయ్యిందా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ చూస్తూనే.. ‘శ్రీమంతుడు’ ‘మహర్షి’ వంటి సినిమాల ఛాయలు ఉన్నట్టు ఎవ్వరికైనా డౌట్ వస్తుంది. వాటికి ప్రిపేర్ అయ్యి సినిమాకి వెళితే.. ‘అరుణాచలం’ ‘పిల్ల జమిందార్’ ‘బిచ్చగాడు’ వంటి ఇంకా కొన్ని అరడజను సినిమాలు గుర్తుచేసే విధంగా సినిమా సాగుతుంది. కథ పరంగా ఏమాత్రం కొత్తదనం ఉండదు. కానీ దర్శకుడు రామ్ భీమన స్క్రీన్ ప్లేతో కొంత మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. అది బి,సి సెంటర్ ఆడియన్స్ కి నచ్చుతుందేమో కానీ మల్టిప్లెక్స్ ఆడియన్స్ కి మాత్రం చిరాకు తెప్పిస్తుంది. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతున్న ఈ టైంలో ఇలాంటి రొట్టకొట్టుడు మాస్ సినిమా ఏంట్రా బాబు? అని వాళ్ళు నెత్తి కొట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ టెక్నికల్ గా రిచ్ గా కనిపిస్తుంది ఈ మూవీ. ఇంకా చెప్పాలంటే రాజ్ తరుణ్ కెరీర్లో ఇంత క్వాలిటీ సినిమాని ఇప్పటివరకు ఎవ్వరూ చూసుండరు. పి.జి.విందా సినిమాటోగ్రఫీ కానీ, గోపిసుందర్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ లుక్స్ బాగున్నాయి. ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపించాడు. కానీ ఎన్నారైగా ఇతను ఏమాత్రం ఫిట్ అవ్వలేదు. బాడీ లాంగ్వేజ్ లో కూడా సడన్ గా గోదావరి యాస వచ్చేస్తుంటుంది. ఇలాంటి బరువైన కథ, కథనాలు మోసే ఇమేజ్ కూడా అతనికి లేదు. కాబట్టి.. జస్ట్ పాస్ మార్కులు మాత్రమే వేయించుకుంటాడు. హీరోయిన్ హాసిని సుధీర్ లుక్స్ కానీ, నటన కానీ ఏమాత్రం అట్రాక్ట్ చేసే విధంగా లేవు. అల్లు అర్జున్ బావమరిది అయిన విరాన్ ముత్తంశెట్టి విలన్ గా మారాలని ట్రై చేశాడు. కానీ మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు అతను ఫోన్లో రౌడీలతో మాట్లాడుతూ ఉండటం తప్ప ఇంకేం చేసింది లేదు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ..ల పాత్రలు బాగానే ఉన్నాయి. ప్రవీణ్ కామెడీ చాలా అంటే చాలా రొటీన్ గా చిరాకు తెప్పించే విధంగా ఉంది. మిగిలిన వాళ్ళ పాత్రలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.

ప్లస్ పాయింట్స్ :

క్లైమాక్స్

ప్రొడక్షన్ వాల్యూస్

రన్ టైం 2 గంటలే ఉండటం

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

స్క్రీన్ ప్లే

మొత్తంగా.. ‘పురుషుత్తముడు’ పరమ రొటీన్ సినిమా. క్లైమాక్స్ లో ఒకటి, రెండు సన్నివేశాలు, కొన్ని విజువల్స్ తప్ప.. చెప్పుకోడానికి కొత్తగా ఏమీ ఉండదు.

రేటింగ్ : 2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు